
అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించకూడదని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఒకసారి పరిష్కరించే అర్జీలు తిరిగి ఓపెన్ కాకుండా చూసుకోవాలన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లే అర్జీలు రీఓపెన్ అయితే సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలుంటాయన్నారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జి.సాయి శ్రీకాంత్, పి.దీపు మార్టిన్‌లకు కలెక్టర్ కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసారు. అనంతరం వచ్చిన 220 అర్జీలను కలెక్టర్‌తోపాటు జేసీ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.