నాయక్.. నీ త్యాగం మరువలేనిది !
లక్ష్మీపురం: పాకిస్థాన్‌తో పోరాడే క్రమంలో తెలుగు బిడ్డ ముళీనాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని, ఆ వీర సైనికుని త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరచిపోదని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, విద్యావేత్త ఆర్.వి సింగరయ్య పేర్కొన్నారు. స్థానిక అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో వీర జవాన్ మురళీ నాయక్‌కు శనివారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల వయస్సులో మాతృభూమి కోసం ప్రాణాలర్పించి అమరుడైన మురళీ నాయక్ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని కొనియాడారు. మురళీ నాయక్ చూపిన ధైర్యసాహసాలు రాష్ట్రానికి గర్వకారణమని, యువ జవాన్ పేరు చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత ఇంజినీర్ ఎన్.సదాశివం, అవగాహన సంస్థ సాంస్కృతిక కార్యక్రమాల కో–ఆర్డినేటర్ బిళ్లా అశోక్, సంస్థ సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.


