
సమష్టి కృషితోనే జిల్లా క్లీన్ అండ్ గ్రీన్
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అక్టోబర్ 2 వరకు స్వచ్చత హీ సేవా కార్యక్రమాలు
గుంటూరు వెస్ట్ : జిల్లాను క్లీన్, గ్రీన్‌గా మార్చుకోవడానికి, జీఎంసీని జాతీయ స్థాయిలో నంబర్ 1 స్థానంలో నిలిపేలా ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కోరారు. స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గురువారం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి హిందూ కాలేజీ కూడలి వరకు స్వచ్ఛతోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, జీఎంసీ డెప్యూటీ మేయర్ షేక్ సజిలా, జిల్లా, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఏడాది అక్టోబర్ 2ను స్వచ్ఛ భారత్ దివస్‌గా జరుపుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ– 2025పై వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక శుభ్రత పాటించడం ద్వారా జిల్లాని స్వచ్ఛంగా తీర్చిదిద్దుకోవడంలో అధికార యంత్రంగానికి సహకరించాలని ఆమె కోరారు. ర్యాలీలో పాల్గొన్న వారితో డెప్యూటీ మేయర్ షేక్ సజిలా స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపించారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, జీఎంసీ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, అధికారులు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.