
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ మీడియా స్వేచ్ఛను హరిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అర్ధరాత్రి సాక్షి కార్యాలయంలోకి పోలీసులను పంపి వేధింపులకు దిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాక్షి కార్యాలయంలోకి వచ్చిన పోలీసులు వీరంగం చేశారని.. డీఎస్పీల ప్రమోషన్‌లలో జరిగిన అక్రమాలపై వార్తలు రాస్తే దాడి చేస్తారా? అంటూ జూపూడి ప్రశ్నించారు.
‘‘తొలుత వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మీద పడి అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు సాక్షి మీద అర్ధరాత్రి దాడులు చేశారు. దేశానికి అర్ధరాత్రి వస్తే.. కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్చేచ్చని హరించేసింది. ఇది నియంతృత్వం కాదా?. ఎడిటర్ ధనుంజయరెడ్డి మీద అక్రమ కేసు పెట్టించారు. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే అదే పోలీసులతో అక్రమ కేసు పెట్టించారు. మే 8న కూడా ధనుంజయ రెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు చేశారు. అధికారంలో ఉన్నవారి మీద వార్తలు రాస్తే అక్రమ కేసులు పెడతారా?. పోలీసులను పంపించి భయపెట్టాలని చూస్తారా?’’ అంటూ జూపూడి ధ్వజమెత్తారు.
’’ఏపీలో అప్రజాస్వామ్యం నడుస్తోందనటానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని పాలకులు భావిస్తున్నారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తామంటే కుదరదు. వీధి రౌడీలాగ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే ఒప్పుకోం’’ అంటూ జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు.