ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
గుంటూరు మెడికల్: అగ్రరాజ్యం అమెరికా నుంచి పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు పలువురు వైద్యులు గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తించి, దాన్ని అరికట్టేందుకు తమవంతు సాయం చేసేందుకు అమెరికా నుంచి గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకున్న పూర్వ వైద్య విద్యార్థుల సహాయ సహకారాలతో గుంటూరు జీజీహెచ్‌కు నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో సోమవారం ఉచితం క్యాన్సర్ వైద్య శిబిరం ప్రారంభమైంది. అమెరికాకు చెందిన వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొని వైద్యపరీక్షలుచేశారు. ఈనెల 16వరకు నాలుగురోజులపాటు వైద్య శిబిరం కొనసాగనుంది. కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ప్రారంభించారు. అమెరికాకు చెందిన పీఐఎన్‌సీసీ సంస్థ సహకారంతో డాక్టర్ కడియాల సమత నేతృత్వంలో శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులు డాక్టర్ జీన్ టాల్బర్ట్, డాక్టర్ కారోల్ హబాక్, డాక్టర్ పీఎన్ పార్వతి, గుంటూరు వైద్యకళాశాల ఓబీజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఆంకాలజీ, పాథాలజీ విభాగ నిపుణులు కలిసి హెచ్‌పీవీసీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 112 మంది మహిళలను పరీక్షించగా, 8 మందిలో ప్రారంభ లక్షణాలు గుర్తించి వారికి తగిన చికిత్స అందించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ విజేత, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ అరుణ, కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత, నాట్కో సమన్వయకర్త యడ్లపాటి అశోక్ కుమార్, పోతురాజు సమత, వైద్యులు పాల్గొన్నారు.


