మంగళగిరి టౌన్: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి విమర్శించారు. మంగళగిరిలో ఐద్వా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువతకు అందుతున్నాయన్నారు. చంద్రబాబు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పడం తప్ప కార్యాచరణ లేదని అన్నారు. పాఠశాల విద్యార్థులకు కూడా అందుబాటులో గంజాయి దొరకడం వలన వారి భవిష్యత్ నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం వలన పనిదినాలు తగ్గిపోయాయని తెలిపారు. మహిళలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మహిళలకు భద్రత లేకపోవడంతో అత్యాచారాలు, దాడులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలియజేశారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస కుమారి మాట్లాడుతూ పసిపిల్లలు సైతం దాడులకు గురికావాల్సి వస్తోందని, సమాజంలో సీ్త్ర విముక్తి కోసం మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఐద్వా పనిచేస్తుందని అన్నారు. దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై త్వరితగతిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సక్రమంగా విద్య అందించకపోవడం వలన డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయన్నారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ, నాయకులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి


