మెగా ఫ్లయ్‌ఓవర్ నిర్మించాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : భవిష్యత్తు అవసరాలు తీర్చే విధంగా శంకర్ విలాస్ మెగా ఫ్లయ్‌ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేయాలని రాజకీయ, ప్రజా, వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. శుక్రవారం ‘బెటర్ శంకర్ విలాస్ ఫ్లయ్‌ఓవర్ జేఏసీ’ ఆధ్వర్యంలో గుంటూరు అరండల్‌పేటలోని ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ ఎల్.ఎస్. భారవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సంఘాలు, పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఫ్లయ్‌ఓవర్ నిర్మాణంపై ప్రజల అభీష్టానికి అనుగుణంగా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్ ఎల్.ఎస్.భారవి మాట్లాడుతూ గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టును యథావిధిగా అమలు పర్చాలని కోరుతున్నామని, ప్రజల అవసరాలకు సరిపోని బ్రిడ్జిని అంగీకరించబోమన్నారు. సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు విజన్ లేకుండా నిర్మిస్తున్న ఫ్లయ్‌ఓవర్ నిర్మాణంపై స్పందించాలని అన్నారు. రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణానికి ముందుగా ఆర్‌యూబీ నిర్మించేందుకు నిపుణులతో సాంకేతికంగా పరిశీలన జరపాలన్నారు. ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు మేడూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పీ–4 విధానాన్ని అమలు చేయడం ద్వారా ఫ్లయ్‌ఓవర్ నిర్మాణాన్ని చేపట్టవచ్చన్నారు. హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ మెగా ఫ్లయ్‌ఓవర్ నిర్మాణానికి అవసరమైన విధంగా చేస్తున్న పోరాటంలో తాము భాగస్వాములవుతామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎండీ మస్తాన్‌వలీ, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆప్ నాయకుడు టి.సేవా కుమార్, నర్రా శ్రీనివాసరావు, ఆడిటర్ పీవీ మల్లిఖార్జునరావు, వల్లూరు సదాశివరావు, పౌర, వర్తక, వాణిజ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.
శంకర్ విలాస్ ఫ్లయ్‌ఓవర్ అంశంలో రాజకీయపార్టీలు, సంఘాల డిమాండ్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం వైఎస్సార్ సీపీ నుంచి హాజరైన అంబటి రాంబాబు, నూరి ఫాతిమా ప్రజాభీష్టం మేరకు నిర్మించాలని నినాదం
మెగా ఫ్లయ్‌ఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలి
గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలుపుతూ ప్రజల ట్రాఫిక్ అవసరాలను తీరుస్తున్న శంకర్‌విలాస్ ఆర్వోబీ స్థానంలో ప్రతిపాదించిన ఫ్లయ్‌ఓవర్‌ను మెగా ఫ్లయ్‌ఓవర్‌గా మార్చి నిర్మించాలి. సేతు బంధన ప్రాజెక్టు ద్వారా కేంద్రం మంజూరు చేసిన రూ.98 కోట్లతో సాధారణ బ్రిడ్జిగా నిర్మించడం వల్ల ప్రజల అవసరాలను తీర్చకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్పమయ్యే ప్రమాదముంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత ఎంపీ గల్లా జయదేవ్ హయాంలో ప్రతిపాదించినట్టు హిందూ కళాశాల సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు మెగా ఫ్లయ్‌ఓవర్ నిర్మాణాన్ని లక్షలాది మంది ప్రజలు కోరుతున్నారు. మెగా ఫ్లయ్‌ఓవర్‌తోపాటు ఆర్‌యూబీని నిర్మించడం ద్వారా ట్రాఫిక్ కష్టాలను తీర్చవచ్చు.
– అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు


