
బాబు పాలనలో అమ్మకానికి విద్యా, వైద్యం
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ‘చలో మెడికల్ కాలేజ్’ పోస్టర్లు ఆవిష్కరణ
పట్నంబజారు: ప్రపంచంలోనే పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసి, ప్రజారోగ్యాన్ని అమ్మకానికి పెట్టిన ఏకై క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. పిడుగురాళ్లలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన ‘చలో మెడికల్ కాలేజ్ ’ పోస్టర్లను గురువారం చంద్రమౌళీనగర్‌లోని ఆయన కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్లను విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పిడుగురాళ్లలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం నేతలపై ఉందని తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో ఇటు విద్య, అటు వైద్యంపేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఆధునిక సమాజంలో అత్యంత ప్రాధాన్యం గల విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. ఈ వాస్తవం తెలిసిన ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో పెద్ద సంఖ్యలో వైద్యులను తయారు చేసి తద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలన్న సంకల్పంతో రూ. 8,500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని వివరించారు. పేద విద్యార్థులు కనీసం ఇంగ్లిష్ మీడియంలో చదవడమే పాపంగా భావించే పెత్తందారీ పోకడల చంద్రబాబు, పేదలు డాక్టర్లు కావడం తట్టుకోలేకే ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కళాశాలలను దుర్మార్గంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఏ పాలకుడైనా పోరాడి మరీ మెడికల్ కాలేజీలు సాధించుకుంటారు గానీ.. ఏపీ సీఎం మాత్రం తన హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలేకపోయారని విమర్శించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మెడికల్ సీట్లు పెంచమని అడుగుతుంది గానీ ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ‘మెడికల్ సీట్లు వద్దు.. దయచేసి వాటిని వెనక్కి తీసుకోండి‘ అని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం.. ఎంబీబీఎస్ సీట్లకు ఎన్నారై కోటా కింద ఏడాదికి 58 లక్షలు ధర నిర్ణయించడం.. పీపీపీ విధానం అంటూ అన్ని వ్యవస్థలను ప్రైవేటుకు అమ్ముకోవడమే చంద్రబాబు విజన్ అని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. పేదవాడు డబ్బులకు ఇబ్బంది పడకుండా వైద్యం అందాలన్న జగన్ సంకల్పానికి తూట్లు పొడవకుండా ఉంటే చాలని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు, పేద ప్రజలను వైద్య సేవకు దూరం చేసే కుట్రలు, కుతంత్రాలకు తక్షణమే స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పాపతోటి అంబేడ్కర్, దూపాటి వంశీ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, రవి, బాజీ, గోపీ, కోటి, భరద్వాజ్, బాలు, మస్తాన్, అజయ్ పాల్గొన్నారు.