నీరసించిపోతున్న నిమ్మ రైతులు
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి
తెనాలి: ప్రకృతితో పాటు మార్కెట్ మాయాజాలంతో నిమ్మ రైతులు నీరసించిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో శనివారం నిమ్మతోటలు సాగుచేస్తున్న రైతులు, కౌలు రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత నవంబరు, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మంచు కారణంగా చెట్లకు పూత, కాయ రాలిపోయి దిగుబడి తగ్గిందని పలువురు రైతులు వెల్లడించారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలతో కౌలుకు తీసుకున్నామని రైతులు చెప్పారు. మార్కెట్లో రెండు రోజులు ధర బాగుంటే అయిదురోజులు ధరలు తగ్గిపోతున్నాయని మరికొందరు తెలిపారు. నిమ్మకాయల యార్డులో 10 శాతం కమీషన్, ధర్మం వగైరాలను అరికట్టాల్సిన ఆవశ్యకతను తమ దృష్టికి తీసుకొచ్చినట్టు సాంబిరెడ్డి తెలిపారు. నిమ్మ రైతులు నీరసించిపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


