
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మంగళగిరి టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి(50), అతని భార్య సుజాత హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు సోమవారం రాత్రి మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి కింద బస్సు కోసం వేసి ఉన్నారు. అదే సమయంలో గుర్తు తెలియని తెల్ల రంగు కలిగిన ఓ వాహనం అతివేగంగా భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. బలమైన గాయాలు కావడంతో ఆయనను భార్య సుజాత ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లింది. శ్రీనివాసరెడ్డిని పరీక్షించిన వైద్యులు మార్గంమధ్యంలో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.