లక్ష్మీపురం: ఔటర్ రింగ్ రోడ్డు బాధితుల రాష్ట్ర సదస్సును ఈనెల 21వ తేదీ విజయవాడ బందర్ రోడ్డులోని ఎంబీ భవన్‌లో నిర్వహిస్తున్నామని, బాధిత రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్‌లో ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతుల పోరాట కమిటీ జిల్లా సమావేశం బుధవారం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 189 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సిద్ధమైనదని, ఈ మేరకు ఐదు జిల్లాల పరిధిలోని 121 గ్రామాల్లో భూముల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. రైతులతో చర్చలు కానీ, రైతులు వివరాలు కానీ ఇవ్వకుండా భూమిలో మార్కింగ్ చేశారన్నారు. సుమారు పదివేల మంది రైతులు భూములు కోల్పోతారన్నారు. న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచక తప్పదు అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ 140 మీటర్లు మాత్రమే తీసుకుంటున్నట్టు కొంతమంది రైతులకు తెలియజేయడం జరిగిందన్నారు. కానీ మిగిలిన జిల్లాలో 250 మీటర్లు కచ్చితంగా తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్లు తెలియజేయడం రకరకాల అనుమానాలకు దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకులు వై.నేతాజీ, రైతు నాయకులు బిక్కి శ్రీనివాసరావు, రైతులు చిరుమామిళ్ల రంగారావు, కోయ కోటేశ్వరరావు, ఎస్ సాంబశివరావు, ఈ.నిరంజన్, సీహెచ్, కృష్ణ్ణమోహన్, కె. పద్మావతి, జై.లలిత, జి.సాంబశివరావు, ఎస్.సాంబశివరావు, పి తేజ పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య


