ఆర్‌ఐఓకు ఫిర్యాదు చేసిన విధ్యార్ధి సంఘాల నాయకులు
లక్ష్మీపురం: గుంటూరు చంద్రమౌళినగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ కళాశాలలోని విద్యార్థులకు జెఈఈ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి మోసం చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్‌ఐఓను ఏఐఎస్‌ఎఫ్, ఏఎస్‌ఏ సంఘాల ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయటం బాధాకరమని తెలిపారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు బనాయించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు అమర్నాథ్, నగర నాయకులు మహేష్, ఏఎస్‌ఏ జిల్లా నాయకులు శబరీష్ తదితరులు పాల్గొన్నారు.
కారెంపూడి: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత మంగళవారం మాచర్లలో పురుగుమందు తాగి కౌలు రైతు రాచమంటి రామాంజనేయులు (32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. సత్తెనపల్లి మాదల నుంచి జీవనాధార నిమిత్తం వలస వచ్చి మేనమామ స్వగ్రామమైన కారెంపూడి మండలం ఒప్పిచర్లలో రెండేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది నాలుగెకరాల పొలం ఎకరం రూ.20వేల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. అందులో రెండెకరాలలో ఖరీఫ్‌లో పత్తి వేస్తే నాలుగు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. రబీలో మొక్కజొన్న వేస్తే మొత్తం మీద 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. మిగతా రెండెకరాలలో వరి వేశాడు, వరి పర్వాలేదు కాని పత్తి, మొక్కజొన్న రెండు పంటలలో సరైన దిగుబడి రాక మూడు లక్షల దాకా అప్పులయ్యాయి. రెక్కల కష్టం మీద బతికే అతను అతని స్తోమతకు మించి అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడని తెలుస్తోంది. దీంతో పాటు అనారోగ్య సమస్య రక్తమొలలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మాచర్ల రూరల్ మండలంలో బంధువుల ఇళ్లకు వెళ్లి ఆ తర్వాత మాచర్ల వచ్చి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. చివరిసారి మాట్లాడిన సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మృతదేహాన్ని బంధువులు కనుగొన్నారు. బుధవారం రాత్రి అతని స్వగ్రామం మాదలలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య ముగ్గురు కుమార్తెలున్నారు.
దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ సబావత్ వెంకట్‌నాయక్ అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో జరిగాయి. నారాయణపురంలోని స్వగృహాంలో ఉన్న వెంకట్‌నాయక్ మృతదేహం వద్ద ఎస్‌ఐలు పాపారావు, ఖాసీంపీరా తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. స్థానికులు కూడా నివాళ్లర్పించారు. అనంతరం వెంకటనాయక్ మృతదేహాన్ని నారయణపురం పురవీధుల్లో ఊరేగించారు. నారాయణపురంలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. కానిస్టేబుల్ వెంకట్‌నాయక్ అంత్యక్రియల సందర్భంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్చి శ్రద్ధాంజలి ఘటించారు. వెంకట్ నాయక్ అంత్యక్రియలకు భారీగా జనం తరలివచ్చారు.


