
గుర్తు తెలియని యువకులు బాలుడిపై బ్లేడుతో దాడి
తాడికొండ: గుర్తు తెలియని యువకులు బాలుడిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి రామ సంతోష్ రాత్రి 10:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కిరాణా షాపునకు వచ్చాడు. మార్గం మధ్యలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఏటీఎంలో నగదు డ్రా చేయడం తమకు రాదని, సాయం చేయాలని పిలవగా వెళ్లాడు. ద్విచక్ర వాహనం తాళాలు ఇవ్వాలని బాలుడిని బెదిరిస్తూ వెంట తెచ్చుకున్న పదునైన బ్లేడుతో దాడికి దిగడంతో, పెద్దగా కేకలు వేస్తూ పరుగెత్తడంతో నిందితులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె. శ్రీనివాసరావు తెలిపారు.