బీసీల హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

బీసీల హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధం

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్‌ మంగళగిరిలో నిరవధిక దీక్ష ప్రారంభం

మంగళగిరి టౌన్‌: బీసీల న్యాయమైన హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్‌ అన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం బీసీల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బీపీ మండల్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీక్షకు జ్యోతిరావు పూలే వారసురాలు నీతా రమాకాంత్‌, బీపీ మండల్‌ వారసులు సూరజ్‌ మండల్‌ హాజరై మద్దతు ప్రకటించారు. రామచంద్ర యాదవ్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో జరిగిన బీసీ సింహగర్జన ద్వారా ప్రభుత్వానికి బీసీల 5 ప్రధాన డిమాండ్లను స్పష్టంగా తెలియజేసినా నేటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. డిమాండ్లపై తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టం చేస్తామని చంద్రబాబు, లోకేష్‌ ప్రగల్భాలు పలికారని అన్నారు. రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ముసాయిదా కూడా రూపుదిద్దుకోలేదని, ఎప్పుడూ తప్పుడు కధనాలతో బీసీలను వంచించే కార్యక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని విమర్శించారు. కార్పొరేషన్లు ఇస్తున్నామని చెప్పి ఒక్కరూపాయి కూడా నిధులు కూడా కేటాయించకుండా మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లను నెరవేర్చేంత వరకు బీసీ ధర్మదీక్ష కొనసాగుతుందని, దీక్షను భగ్నం చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement