సీనియర్‌ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరి అరెస్ట్‌ అన్యాయం | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరి అరెస్ట్‌ అన్యాయం

Apr 16 2026 10:00 AM | Updated on Apr 16 2026 10:00 AM

నెహ్రూనగర్‌: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాజీ సీపీఆర్‌ఓ, సీనియర్‌ జర్నలిస్ట్‌ పూడి శ్రీహరిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేసి శ్రీహరి నివాసంలో సోదాలు నిర్వహించడం అర్ధరహితమని చెప్పారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అన్నారు. పోలీస్‌లు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సుప్రీంకోర్టు నిబంధనలను పాటించకుండా అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్‌ యంత్రాంగం అధికార పార్టీ విభాగంగా మారిందని ఎద్దేవా చేశారు. సోషల్‌ మీడియా పోస్టుల సాకుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. ఇప్పటి వరకు సోషల్‌ మీడియా యాక్టివిస్టులను గత 22 నెలలుగా 1500 మందిపై కేసులు నమోదు చేశారని, దాదాపు 2,800 మందిపై రాజకీయ అరెస్టులు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తలు, సోషల్‌ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులపై గత 22 నెలలుగా ఎంత మందిని అరెస్టు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ముందు రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం ఉంచాలని డిమాండ్‌ చేశారు.

జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు

వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement