చేబ్రోలు: స్వల్ప విషయాన్ని రాద్ధాంతంగా మార్చి టీటీపీ నాయకుల ప్రోత్సాహంతో రాజకీయం చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన గ్రామంలో ఉద్రికత్తలకు కారణంగా నిలిచింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద ఈ నెల 7వ తేదీన తిరునాళ్ల జరిగింది. గుడి ఎదురుగా 50 సంవత్సరాల క్రితం స్థానిక దాతలు బస్ షెల్టర్‌ను నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరటంతో ఆ ప్రాంతంలో మందుబాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఆలయ ధర్మకర్తల కుటుంబసభ్యులు గుడి వద్ద భక్తులకు ఉపయోగపడేందుకు శిథిలావస్థలో ఉన్న షెల్టర్‌ను తొలగించారు. స్థానిక టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేబ్రోలు స్టేషన్ నుంచి ఎస్‌ఐ కే వీరనారాయణ సిబ్బందితో కలిసి పోలేరమ్మ గుడి సెంటర్ వద్ద షెల్టర్ వద్దకు వెళ్లారు.
రోడ్డు పక్కన వెళ్తున్న వారికి ఇబ్బందులు
కొత్తరెడ్డిపాలెంలోని పోలేరమ్మ గుడి సెంటర్‌లో సంఘటనా ప్రాంతం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. షెల్టర్ తొలగింపు చేపట్టిన విషయాన్ని వాస్తవాలను గుర్తించాల్సిన పోలీసులు దానిని తుంగలో తొక్కారు. గ్రామానికి చెందిన గాదె వినయభూషణ్‌రెడ్డి ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులు ఆపి సంఘటన గురించి వివరాలు అడిగారు. ఫిర్యాదు చేసిన వారినే అడిగితే వారే పేర్లు చెబుతారుగా అని సమాధానం చెప్పటం పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. ఎస్‌ఐ వీరనారాయణ అసభ్యకరంగా బూతులతో మాట్లాడటంతో... సక్రమంగా మాట్లాడాలని వినయభూషణ్‌రెడ్డి చెప్పారు. దీంతో జీపులో ఎక్కించి వారికి మర్యాదలు చేయండి అని సిబ్బందికి చెప్పటంతో గ్రామస్థులు అడ్డుతిరిగారు. వినయభూషణ్‌రెడ్డిని, ఆయన భార్య గీతావాణి, బీబీఏ చదువుతున్న శశిదత్రాయరెడ్డిలను ఎస్‌ఐ ఈశ్వర్, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు జీబులో స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లారు. గుండె సంబంధ వ్యాధితో బాదపడుతున్న వినయభూషణ్‌రెడ్డిని అర్ధరాత్రి రెండు గంటల వరకు నిలబెట్టి ఇబ్బందులకు గురిచేశారు. కానిస్టేబుల్‌తో పోలీసులపై దౌర్జన్యం చేశారనే తప్పుడు ఫిర్యాదుతో వారి కుటుంబసభ్యులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 8వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్ వద్ద ఉంచి ఇబ్బంది పెట్టారు. చదువుతున్న ఆయన కుమారుడిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్లు వినకపోతే మీ అంతు చూస్తామని బెదిరింపులకు పోలీసులు దిగారు.
వారు తొలగిస్తే వైఎస్సార్‌సీపీ వారిపై కేసులు
షెల్టర్‌ను తొలగింపు పనులు చైన్నె ప్రాంతానికి చెందిన లింగమ్మ ఉరఫ్ లీలావతి చేపట్టినట్లు ఆమె పంచాయతీకి, పోలీసులకు తెలియజేసింది. నాలుగు రోజులుగా పోలీసు స్టేషన్‌కు, పంచాయతీకి తిరిగినా ఆమె మొర ఆలకించలేదు. వారికి కావలసిన చైన్నెలో ఉన్న ఉడుముల కోటేశ్వరరెడ్డి, ఉడుముల నరసింహరెడ్డి, గ్రామంలోని వైఎస్సార్‌సీపీకి చెందిన గాదె కేశవరెడ్డి, కొల్లి శేషిరెడ్డిలపై కేసు నమోదు చేశారు. 50 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన భవనం రాఘవరెడ్డి సొంత స్థలంలో బస్ షెల్టర్‌ను ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించారు. ప్రస్తుతం అది ప్రభుత్వ స్థలం అని, దానిలో అనుమతి లేకుండా ఎవరూ ఈత కొట్టవద్దని పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.
హైకోర్టు న్యాయవాదిపై ఎస్‌ఐ వీరంగం
కొత్తరెడ్డిపాలెంలో జరిగిన సంఘటనపై కేసు వివరాలు తెలుసుకోవటానికి వచ్చిన హైకోర్టు న్యాయవాది శివప్రసాద్‌పై చేబ్రోలు ఎస్‌ఐ పి. వీరనారాయణ వీరంగం సృష్టించారు. హర్ట్ పేషంట్‌ను, మహిళలను అర్ధరాత్రి వరకు స్టేషన్‌లో ఉంచటంపై న్యాయవాది ప్రశ్నించటంతో ఎస్‌ఐ అసహనానికి గురయ్యారు. సీసీటేజీల గురించి, ఎఫ్‌ఐఆర్‌ల గురించి హైకోర్టు న్యాయవాది వివరాలను అడగటంతో ఎస్‌ఐ లేచి మీదకు రావటంపైజిల్లా ఎస్‌పీకి ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాది శివప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు పోలీసులు గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయటం, పోలేరమ్మ గుడి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


