తాడేపల్లిరూరల్: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని, ఆయన అడుగు జాడల్లో నడవాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11న పూణేలో జ్యోతిరావు పూలే జన్మించారని, చిన్ననాటి నుంచే కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి, తన భార్యని పాఠశాలకు పంపి, 1848లో పూణేలో బాలికల కోసం మొట్టమొదటి సారిగా పాఠశాలను స్థాపించారని అన్నారు. వితంతు పునర్వివాహాలు జరిపించి సమాజంలో చైతన్యం తీసుకు వచ్చారని, మహిళల విద్య, దళిత బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, ఈశ్వర్, ఆకాశపు స్వామి, ఈశ్వరరావు, చిలకలపూడి పాపారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జ్యోతిరావు పూలే ఆశయాలకు
అనుగుణంగా నడుచుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా అన్నారు. శనివారం నల్లచెరువులోని మహావీర్ జూనియర్ కాలేజీలో కొనసాగుతున్న టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఈఓ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధి కోసం నిరంతరం తపించిన వ్యక్తి పూలే అని, బాల్యం నుంచే తన వయసు పిల్లల స్థాయికి మించిన పుస్తకాలు చదివే వారని, మనం ఎంత ప్రశ్నిస్తే అంత జ్ఞానాన్ని పొందుతారని చెప్పారని అన్నారు. విద్య, జ్ఞాన సముపార్జనను జీవిత లక్ష్యాలుగా ఎంచుకుని, విద్యావకాశాలు లేని ప్రాంతాల్లో తన సతీమణి సావిత్రీబాయి పూలేతో కలసి పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. బాలికల కోసం పాఠశాలలను తెరవాలని, బాలికా విద్య కోసం సావిత్రీబాయి పూలేను దేశపు తొలి తరం మహిళా ఉపాధ్యాయునిగా తయారు చేసి, తద్వారా మహిళా విద్యాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.యేసురత్నం, ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ కె.వెంకట్ రెడ్డి, ఎంఈవోలు కె.విజయభాస్కర్, ఎండీ ఖాసిం, ఉపాధ్యాయులు శాంతి ప్రియ, అనుపమా దేవి, శారద, పలువురు హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో..
నగరంపాలెం: మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారతకై చేసిన సేవలను స్మరించుకోవాలని హోంగార్డు ఆర్‌ఐ రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్‌ఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. తద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మహాత్మా పూలే ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.


