
రాజన్నా.. నిను మరువలేమన్నా
ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధిపై వైఎస్సార్ చెరగని ముద్ర
పులిచింతల నిర్మాణంతో తీరిన అన్నదాతల చింతలు
రూ.వేల కోట్లతో సాగర్ కాల్వల ఆధునికీకరణ
మహానేత చివరి సంతకమూ ఇక్కడి రైతుల కోసమే..
గుంటూరు నగర ప్రజల దాహార్తిని తీర్చిన రాజన్న
నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం
వైఎస్‌ఆర్.. ఆ పేరే ఒక ప్రభంజనం
ఎవరూ చెరపలేని, మరువలేని సజీవ సంక్షేమ సంతకం
పేదింటి గుండె కోవెలలో నేటికీ ఆయన సజీవం
అన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో ఆయన చిరునామా పదిలం
డాక్టర్లుగా, ఇంజినీర్లుగా మారిన పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం
ఆయనంటే నమ్మకం.. ఆయనుంటే జన సందోహం
ఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అపూర్వం
జిల్లా అభివృద్ధిపై ఆయన ముద్ర శాశ్వతం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రైతును రాజును చేయాలని అహర్నిశలు కలలుగన్న రైతుబాంధవుడు దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆ మహానేత ముందుకు వెళ్లారు. జలయజ్ఞంలో భాగంగా పులిచింతల ప్రాజెక్టు రూపకల్పనతో పాటు ఆయకట్టు స్థిరీకరణ కోసం పాటు పడ్డారు. రైతుల బతుకు చిత్రాన్ని మార్చడం కోసం కలలు కన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టును ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 2004 అక్టోబరు 15వ తేదీన రూ. 680 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు విజయవాడ, గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి ఉపయోగపడుతోంది. ఈ మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితులు వచ్చినా సరే కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది లేకపోవడానికి పులిచింతల ప్రాజెక్టే కారణం అనడంలో అతిశయోక్తి లేదు.
జలయజ్ఞంతో సస్య శ్యామలం
నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ కోసం 2008 ఫిబ్రవరి 2న రూ.4,444.41 కోట్లతో నాగార్జున సాగర్ కుడి, ఎడమల కాలువల ఆధునికీకరణకు అనుమతి ఇచ్చారు. దీని ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో 6.74 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో కాలువల ఆధునికీకరణ కోసం రూ. 4,573 కోట్లు కేటాయించారు. ఇందులో గుంటూరు జిల్లాకు సంబంధించి రూ.1760.15 కోట్లను కేటాయించారు. ఇందులో రూ.1187 కోట్ల పనులు జరిగాయి. దీని ద్వారా జిల్లాలో 5.22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. మహానేత పదవీకాలంలో ఉమ్మడి జిల్లా వాసులకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను ఆయన పూర్తి చేసి జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్రను వేసుకున్నారు.
వైఎస్సార్ చివరి సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. ఈ బీమాతో జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి రైతులు ఎకరానికి రూ.లక్ష వరకూ నష్టపోయారు. వారిని ఆదుకుంటామని ప్రకటన చేసినా ఇంతవరకూ పైసా కూడా విదల్చలేదు. దీంతో జిల్లా రైతులు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాపై చెరగని ముద్ర
● రాష్ట్ర వ్యాప్తంగా రూ. 12వేల కోట్ల రుణమాఫీలో జిల్లా రైతులు దాదాపు 6.07 లక్షల మందికి రూ. 560 కోట్ల మేర లబ్ధి చేకూరింది.
● ఇందిర ప్రభ పథకం జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి జిల్లా రైతులకు పెద్ద పీట వేశారు.
● ఇందిరమ్మ ఫేజ్–2 ఇళ్లను జిల్లాలోనే ప్రారంభించారు.
● రాజీవ్ పల్లెబాట ద్వారా ఎన్నో గ్రామాలకు తాగునీరందించి పల్లె వాసుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు.
● గుంటూరు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ. 6.50 కోట్లతో తక్కెళ్లపాడు రా వాటర్ ప్లాంట్ నుంచి తక్కెళ్లపాడు నీటి శుద్ధి వాటర్ పాంట్ల వరకు రెండో పైపు లైను నిర్మించారు. తమ నీటి కష్టాలు తీర్చిన మహానేతను నగర ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
● 2008, జూన్ 5న ప్రాజెక్టు వద్ద రైతు సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్ పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు కృష్ణానది నుంచి సాగునీటిని అందించేందుకు ఒకే సారి 10 ఎత్తిపోతల పథకాల నిర్మాణాలకు రూ.250కోట్ల నిధులు మంజూరు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఇప్పుడు ఆ పథకాలు మొత్తం పూర్తి కావడం వల్లనే నియోజకవర్గంలో పంట పొలాలు సాగునీటితో కళకళలాడుతున్నాయి.
● రూ.460 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన తాగునీటి పథకానికి ఆయనే అంకురార్పణ చేశారు.
● విద్యుత్ బకాయిలు మాఫీ చేయడం ద్వారా జిల్లాలో 80 వేల మంది రైతులకు లబ్ధి చేకూరింది. విద్యుత్ బకాయిల మాఫీ ద్వారా జిల్లాలోని రైతులకు రూ. 36 కోట్ల లబ్ధి కలిగింది.
● అమరావతి మండలం నరుకుళ్లపాడు లో లెవెల్ బ్రిడ్జిలో పడి ఎనిమిది మంది మృతి చెందడంపై డాక్టర్ వైఎస్సార్ తీవ్ర మనస్తాపానికి గురై ప్రమాదకరంగా ఉన్న నరుకుళ్లపాడు, ఎండ్రాయి బ్రిడ్జిలను హైలెవెల్ చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఆ రెండు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి కావడంతో ఇప్పుడు ఎంత వర్షం పడినా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
● ఉచిత విద్యుత్ పథకం ద్వారా జిల్లాలోని 80 వేల మంది రైతులకు ఏడాదికి రూ. 281.60 కోట్ల లబ్ధి చేకూరింది. దీంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచి ఆయన ప్రారంభించి జిల్లా ప్రజలు మరిచిపోలేని విషయం.
ముఖ్యమంత్రి హోదాలో మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జిల్లాలో 57 సార్లు పర్యటించారంటే ఆయనకు జిల్లాపై ఉన్న మమకారం అర్ధం అవుతుంది.

2004 అక్టోబర్ 15న పులిచింతల ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరిస్తున్న మహానేత వైఎస్సార్

సంక్షేమమే ధ్యేయం