వ్యక్తిత్వ నిర్మాణానికి యువజనోత్సవాలు దోహదం
ఏఎన్‌యూ(పెదకాకాని): విద్యార్థుల్లో నాయకత్వం, పరస్పర సహకారంతో పాటు స్వీయ అభివృద్ధి, వ్యక్తిత్వ నిర్మాణానికి యువజనోత్సవాలు దోహదపడతాయని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల మూడు రోజుల యువజనోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వర్సిటీ క్రీడా మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆచార్య కంచర్ల గంగాధర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. వనరులను సద్వినియోగం చేసుకొని ఆకాశమే హద్దుగా విద్యార్థులు ఎదగాలని ఆయన తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు కాసుల కృష్ణంరాజు విద్యార్థుల సృజనాత్మకశక్తి, ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి యువజన ఉత్సవాలు కేంద్ర బిందువుగా నిలుస్తాయని పేర్కొన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్ మాట్లాడుతూ క్రమశిక్షణతో, కళాత్మక నైపుణ్యంతో ముందుకు సాగాలని చెప్పారు. యువజన ఉత్సవాల కోఆర్డినేటర్ ఆచార్య ఎస్. మురళీమోహన్ మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో మ్యూజిక్, డ్యాన్స్, లిటరరీ ఈవెంట్స్, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ తదితర అంశాల్లో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. సుమారు 22 కళాశాలల నుంచి 400 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ జి. సింహాచలం, పాలకమండలి సభ్యులు కే సుమంత్ కుమార్, వర్సిటీ ఆర్ట్స్ అండ్ లా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సురేష్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ పి.పి.ఎస్. పాల్ కుమార్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య తేజోమూర్తి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎన్.వి. కృష్ణారావు, ఆచార్య ఎం. త్రిమూర్తిరావు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
వ్యక్తిత్వ నిర్మాణానికి యువజనోత్సవాలు దోహదం
వ్యక్తిత్వ నిర్మాణానికి యువజనోత్సవాలు దోహదం


