పెదకాకాని: యూఎస్‌ఏ మిసెస్ తెలుగు సౌందర్య పోటీల సంస్థ ఆధ్వర్యంలో మిసెస్ తెలుగు యూఎస్‌ఏ – 2026 విజేతలను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు జరిగాయి. వివిధ విభాగాల్లో అమెరికా వ్యాప్తంగా 22 మంది విజేతలుగా ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన దొప్పలపూడి వినీల ‘మిసెస్ తెలుగు గుడ్‌విల్ అంబాసిడర్’గా నిలిచారు. సౌందర్యంలోనూ గుంటూరు పేరు చాటారని పలువురు ప్రవాసాంధ్రులు, ప్రముఖులు అభినందించారు. తుళ్లూరు మండలంలోని హరిశ్చంద్రాపురం గ్రామానికి చెందిన అంజమ్మ, నరసింహారావు దంపతుల కుమార్తె వినీల. ప్రస్తుతం గుంటూరులో వీరు స్థిరపడ్డారు. గుంటూరులో పుట్టి పెరిగి, చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికాకు వలస వెళ్లి, ప్రస్తుతం బీఐ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. వినీల అమెరికాలో వివిధ స్థానిక సౌందర్య పోటీలలో పాల్గొని విజయాలు సాధించారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మేడికొండూరు : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మేడికొండూరు సీఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలేటి మనోహర్ (26) ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం తన విధులు ముగించుకొని స్కూటీపై సత్తెనపల్లి వెళుతుండగా మార్గంమధ్యలో మేడికొండూరు సమీపాన ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద పిడుగురాళ్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అజాగ్రత్త నడుపుతూ మనోహర్ పయనిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. ప్రమాదంలో మనోహర్ బస్సు కింద పడి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ప్రమాదంపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు.


