జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాల నుంచి నమోదైన అతిసార కేసులపై నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్విలను తక్షణం నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు. కొత్తగా కేసులు నమోదు కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉన్నవారికి మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలు మరగ కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆమె సూచించారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని, బ్లీచింగ్ చల్లాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడత ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడత ప్రవేశాల కోసం ఈనెల 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ డెప్యూటీ డైరెక్టర్ సాయి వరప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు టెన్త్ మార్కుల జాబితా, టీసీ, సామాజిక వర్గ ధ్రువీకరణ, ఆధార్, మొబైల్ నంబరు వివరాలతో ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 28న సర్టిఫికెట్ల పరిశీలన, 29న విద్యార్థులకు ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. వివరాలకు 99516 77559, 97046 68909 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
బీచ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ
బాపట్ల టౌన్: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు సూర్యలంక తీరంలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ వాల్ పోస్టర్లను బుధవారం అమరావతి సచివాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు కొండయ్య యాదవ్, నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు, నక్క ఆనందబాబు పాల్గొన్నారు.
ఆశ్రమ నిర్వాహకుడు చందుకు అవార్డు
మార్టూరు: మార్టూరులోని అమ్మ ఆశ్రమ నిర్వాహకుడు గుంటుపల్లి చందు తన సేవలకు గాను అరుదైన పురస్కారం అందుకున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చైన్నెలోని చెన్నపురి తెలుగు విశ్వకర్మ సమాజం వారు తాదం కుప్పం బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. వృద్ధులకు చందు నిర్వహిస్తున్న సేవలకు గాను విశ్వకర్మ అవార్డు అందజేసి, ఘనంగా సత్కరించారు.
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె
నరసరావుపేట: విద్యుత్ రంగంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఆర్.బంగారయ్య హెచ్చరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసనలో భాగంగా బుధవారం విద్యుత్ ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్లు భోజన విరామ సమయంలో పాల్గొన్నారని బంగారయ్య పేర్కొన్నారు. కార్య క్రమంలో మురళీమోహనప్రసాదు, షేక్ నజి యా, గోపాలరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అతిసార బాధితులకు మెరుగైన వైద్యం