
కుమారుడి మృతిపై అనుమానాలు
చిత్రహింసలు పెడుతున్నారు
రూ.10 లక్షలతో ఉడాయింపు
ఎలా చనిపోయాడో తెలీదు..
రూ.3 లక్షల రుణం పేరుతో మోసం..
మహిళా కానిస్టేబుల్‌పై భర్త ఫిర్యాదు
నగరంపాలెం: నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కార వేదికలో బాధితుల నుంచి జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ రవికుమార్ (ఎల్/ఓ), ఎ.హనుమంతు (ఏఆర్) ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదిదారుల మొరను ఆలకించారు. ఫిర్యాదులకు సంబంధించి పోలీస్ అధికారులతో మొబైల్ ఫోన్లల్లో మాట్లాడారు. తూర్పు సబ్ డివిజనల్ డీఎస్పీ అబ్ధుల్ అజీజ్ కూడా అర్జీలు స్వీకరించారు.
పేరేచర్లలోని దుకాణ సముదాయాల ద్వారా వచ్చే అద్దెలతో జీవిస్తున్నాం. అయితే ఓ దుకాణం ఖాళీగా ఉండటంతో మరో కుమారుడితో కలిసి శుభ్రం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో నా పెద్ద కుమారుడు, కోడలు, ఆమె బంధువులు మాపై దాడికి యత్నించారు. మా తదనంతరం రాసిన వీలునామాను ఇటీవల రద్దు చేసుకోవడంతో పెద్ద కొడుకు చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యల్లేవు. వృద్ధాప్యంలో ఉన్న మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
– చదలవాడ రమేష్, పద్మావతి, పేరేచర్ల
కుమారుడి ఆకస్మిక మృతిపై
ఏఎస్పీకి తల్లి ఫిర్యాదు
పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరించిన ఏఎస్పీ, ఇతర పోలీసు అధికారులు
వ్యవసాయ పనులతోపాటు కారు డ్రైవర్‌గా చేస్తుంటాను. ఈ క్రమంలో కృష్ణాజిల్లా వాసి పరిచమయ్యారు. సకలతంత్ర విద్యలు వచ్చని నమ్మబలికాడు. దీంతో సుమారు ఇరవై రోజులు ఇంటికి వచ్చి, వెళ్లేవాడు. డబ్బులుంటే ఇవ్వాలని పది రెట్లు ఎక్కువ చేసి ఇస్తానని బదులిచ్చాడు. అయితే అతన్ని మొదట్లో నమ్మలేదు. రెండు, మూడుసార్లు ఒంటిపై వస్త్రంలేకుండా, ఒట్టి పేపర్‌లో లిక్విడ్ పోసి గాల్లో విసిరాడు. గాల్లో విసిరిన ప్రతిసారి రూ.50 వేలు రూ.500 కరెన్సీ కాగితాలు కిందపడ్డాయి. కింద పడిన కరెన్సీ కాగితాలు పరిశీలించగా, నిజమేనని గుర్తించాను. ఈ క్రమంలో మా బంధువుల బ్యాంక్ ఖాతా నుంచి ఈ ఏడాది మే మూడో తేదిన రూ.10 లక్షలు అతనికి జమ చేయించాను. 21 రోజుల్లో రెట్టింపు చేసి ఇస్తానని నమ్మించాడు. అప్పటి నుంచి అదిగి ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ పని చేయడంలేదు. న్యాయం చేయగలరు. – బాధితుడు, తుళ్ళూరు
మా రెండో కుమారుడు బాలస్వామి (25) గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ఈ ఏడాది జూలై 15 రాత్రి ఇద్దరు స్నేహితులు ఇంటికొచ్చి, పని ఉందని బయటకు తీసుకెళ్లారు. తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేసి, బాలస్వామి టిడ్కోగృహాల వద్ద మృతిచెంది ఉన్నాడని తెలిపారు. బాలస్వామి మృతదేహానికి శవ పరీక్షలు చేసి అప్పగించారు. అయితే మా కుమారుడి మృతిపై ఇద్దరు వ్యక్తుల మీద అనుమానాలు వ్యక్తం చేశాం. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాల్లేవు. ప్రస్తుతం అనుమానితులు బయట తిరుగుతున్నారు. కేసు రాజీకి రావాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా కొడుకు ఎలా, ఎందుకు చనిపోయాడనేది ఇప్పటికీ అంతుపట్టడంలేదు. న్యాయం చేయగలరు. – తల్లి సుజాన, పెద్దమ్మ సువార్తమ్మ, సుల్తాన్‌బాద్, తెనాలి
ఏడాది క్రితం సంగడిగుంట రెడ్ల బజార్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. నెట్‌వర్క్ మార్కెటింగ్ అని, రూ.2 వేలు చొప్పున వెయ్యి మందితో కట్టిస్తే రూ.3 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికింది. ఈ క్రమంలో ఇతరులతో రూ.12 లక్షలు, సొంతంగా పొలం విక్రయించి రూ.13 లక్షలు ఆమెకు చెల్లించాను. అయితే మోసపోయానని తెలిసి డబ్బులు అడిగితే చెల్లించడంలేదు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదు. ఈనెల 19న నా భర్తను రెండు ఆటోల్లో కొందరు వచ్చి ఎత్తుకెళ్లి, చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో విడిచిపెట్టారు. మాకు న్యాయం చేయగలరు.
– ఓరుగంటి చంద్రలేఖ, కోటిరెడ్డి,
113 తాళ్ళూరు, ఫిరంగిపురం
2018లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా భార్యకు మహిళా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గుంటూరు నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. కొద్ది రోజులుగా తలెత్తిన వివాదాల కారణంగా దూరంగా ఉంటున్నాం. అయితే ప్రతిసారి 100కు డయల్ చేయడం, ఆ తరువాత పోలీసులతో దాడి చేయించడం చేస్తోంది. ఇప్పటివరకు ఏడుసార్లు కొట్టించింది. న్యాయం చేయగలరు.
– ఎన్.శ్రీనివాసరెడ్డి, కృష్ణనగర్