గుంటూరు లీగల్: ఈనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేయడానికి ప్రయత్నం చేయాలని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్.శరత్‌బాబు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సివిల్ జడ్జిలకు, పోలీస్ అధికారులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ సోమవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి వి.ఏ.ఎల్. సత్యవతి, మూడో అదనపు జిల్లా జడ్జి సీహెచ్.వెంకట నాగ శ్రీనివాసరావు, రెండో అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజా, ఐదో జిల్లా జడ్జి స్పెషల్ కోర్ట్ ఫర్ ది ట్రయిల్ అఫ్ ఆఫెన్సెస్ అగైనెస్ట్ విమెన్ కె.నీలిమ పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి తగు సలహాలు, సూచనలు చేశారు.
అత్యాధునిక సదుపాయాలతో అంబులెన్స్
గుంటూరు వెస్ట్: వెంటిలేటర్‌తోపాటు అత్యాధునిక సదుపాయాలతో కూడిన అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో అంబులెన్స్‌కు జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అత్యవసర చికిత్స కోసం అందించనున్న 190 వాహనాలలో తొలి వాహనం అందిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 24 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని వీటిలో 15 బేసిక్ లైఫ్ సపోర్ట్ ఇచ్చేవి కాగా 9 అడ్వాన్స్ సదుపాయాలు కలిగినవన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ బీవీ రంగారావు, ఎన్‌టీఆర్ జిల్లా వైద్య సేవా కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్, 108 జిల్లా మేనేజర్ పి.బాలకృష్ణ పాల్గొన్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం
తెనాలిరూరల్: తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గణేష్ నిమజ్జనం కోసం ఉపయోగించిన డీజే సౌండ్ సిస్టంలను తీసుకెళుతున్న ఓ వాహనం బ్రిడ్జి మొదట్లో నిలిచిపోయింది. ఫుట్‌పాత్, డివైడర్‌కు మధ్యలో వాహనం నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. అతికష్టం మీద వాహనాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ అంతరాయంతో సుమారు గంటపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వంతెనపై వాహన రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన కాంక్రీట్ దిమ్మెలను పక్కకు జరిపి ఇరుక్కుపోయిన వాహనాన్ని తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
7,026 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి 7,026 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 276, క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,760, క్యూసెక్కులు, తూర్పు కాలువకు 479, పశ్చిమ కాలువకు 240, నిజాపట్నం కాలువకు 465, కొమ్మూరు కాలువకు 2,680 క్యూసెక్కులు, బ్యారేజి నుంచి సముద్రంలోకి 3,28,125 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

13న జాతీయ లోక్‌అదాలత్