నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): వైఎస్సార్ పెన్షన్‌న్ కానుక పంపిణీ గుంటూరు జిల్లాలో ఆదివారంతో ముగిసింది. ఉదయాన్నే పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో 2,60,244 మంది లబ్ధిదారులు ఉండగా వారి కోసం ప్రభుత్వం రూ.71.55 కోట్లు కేటాయించింది. ఆదివారం సాయంత్రానికి 2,57,794 మంది లబ్ధిదారులకు రూ.70.85 కోట్లు నగదు అందజేశారు.
నిత్యాన్నదానానికి
రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం రూ. లక్ష విరాళాన్ని అందచేశారు. దేవినగర్‌కు చెందిన తమ్మిన వెంకట కిరణ్‌కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.
దీపావళికి ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం దీపావళి పండగను పురస్కరించుకుని గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం దినేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్–కటక్(07165) మధ్య ఈనెల 7, 14, 21 తేదీల్లో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. కటక్–హైదరాబాద్(07166) మధ్య ఈనెల 8, 15, 22 తేదీల్లో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైలు హైదరాబాద్ సికింద్రాబాద్, పగడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా నడుస్తాయని తెలిపారు. ప్రయాణికులు గమనించి సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు.
జిల్లా బాక్సింగ్ జట్టు ఎంపిక
గుంటూరువెస్ట్ (క్రీడలు): విశాఖపట్నంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ బాక్సింగ్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఆదివారం స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా పోటీలను జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చల్లా వెంకటేశ్వరరెడ్డి, కొసన వేణుగోపాల్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాక్సర్లు పోటీల్లో పాల్గొన్నారు. కొసన వేణుగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తమ్మీద 30 మంది పాల్గొన్నారన్నారు. 11 మందిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఎంపికై న జట్టుకు వారం రోజులు శిక్షణనిస్తామన్నారు. రాజేశ్వరరావు, అన్నా వెంకటేశ్వరరావు, ఇమ్మానుయెల్ రాజు, శివారెడ్డి, ఫణి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయి నేటికి ఆరేళ్లు
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా, ప్రాంతీయ కార్యాలయాల్లో వేడుకలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి సోమవారానికి (ఈనెల 6 తేదీకి) ఆరేళ్లు పూర్తవుతుంది. రాష్ట్రంలోని పేదల జీవితాలు మెరుగుపడేందుకు విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు ఈ యాత్ర తోడ్పడింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా/ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయనున్నారు. రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొననున్నారు.


