నో.. టిఫికేషన్‌! | - | Sakshi
Sakshi News home page

నో.. టిఫికేషన్‌!

Apr 15 2026 7:50 AM | Updated on Apr 15 2026 7:50 AM

నో.. టిఫికేషన్‌! ● జీజీహెచ్‌, గుంటూరు వైద్య కళాశాల అధికారుల నిర్లక్ష్యం ● రెండేళ్లుగా ప్రమోషన్‌లకు, ఉద్యోగాలకు ప్రకటనలు ● దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది నిరుద్యోగులు ఒక్క అడుగూ ముందుకు పడని నియామక ప్రక్రియ

ఫైల్స్‌ పక్కన పడేసి..

ఏడాదిగా జీతాలు లేదు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌, గుంటూరు వైద్య కళాశాల అధికారుల తీరుతో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ రిక్రూట్‌మెంట్‌ చేయడం లేదు. ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ ప్రమోషన్‌లు ఇవ్వడం లేదు. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌ అధికారుల తీరుతో పనిచేస్తున్న ఉద్యోగులు పదోన్నతులు రాక తీవ్రంగా నష్టపోతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక మనోవేదనకు గురవుతున్నారు. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఉద్యోగాలకు గత ఏడాది నోటిఫికేషన్‌

గుంటూరు వైద్య కళాశాలలో గత ఏడాది ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ సంవత్సరం సెప్టెంబరు 9న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 61 పోస్టులు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ద్వారా రిక్రూట్‌ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గత ఏడాది నవంబరులో ఫైనల్‌ మెరిట్‌ లిస్టు పెట్టి ఉద్యోగాలు ఇస్తామని రిక్రూట్‌మెంట్‌ షెడ్యూల్‌లో ప్రకటించారు. గుంటూరు జీజీహెచ్‌, గుంటూరు జీజీహెచ్‌ నాట్కో క్యాన్సర్‌సెంటర్‌, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో పలు రకాల టెక్నీషియన్‌ పోస్టులు, సపోర్టింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలకు ఎంతో మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత ఏడాది నవంబరులో ఉద్యోగ నియామకం చేపట్టాల్సిన అధికారులు ఇప్పటి వరకు కనీసం ప్రొవిజన్‌ మెరిట్‌ లిస్టు కూడా ప్రకటించలేదు. ఉద్యోగాలు భర్తీ చేస్తారా, లేదా.. అనే అనుమానం నిరుద్యోగుల్లో నెలకొంది. ఉద్యోగులను మరో ఐదు నెలల్లో భర్తీ చేయని పక్షంలో గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత ఏడాదిలోపు సదరు రిక్రూట్‌మెంట్‌ నిర్వహణ చేయకపోతే నోటిఫికేషన్‌ రద్దవుతుంది. ఈ నేపథ్యంలో నెల, రెండు నెలల రోజుల్లో చేయాల్సిన నియామకాలను తొమ్మిది నెలలు గడిచినా చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

ప్రమోషన్‌లకూ అదే పరిస్థితి

గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డు అసిస్టెంట్‌ పోస్టులను ప్రమోషన్‌ల ద్వారా భర్తీ చేసేందుకు ఆసుపత్రి అధికారులు రెండేళ్లుగా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రమోషన్లు మాత్రం ఇవ్వడం లేదు. ప్రతి ఏడాది ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు తమకు ప్రమోషన్లు వస్తున్నాయని ఎంతో ఆశతో నోటిఫికేషన్‌ వెలువడగానే దరఖాస్తు చేసుకుంటున్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏడాదిలోపు ప్రమోషన్‌ ఇవ్వకపోవడంతో నోటిఫికేషన్‌ సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారం రద్దు చేస్తున్నారు. ఇలా మూడు పర్యాయాలుగా ఆసుపత్రిలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కింది స్థాయి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు.

గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ అధికార పరిధిలో గుంటూరు జీజీహెచ్‌, గోరంట్ల జ్వరాల ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ఉన్నాయి. వీటిల్లో నోటిఫికేషన్‌ ఇచ్చేటప్పుడు హ్యూమన్‌ రీసోర్స్‌ (హెచ్‌ఆర్‌) విధులన్నీ గుంటూరు వైద్య కళాశాల అధికారులు చూడాల్సి ఉంటుంది. ఫైనాన్స్‌ విషయాలు గుంటూరు జీజీహెచ్‌ అధికారులు చూస్తుంటారు. గతంలో వైద్య కళాశాలకు సంబంధించిన విషయాలన్నీ కళాశాల ఏడీ, ప్రిన్సిపాల్‌, జీజీహెచ్‌కు సంబంధించిన విషయాలన్నీ రిక్రూట్‌మెంట్‌లు, హెచ్‌ఆర్‌ పనులు, ఫైనాన్స్‌ పనులన్నీ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, ఏడీలే చూసేవారు. హెల్త్‌ సెక్రటరీగా కృష్ణబాబు పనిచేస్తున్న సమయంలో వైద్య కళాశాల, జీజీహెచ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్ల విధులు కొంత మార్పు చేశారు. వైద్య కళాశాలకు సంబంధించిన ఫైనాన్స్‌ పనులు, జీజీహెచ్‌కు సంబంధించిన ఫైనాన్స్‌ పనులు గుంటూరు జీజీహెచ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చూసుకోవాలి. రిక్రూట్‌మెంట్లు, హెచ్‌ఆర్‌ పనులు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌కు సంబంధించినవి రెండు కూడా గుంటూరు జీజీహెచ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ చూసుకోవాలి. వైద్య కళాశాల, జీజీహెచ్‌ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. వారికి నచ్చిన ఫైల్స్‌ మాత్రం పరస్పర ఒప్పందంతో త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ఎంతో మందికి ఉపయోగపడే పనులు మాత్రం ముఖ్యంగా ప్రమోషన్లు, రిక్రూట్‌మెంట్‌లకు సంబంధించినవి పక్కన పడేస్తున్నారు. జీజీహెచ్‌ చైర్మన్‌గా ఉండే జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ ఒకసారి దీనిపై దృష్టి సారించి జీజీహెచ్‌లో సిబ్బంది కొరత లేకుండా త్వరితగతిన రిక్రూట్‌మెంట్‌ జరిగేలా చూడాలని, రోగుల ఇబ్బందులు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

గుంటూరు జీజీహెచ్‌లో 2025 మార్చిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేశారు. గుంటూరు జీజీహెచ్‌ నాట్కో సెంటర్‌లో 27 మంది ఉద్యోగులు సదరు రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగాలు పొందారు. ఈ ఏడాది మార్చికి వారు చేరి ఏడాది అయింది. అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క నయాపైసా జీతం చెల్లించలేదు. ఏడాదిగా వేతనాలు లేకుండానే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కడుపులో బాధ దిగమింగుకుంటూ సేవలు అందిస్తున్నారు. సదరు ఉద్యోగులకు వేతనాలు వేసేందుకు ప్రభుత్వం ఆప్కాస్‌ విధానం ప్రవేశపెట్టింది. ఆప్కాస్‌ వెబ్‌సైట్‌లో జీజీహెచ్‌ అధికారులు పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లు నమోదు చేయకుండా గత ఏడాది ఐదు నెలల పాటు తాత్సారం చేశారు. దీంతో ప్రస్తుతం వెబ్‌సైట్‌ పనిచేయక కాంట్రాక్టు ఉద్యోగుల పేర్లు ఆప్కాస్‌లో నమోదు కాలేదు. ఆసుపత్రి అధికారులు, కార్యాలయ ఉద్యోగులు చేసిన తప్పిదాలకు 27 మంది కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ చిరుద్యోగులు వేతనాలు లేక అలమటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement