
అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు
నగరంపాలెం: ఐదు రోజుల క్రితం ఒంటరి వృద్ధురాలిపై దాడికి పాల్పడిన ఇద్దరు అంతర్ జిల్లా దోపిడీ దొంగలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.13 లక్షల ఖరీదైన బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన 78 ఏళ్ల వృద్ధురాలైన బొల్లిముంత బుల్లెమ్మ ఒంటరిగా నివాసం ఉంటుంది. గతనెల 26న మధ్యాహ్నం నిద్రపోతున్న ఆమైపె గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్‌తో దాడికి పాల్పడ్డారు. ఒంటిపై ఉన్న సుమారు రూ.13 లక్షల బంగారపు ఆభరణాలతో ఉడాయించారు. దీనిపై బాధితురాలి కుమారుడు కొల్లిపర పీఎస్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. తెనాలి రూరల్ పీఎస్ సీఐ ఉమేష్ దర్యాప్తులో భాగంగా పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఓ బైక్‌పై ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం గుంటూరు బొంగరాలబీడులో ఉంటున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లెనిన్‌నగర్ ఏడో వీధికి చెందిన కుంచపు దుర్గాప్రసాద్, ప్రస్తుతం గుంటూరు నల్లపాడులో ఉంటున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం లెనిన్‌నగర్ వాసి కొత్తపల్లి ఎలీషాలుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరితోపాటు బంగారం భద్రపరచడం, సగ భాగం విక్రయించడంలో కీలక పాత్ర పోషించిన కుంచెపు దుర్గాప్రసాద్ భార్య మున్నంగి ప్రియాంకను అరెస్ట్ చేశారు.
రెక్కీ.. అనంతరం దాడి
నిందితులు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.. రాత్రిళ్లు గేదెలు, గొర్రెలు, పొట్టేలు, నిలుపుదల చేసిన బైక్‌లు, ఇళ్ల తాళాలు పగులకొట్టి విలువైన వస్తువులు చోరీ చేయడంలో నేర్పరులు. ఇక వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో చెడు వ్యసనాలకు వెచ్చించేవారు. ఈ క్రమంలో అత్తోట గ్రామంలో చోరీ చేసేందుకు వచ్చారు. ఒంటరిగా నిద్రకు ఉపక్రమించిన బొల్లిముంత బుల్లెమ్మను చూసి, కాసేపు రెక్కీ నిర్వహించి, అనంతరం ఇంట్లోకి ప్రవేశించి ఇనుప రాడ్‌తో తలపై మోది ఆభరణాలతో ఉడాయించారు. వీరిద్దరిపై 21కి పైగా కేసులున్నాయి. గుంటూరు జిల్లాలోని అరండల్‌పేట, కొత్తపేట, నగరంపాలెం, పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ, మాచర్ల, వెల్దుర్తి, మాచవరం, కారంపూడి, బెల్లంకొండ, అమరావతి, రాజుపాలెం, రెంటచింతల, భీమడోలు, తణుకు పోలీసు స్టేషన్లలో పలు కేసులున్నాయి.