
వాంతులు, విరేచనాలు తీవ్రం
గుంటూరు నగరం విలవిల వాంతులు, విరేచనాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరిక ఇటీవల కురిసిన వర్షాలతో తీవ్రం పలుచోట్ల మురుగు కాల్వల్లో తాగునీటి పైపులైన్లు లీకులతో నీరు కలుషితం అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల విక్రయం కట్టడి చేయడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలం గుంటూరు జీజీహెచ్‌లో 33 మందికి చికిత్స బాధితుల కోసం ప్రత్యేక వార్డు
గుంటూరు మెడికల్ / నెహ్రూనగర్: గుంటూరు నగర ప్రజలు ఒక్కసారిగా ప్రబలిన డయేరియాతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి నిత్యం పది మందికి పైగా బాధితులు వాంతులు, విరేచనాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వరుసగా డయేరియా కేసులు నమోదవుతుండటంతో ఆసుపత్రి అధికారులు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా నగరంలో విపరీతంగా వర్షాలు కురవడంతో పాటు, నీటి నిల్వలు బాగా పేరుకు పోయాయి. తద్వారా నీరు కలుషితమై డయేరియా ప్రబలినట్లు బాధితులు వాపోతున్నారు.
మురుగునీటిలో మంచినీటి పైపు లైనులు
నగరంలో పలు ప్రాంతాల్లో మున్సిపల్ వాటర్ పైపులైనులు మురుగు నీటిలో ఉన్నాయి. అవి దీర్ఘకాలికంగా కాల్వల్లో ఉండటం వల్ల తుప్పుపట్టి పోయి లీకవుతున్నాయి. వ్యర్థాలు మంచినీటి పైపులైనుల ద్వారా కుళాయిలోకి చేరి వ్యాధులు కలుగ చేసేందుకు కారణమవుతున్నాయి. గతంలో డయేరియా నమోదైన ప్రాంతాల్లో అధికారులు పైపులైనులు కొన్నింటిని మార్పించారు. పూర్తి స్థాయిలో ప్రక్రియ చేపట్టకపోవడంతో మరలా డయేరియా సమస్య ప్రబలింది.
మూడు రోజులుగా కార్పొరేషన్ సరఫరా చేస్తున్న కుళాయిలో నీరు మురికిగా వస్తోంది. తాగలేక పోతున్నాం. స్థానిక కార్పొరేషన్ సిబ్బందికి సమస్య తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. మంగళవారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతుండటంతో గుంటూరు జీజీహెచ్‌కు వచ్చా.
– తాడిశెట్టి వెంకటశివయ్య,
శ్రీనగర్, గుంటూరు
మున్సిపల్ వాటర్ తాగడం వల్లే నాకు రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యుల సహకారంతో గుంటూరు జీజీహెచ్‌లో అడ్మిట్ అయ్యా.
– దాసరి రామకృష్ణ,
బుచ్చయ్యతోట, గుంటూరు
33 మందికి చికిత్స
మూడు రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో గుంటూరు నగరానికి చెందిన 25 మంది, జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్నారు.
గుంటూరు నగరానికి చెందిన 53 ఏళ్ల రమణారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
నగరంలోని పాతగుంటూరులో ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రెండు రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
డొంకరోడ్డు, హనుమాన్‌నగర్, శ్రీనగర్, రెడ్లబజారు, మంగళదాస్‌నగర్, రాజగోపాల్‌నగర్, రామిరెడ్డితోట, సంపత్‌నగర్, నల్లచెరువు, భాగ్యనగర్, ఆర్టీసీ కాలనీ, బుచ్చయ్యతోట, తదితర ప్రాంతాలకు చెందిన వారు చికిత్స పొందుతున్నారు.
జిల్లాలోని తాడేపల్లి, తెనాలి, ఓబులనాయుడుపాలెం, రెడ్డిపాలెంకు చెందిన బాధితులు సైతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

వాంతులు, విరేచనాలు తీవ్రం

వాంతులు, విరేచనాలు తీవ్రం

వాంతులు, విరేచనాలు తీవ్రం