పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క!

Tributes To Veteran Journalist BS Varadachari - Sakshi

నివాళి

ఒక ఆటగాడు ఓడిపోకుండా మైదానంలో ఎంతసేపు నిలబడగలిగాడు, మొత్తం విజయానికి ఏ విధంగా దోహదపడ్డాడు అనేది అతడి ట్రాక్‌ రికార్డ్‌కి సంకేతం. వ్యక్తిగత స్కోర్‌ కంటే కీలక ఘట్టాల్లో జట్టు విజయానికి అండగా నిలవడం చాలా ముఖ్యం. జర్నలిజం రంగంలో జి.యస్‌. వరదాచారి కూడా ఇలాంటి ఆటగాడే. ఆరు దశాబ్దాలకు పైబడి తెలుగు జర్నలిజం వికాసానికి, విలువలకు, జర్నలిస్టుల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పాటుపడుతూ వచ్చిన కార్యదక్షుడు.

మరో సుప్రసిద్ధ జర్నలిస్టు సి. రాఘవాచారికి వర్తించే మాటలే వరదాచారికీ సరితూగుతాయి. తలుపు తట్టిన అవకాశాన్ని వదులుకోకుండా ఇంగ్లిష్‌ జర్నలిజంలోకి వరదాచారి ప్రవేశించి ఉంటే ఏ కోటంరాజు రామారావో అయ్యేవారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి ఉంటే ఏ నానాపాల్కీవాలానో అయి ఉండేవారు. యూనియనిస్టుగానే కొనసాగి ఉంటే మరో మానికొండ చలపతిరావు అయ్యేవారు. కానీ ఇవేవీ కావాలనుకోలేదు. కనుకే ఆయన గోవర్ధన సుందర వరదాచారి అయ్యారు. నమ్మిన సిద్ధాం తాల విషయంలో రాజీపడేవారు కారు. ఎదుటివారు ఏ భావజాలానికి చెందిన వారైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో గోవర్ధన కృష్ణమాచార్యులు, జానకమ్మ దంపతులకు 1932 అక్టోబర్‌ 15న జన్మిం చారు. జర్నలిజంపై మక్కువతో విద్యార్థి దశలోనే కొంతకాలం ‘వైష్ణవ’ పత్రికను నడిపారు. జర్నలిజం వృత్తిలో ప్రవేశించడా నికి విద్యార్హతల పట్టింపు లేని ఆ రోజు ల్లోనే బి.ఏ. డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. కోర్సులో భాగంగా చెన్నైలోని ‘ది హిందూ’లో ఇంటర్న్‌షిప్‌ దిగ్వి జయంగా పూర్తిచేశారు. ఇంగ్లిష్‌ జర్నలిజంలో ప్రవేశించే అవకాశం వచ్చినా తెలుగు భాషపై మక్కువతో ఆ ఆఫర్‌ను కాదనుకుని 1956లో హైదరాబాద్‌లో ‘ఆంధ్ర జనత’లో చేరారు. జర్నలి జంలో చేరిన కొత్తల్లోనే సహోద్యోగుల సందేహాలను ఓపికగా విడమరిచి చెప్తుండేవారు. నాటి నుంచి వరదాచారిని ‘ప్రొఫెసర్‌’ అని పొత్తూరి వెంకటేశ్వరరావు పిలిచేవారు.

‘ఆంధ్ర భూమి’లో న్యూస్‌ ఎడిటర్‌గా రెండు దశాబ్దాలు, ‘ఈనాడు’లో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా ఐదేళ్లు పనిచేశారు. తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించినప్పటి నుంచి జర్న లిజం శాఖ అధిపతిగా, ప్రొఫెసర్‌గా 22 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దారు. ప్రెస్‌ అకాడమీ సహా పలు విద్యా సంస్థల్లోనూ జర్నలిజం పాఠాలు బోధించారు. హెచ్‌ఎం టీవీలో తీర్పరిగా బాధ్యతలు చేపట్టి తెలుగులో తొలి అంబుడ్స్‌ మన్‌గా ఖ్యాతి గడించారు.

వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం కార్యాలయమైన దేశోద్ధారక భవన్‌ అనుమతి సాధనలో, నిర్మాణ నిధుల సేకరణలో ముఖ్య భూమిక పోషించారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘా నికి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ స్థాపక కార్యదర్శిగా, జర్నలిస్టుల గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా, జర్నలిస్ట్‌ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా నిర్విరామ సేవలు అందిస్తూ వచ్చారు. వెటరన్‌ జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా రిటైరైన జర్నలిస్టుల కోసం హెల్త్‌ కార్డుల కోసం పాటుపడ్డారు. పాత్రికేయులకు కరదీపికలుగా నిలిచే పలు పుస్తకాలను ఈ సంఘం తరఫున ప్రచురించారు. 

వరదాచారి తన ఆత్మకథను ‘జ్ఞాపకాల వరద’ పేరిట వెలువ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం నార్ల వెంకటే శ్వరరావుపై మోనోగ్రాఫ్‌ రాశారు. పత్రికా రచనలో దొర్లే పొర బాట్లను సోదాహరణంగా వివరిస్తూ రాసిన ‘దిద్దుబాటు’ కాలమ్‌ను అదే పేరుతో సంకలనంగా వెలువరించారు. పాత్రికేయ నిష్పాక్షికతను విశ్లేషిస్తూ ‘ఇలాగేనా రాయడం?’ పేరుతో వ్యాసాల సంకలనం రూపొందించారు. వరదాచారి పాత్రికేయ స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన బహుముఖీన కృషికి దర్పణం పడుతూ ప్రముఖుల రచనలతో ‘వరద స్వర్ణాక్షరి’ వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. 

స్వీయ ప్రతిభతో, బహుముఖీన కృషితో తెలుగు జర్నలిజం రంగాన్ని ఆరు దశాబ్దాలుగా సుసంపన్నం చేస్తూ వచ్చి పరిపూర్ణ జీవితం గడిపిన వరదాచారి ధన్యజీవి. తెలుగు పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క.

గోవిందరాజు చక్రధర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top