ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వండి
కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు వెస్ట్: జిల్లాలోని రీచ్‌లలో ఇసుక తవ్వకాలకు సంబంధించి అవసరమైన అనుమతులు, ఇతర ప్రక్రియలు నిర్దేశించిన సమయంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక తవ్వకాలకు బోట్స్‌మెన్ సొసైటీకి కేటాయించే రాయిపూడి డి–సిల్టేషన్ పాయింట్ పర్యవేక్షణ ఏ శాఖ పరిదిలోకి వస్తుందో రాష్ట్ర మైనింగ్ శాఖాధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. బొమ్మువారి పాలెం–16 ఓపెన్ శాండ్ రీచ్ మైనింగ్ ప్లాన్‌ను రూపొందించి టెండర్ ప్రక్రియ సిద్ధం చేయాలన్నారు. గుండెమెడ ఓపెన్ శాండ్ రీచ్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బిడ్‌ను ఆహ్వానించి ఈ నెల 16నాటికి అర్హత గల బిడ్డర్‌కు కేటాయించాలన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నదిలో ఇసుక నిల్వల కోసం హైడ్రో గ్రాఫిక్ సర్వే కోసం ఈఈ, కేసీ కెనాల్ డివిజన్‌కు జిల్లా వాటా కింద రూ.24 లక్షలు మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక సరఫరా చేసే కేంద్రాల వద్ద పర్యవేక్షణ కోసం సంబంధిత తహసీల్దార్ల ద్వారా రెవెన్యూ, మైనింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో షేక్ ఖాజావలి, జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి నాగిని, తదితర అధికారులు పాల్గొన్నారు.


