నగరంలో కోరలు సాచిన డయేరియా | - | Sakshi
Sakshi News home page

నగరంలో కోరలు సాచిన డయేరియా

Sep 19 2025 2:03 AM | Updated on Sep 19 2025 2:03 AM

నగరంల

నగరంలో కోరలు సాచిన డయేరియా

నగరంలో కోరలు సాచిన డయేరియా

జీజీహెచ్‌లో 70కి చేరిన బాధితులు ఇంకా ఎక్కువే ఉండొచ్చని అనుమానం వివరాలు గోప్యంగా ఉంచే ప్రయత్నాలు చికిత్స అందిస్తున్న వార్డులో వసతులు కరువు

గుంటూరు మెడికల్‌: గుంటూరు నగరంలో డయేరియా కోరలు సాచింది. రోజురోజుకూ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. బుధవారానికి 30 మందికి పైగా చికిత్స పొందారు. గురువారానికి ఈ సంఖ్య 70కు చేరుకుంది. అయితే, బాధితుల వివరాలను ఆసుపత్రి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. కేసుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక వార్డులో సైలెన్‌ స్టాండ్లు కరువు

డయేరియా బాధితుల కోసం ఆసుపత్రిలో జనరల్‌ సర్జరీ విభాగంలో 333వ నంబరు గదిని కేటాయించారు. అయితే, రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా దానికి తగ్గట్టుగా వార్డులో సౌకర్యాలు పెంపొందించలేదన్న విమర్శలు ఉన్నాయి. సైలెన్‌ స్టాండ్‌లు లేకపోవడంతో మంచాలకు, గోడలకు బాటిళ్లు వేలాడదీస్తున్నారు. గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ఇతర పార్టీల నేతలు రోగులను పరామర్శించారు. ఈ సమయంలో మంచాలకు, గోడలకు ౖసైలెన్‌ బాటిళ్లు వేలాడదీసిన దృశ్యాలు కనిపించడంతో ప్రజాప్రతినిధులు సైతం నిలదీశారు.

లిఫ్టులు పనిచేయక అవస్థలు

ఇన్‌ పేషెంట్‌ విభాగంలో లిఫ్టులు పని చేయడం లేదు. దీంతో పలువురు బాధితులు చికిత్స పొందే వార్డుకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ సాధారణ రోగులు సైతం ఇన్‌పేషెంట్‌ విభాగంలో అడ్మిట్‌ అయి, చికిత్స పొందేందుకు లిఫ్టులు పనిచేయక యాతన పడుతున్నారు. మూడు రోజులుగా డయేరియా బాధితులు వస్తున్నా మరమ్మతులు చేయించకుండా ఆసుపత్రి అధికారులు మిన్నకుండి పోవడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.

డీఎంహెచ్‌ఓ పరామర్శ

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రోగులను డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి గురువారం పరామర్శించారు. ఏఏ ప్రాంతాల నుంచి వచ్చారు.. ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. చికిత్స పొంది డిశ్చార్జి అయిన ఐదుగురి నివాసాలకు ఆరోగ్య సిబ్బందిని పంపించారు. నీరసంగా ఉన్న వారికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశశ్వి రమణ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వార్డులో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆదేశించారు.

నగరంలో కోరలు సాచిన డయేరియా 1
1/1

నగరంలో కోరలు సాచిన డయేరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement