అడ్డగోలుకు అడ్డుకట్ట
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 అడ్డగోలుకు అడ్డుకట్ట గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్‌లో పాలకుల తీరు మారలేదు. జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా స్వప్రయోజనాల కోసం ఏకపక్షంగా కొనసాగుతున్న ముందస్తు అనుమతులను వైఎస్సార్ సీపీ సభ్యులు వ్యతిరేకించారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన ఆమె చాంబర్‌లో శనివారం ఏర్పాటుచేసిన స్థాయీ సంఘ సమావేశాన్ని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు బహిష్కరించారు. ప్రణాళిక–ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన ఒకటో స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీలు జెడ్పీ చైర్‌పర్సన్ అవలంభిస్తున్న పక్షపాత ధోరణి, ఏకపక్ష విధానాలను నిరసిస్తూ అజెండాను తిరస్కరించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసుతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అజెండా తిరస్కరణ
జెడ్పీ కార్యాలయంలో ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఆరు స్థాయీ సంఘాలు భేటీ అయ్యి, అజెండాలో పొందుపర్చిన అంశాలపై చర్చించి ఆమోదించాల్సి ఉంది. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన ఆమె ఛాంబర్‌లో నిర్వహించిన ప్రణాళిక–ఆర్థిక స్థాయీ సంఘంలో సభ్యులుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులు కాట్రగడ్డ మస్తాన్‌రావు, పదముత్తం చిట్టిబాబు, పిట్ల వేణుగోపాల్‌రెడ్డి, తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న దృష్ట్యా, ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరణ బడ్జెట్‌తోపాటు వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలను ఆమోదం పొందాల్సి ఉంది. ముందుగా 1వ స్థాయీ సంఘంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం పొందితేనే సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టేందుకు అర్హత ఉంటుంది. దీంతో 2025–26 సవరణ బడ్జెట్‌తో పాటు 2026–27 అంచనా బడ్జెట్ ప్రతిపాదనలను స్థాయీ సంఘంలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ స్వరూపాన్ని సమగ్రంగా ఆలకించిన సభ్యులు ముందస్తు అనుమతుల పేరుతో ఇష్టారాజ్యంగా కేటాయింపులు, జెడ్పీటీసీల ప్రమేయం లేకుండా రూ.కోట్లాది పనులకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. తాము అజెండాలో పొందుపర్చిన అంశాలను ఆమోదించడం లేదని ప్రకటించారు. చైర్‌పర్సన్‌తోపాటు సీఈవో వి.జ్యోతిబసు సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన సభ్యులు స్థాయీ సంఘ అజెండాతోపాటు అనుబంధ అజెండాలను తిరస్కరిస్తున్నట్లు (డీటైన్) చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినాకు లేఖ అందజేశారు. అనంతరం వారు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
జెడ్పీలో ఆర్థిక సంక్షోభం
ఉమ్మడి గుంటూరుజిల్లా పరిషత్ ఆర్థిక సంక్షోభంలో ఉందని రొంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్‌రెడ్డి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.19.50 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.ఎనిమిది కోట్లు వచ్చాయని అన్నారు. రూ.35.22 కోట్లతో పనులు చేపట్టేందుకు ముందస్తు అనుమతులు ఇచ్చారని చెప్పారు. మొత్తం నిధులు రూ.19.50 కోట్లు కాగా అదనంగా రూ.16 కోట్ల మేరకు అనుమతులు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. జనరల్ ఫండ్స్ నుంచి రూ.14.22 కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చారని చెప్పారు. స్టాంప్ డ్యూటీ కింద రూ.35 కోట్లు రావాల్సి ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కేవలం రూ.40 లక్షలు విడుదల చేశారని చెప్పారు. స్థాయీ సంఘ సభ్యుల ఆమోదం తీసుకుని పనులు చేపట్టాల్సిన పరిస్థితుల్లో, కమీషన్లు తీసుకుని పనులు ఆమోదిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జెడ్పీని సొంత జాగీరుగా మార్చుకుని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జెడ్పీలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు.
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సమావేశపు అజెండాను తిరస్కరిస్తూ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినాకు లేఖ అందజేస్తున్న ఒకటో స్థాయీ సంఘ సభ్యులు
స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని
మరోసారి బహిష్కరించిన
వైఎస్సార్ సీపీ సభ్యులు
రూ.కోట్లాది పనులను ఏకపక్షంగా
ఆమోదించడంపై నిరసన
ప్రభుత్వం నుంచి స్టాంప్ డ్యూటీ
నిధులు తెచ్చుకోలేని దుస్థితి
జెడ్పీ చైర్‌పర్సన్‌తో విభేదించిన
వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు
బడ్జెట్ ప్రతిపాదనలు మినహా
ప్రణాళిక–ఆర్థికాంశాల
అజెండాలకు తిరస్కరణ