అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలి జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ 447 అర్జీలు స్వీకరణ
గుంటూరు వెస్ట్: పెండింగ్ అర్జీలపై శాఖాధికారులు తక్షణం చర్యలు తీసుకుని పరిష్కరించాలని, నిర్ధిష్టమైన కారణం లేకుండా అర్జీలు పెండింగ్ పెడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సాయికాంత్ వర్మ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలితో కలసి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా వేసవి కావడంతో పదేపదే తిప్పుకోకుండా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత కక్షలతో పదే పదే వచ్చే అర్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం వచ్చిన 447 అర్జీలను కలెక్టర్‌తోపాటు డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, జిల్లా అధికారులు పరిశీలించారు.


