మహోద్యమ చరిత.. మహోజ్వల భవిత
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
వైఎస్సార్ సీపీ పోరాటానికి స్పందన
నియోజకవర్గంలో 65 వేల సంతకాలు పూర్తి
వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమంలా సంతకాల సేకరణ
కోటి సంతకాల సేకరణలో దూసుకు వెళ్తున్న పొన్నూరు నియోజకవర్గం
పొన్నూరు : చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై చేపట్టిన పోరాటంలో పొన్నూరు నియోజకవర్గ ప్రజలంతా భాగస్వాములయ్యారు. పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో వైద్య, విద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పెదకాకాని, చేబ్రోలు, పొన్నూరు మండలం, పట్టణ పరిధిలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబటి మురళీకృష్ణ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, చంద్రబాబు చేస్తున్న మోసాన్ని వివరించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరంచేసి, వైద్యాన్ని ఉచితంగా అందించే కళాశాలలను దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ప్రజలకు తెలియచేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలలో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 65 వేల సంతకాలు సేకరించారు. ప్రజలు కూడా చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై మండిపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పొన్నూరు పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. పెద్ద సంఖ్యలో పాల్గొని కోటి సంతకాల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ చేపట్టిన ర్యాలీకి వచ్చిన ప్రజాదరణ చూసి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నించి విఫలమైంది. అయినా ప్రజలు వెనుకాడకుండా భారీ సంఖ్యలో ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ మోసాల్ని అంబటి మురళీకృష్ణ ప్రసంగాల్లో ఎండగడుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని పూర్తి చేయాల్సింది పోయి ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ప్రజలకు ఆయన వివరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ వైద్యశాలలే ప్రజల ప్రాణాలను కాపాడాయని, ప్రజల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రైవేటీకరణను విరమింపచేయాలని అంబటి మురళీకృష్ణ అధికారులకు విన్నపం చేశారు.
రేపు కోటి సంతకాల సేకరణ ర్యాలీ
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం నియోజకవర్గంలో 65 వేలు పూర్తయిన సందర్భంగా పొన్నూరు నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. 10న ఉదయం 9 గంటలకు పొన్నూరు పట్టణంలో, అనంతరం చేబ్రోలు, పెదకాకాని గ్రామాల్లో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


