
డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘననివాళి సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మరణం లేని మనిషి దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కొనియాడారు. మహానేత వైఎస్సార్ వర్ధంతి పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోర్టు, అమరావతి రోడ్డు, ముత్యాలరెడ్డినగర్, కొరిటెపాడు, స్వామి థియేటర్ సెంటర్, లక్ష్మీనగర్, ఆదర్శనగర్, హౌసింగ్ బోర్డుతోపాటు, పలు ప్రాంతాల్లో పర్యటించి వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. పార్టీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ పేదల గుండెకు భరోసా కల్పించి, ఎంతటి ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా వారికి మేలు చేకూర్చిన ఆరోగ్య ప్రదాత వైఎస్సార్ అని కీర్తించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
పొన్నూరు నియోజకవర్గంలో..
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పొన్నూరు రూరల్ మండలం మామిళ్లపల్లిలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం, పొన్నూరు రూరల్ మండలం మునిపల్లె గ్రామం, పొన్నూరు రూరల్ మండలం పచ్చలతాడిపర్రు, పొన్నూరులోని పార్టీ కార్యాలయంలో, పొన్నూరులోని అంబేడ్కర్ సెంటర్ వద్ద, పొన్నూరు రూరల్ మండలం వెల్లలూరు, మంచాల, చేబ్రోలు, నారాకోడూరు, పెదకాకాని గ్రామాల్లో డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో కార్యకర్తలు, నేతలు, అభిమానులు పాల్గొన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో..
తాడేపల్లి రూరల్, తాడేపల్లి టౌన్, మంగళగిరి టౌన్, మంగళగిరి రూరల్, దుగ్గిరాలలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల స్థాయి, గ్రామస్థాయి నేతలు, అభిమానులు పాల్గొన్నారు.
తాడికొండ నియోజకవర్గంలో..
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు తెలిపారు. మంగళవారం డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పేరేచర్ల డొంక రోడ్డులో వద్దగల డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరు వంశీకృష్ణ, పేరేచర్ల గ్రామ అధ్యక్షుడు షేక్ సుభాని, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెనాలి నియోజకవర్గంలో..
తెనాలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కొల్లిపరలో బొంతు వారి గుడి వద్ద వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్లిపర మాయాబజార్ సెంటర్‌లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తూములూరు గ్రామంలో సెంటర్లోని హైస్కూల్ దగ్గర వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. తూములూరు అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వల్లభపురం గ్రామంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో శివకుమార్ పాల్గొని వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో..
ప్రత్తిపాడు, ఏటుకూరు బైపాస్‌లోని నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్ మాతృమూర్తి మణెమ్మ, తనయుడు కౌశిక్ కిరణ్‌లు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ మండలంలో నల్లపాడు, చల్లావారిపాలెం, మల్లవరం గ్రామాల్లో ఎంపీపీ ఇంటూరి పద్మావతి, అంజిరెడ్డిలు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.