
రేపు ‘చలో పల్నాడు మెడికల్ కాలేజీ’
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు జయప్రదం చేయాలని వినతి
పట్నంబజారు: పేదలకు విద్యా, వైద్యాన్ని దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన చలో మెడికల్ కాలేజ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల కార్యక్రమంపై విద్యార్థి, యువజన విభాగం నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు యోచిస్తున్న కూటమి సర్కార్ విధానాలను ఎండగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ.. పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న ప్రభుత్వ తీరును నిరసించేందుకు యువజనులు, విద్యార్థులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, విద్యార్థి, యువజన విభాగం నేతలు నిమ్మకాయల రాజనారాయణ, కల్లం హరికృష్ణారెడ్డి, అనిల్‌రెడ్డి, ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, వినోద్ పాల్గొన్నారు.
పార్టీ గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సంక్షేమాన్ని పథకాన్ని సరిగ్గా ప్రజల వద్దకు చేర్చలేని కూటమి ప్రభుత్వం, ప్రైవేటీకరణ పేరుతో వారి అనుయాయులకు ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇదీ వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ప్రభుత్వ నిర్ణయం తిరిగి వెనక్కి తీసుకునే వరకు ఎంతటి పోరాటాల కై నా వైఎస్సార్ సీపీ వెనుకాడదని తెలిపారు. కచ్చితంగా యువత, విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు.