రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య
తెనాలిటౌన్: ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా భూముల్లో మార్కింగ్ చేయటం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అన్నారు. రైతులను సంప్రదించి, వారి అంగీకారంతోనే భూసేకరణ చేయాలని 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పారు. అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్లకు సంబంధించిన తెనాలి మండలంలోని బాధిత రైతాంగ సమావేశాన్ని బుధవారం సాయంత్రం రూరల్ మండల గ్రామం గుడివాడలో నిర్వహించారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. వి.కృష్ణయ్య మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని 10 మండలాల్లో 40 గ్రామాల పరిధిలో ఔటర్ రింగురోడ్డు బాధిత రైతులున్నట్టు చెప్పారు. ఏళ్లుగా సాగుచేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల నుంచి భూములను సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కట్టబెడుతోందని ఆరోపించారు. ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్‌రోడ్డుకు 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం 250 మీటర్ల వెడల్పును ప్రతిపాదించటంలోని ఆంతర్యమేమిటని కృష్ణయ్య ప్రశ్నించారు. గతేడాది డిసెంబరులో భూసేకరణకు కేవలం 25 రోజులే గడువునిచ్చారని గుర్తుచేస్తూ, సామాజిక అధ్యయనానికి ఈ వ్యవధి సరిపోదన్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు అప్రమత్తంగా ఉంది, ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని యువత పరిశీలించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు. రైతులు ముందుకొస్తే వారి పక్షాన రైతుసంఘం పోరాడుతుందని హామీనిచ్చారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఔటర్ రింగురోడ్డు భూసేకరణ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ప్రైవేటు మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నే రమేష్‌బాబు, నన్నపనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉన్న భూమంతా లాక్కుంటున్నారు
గుడివాడకు చెందిన బాధిత రైతు మహిళ పోతురాజు వసుంధర మాట్లాడుతూ తనకు గ్రామంలో గల రెండున్నర ఎకరాల భూమినీ మార్కింగ్ చేశారని సభాముఖంగా చెప్పారు. ఉన్న భూమి మొత్తం తీసుకోవటం ఏమిటని ప్రశ్నించారు.


