జనాభా నియంత్రణ సంజీవని కాదు

Shyam Sharan Special Article On Population Policy - Sakshi

విశ్లేషణ

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాదిన జనాభా రేటు పెరిగిపోతుండటంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జనాభా కట్టడికి చేపట్టిన తీవ్ర చర్యలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. యువజనాభా పెరుగుతుండటం లాభదాయకమని ప్రపంచమంతా భావిస్తున్న తరుణంలో, జనాభా కట్టడిపై చర్చ మొదలైంది. పెరుగుతున్న జనాభా భారత్‌ వంటి దేశాలకు నిజమైన సంపదగా ప్రపంచం భావించేది. కానీ దేశంలోని యువ, ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రజానీకానికి అధికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించిన పక్షంలోనే జనాభాపరమైన ఈ సానుకూలతను సరిగా వినియోగించుకోగలం. జన సంఖ్య రేటును తగ్గించాలంటే కేరళ, తమిళనాడు లాగా విద్య... ప్రత్యేకించి స్త్రీ విద్య, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. ప్రభుత్వ చర్యల ద్వారా జనాభా నియంత్రణ అనేది భారత్‌లో పెద్దగా పనిచేయదు. 

ప్రపంచ జనాభా దినోత్సవమైన జూలై 11న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి 2021–2030 జనాభా పాలసీ ముసాయిదా ప్రకటించారు. భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన యూపీలో ప్రస్తుతం జనాభా పునరుత్పాదక రేటు 2.7 శాతంగా ఉండగా దీన్ని 2026 నాటికి 2.1 శాతానికి, 2030 నాటికి 1.9 శాతానికి తగ్గించడడమే ఈ విధాన లక్ష్యం. 2020లో జాతీయ పునరుత్పాదక రేటు 2.2 శాతంగా ఉండింది. 

గత దశాబ్ది కాలంగా దేశవ్యాప్తంగా జనాభా పునరుత్పాదక రేటు క్రమంగా పడిపోతూ వస్తోంది. ఉత్తరాదిన హిందీ భాషా ప్రాంతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల పునరుత్పాదక రేటు బాగా తగ్గిపోతోంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో జనాభా పునరుత్పాదక రేటును తగ్గించే లక్ష్యం ఎలా కొనసాగించాలనేది ఒక అంశం కాగా, ఆర్థికంగా లాభదాయకంగా ఉండే యువజనాభా విస్తరిస్తున్న తరుణంలో జనాభా పరమైన ఈ డివిడెండును తగ్గించడానికి ప్రయత్నించడాన్ని ఏ దృష్టితో చూడాలనేది కీలకం. ఆర్థిక ప్రగతి ఫలితాలను పెరుగుతున్న జనాభా కబళిస్తుందని చెబుతూ మాల్తూస్‌ ప్రతిపాదించిన జనాభా స్థానభ్రంశ సిద్ధాంతానికి మళ్లీ ప్రాచుర్యం లభిస్తున్న కాలమిది.
భారత ప్రజాతంత్ర రిపబ్లిక్‌ తొలి రోజుల్లో, జనాభా నియంత్రణ జాతీయ విధానంలో ఒక ఆమోదనీయమైన భాగంగా ఉండేది. ’’మనమిద్దరం, మనకిద్దరు’’ అనే నినాదాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకుందాం. అత్యవసర పరిస్థితి కాలంలో సంజయ్‌ గాంధీ సామూహికంగా కుటుంబ నియంత్రణపై కొనసాగించిన తప్పుడు ప్రచారం ఫలితంగా జనాభా నియంత్రణ అనేది రాజకీయంగా స్పృశించరానిదిగా మారిపోయింది. ఇప్పుడు ఈ కొత్త దృక్పథం ఏం చెబుతోందంటే, ఆదాయాల్లో పెరుగుదల, సంపదలో సాధారణ పెరుగుదల జరగాలంటే జనాభా వృద్ధిని కట్టడి చేయాలనే. 

నిజానికి, విద్యా వ్యాప్తికి ప్రత్యేకించి స్త్రీ విద్యా వ్యాప్తికి జనాభా కట్టడితో మరింత సన్నిహిత సంబంధం ఉంది. లేట్‌ మ్యారేజీలకు, లేబర్‌ మార్కెట్లో మహిళలు విస్తృతంగా ప్రవేశించడానికి కూడా జనాభా కట్టడితో సంబంధముంది. ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అనుభవాల ద్వారానే కాకుండా, భారత్‌లోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల అనుభవాల నుంచి కూడా ఈ విషయాన్ని నిర్ధారించవచ్చు. ఈ రెండు రాష్ట్రాలూ అధిక అక్షరాస్యతను, సాపేక్షికంగా మరింత ఎక్కువ మహిళా సాధికారతను ఆస్వాదిస్తున్నాయనేది తెలిసిందే.

తర్వాత మనం 1990ల నుంచి ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు, ఉదారవాద దశకు వద్దాం. జనాభా తనకుతానుగా అతిపెద్ద లాభం అంటూ వర్ణించిన ఈ కాలంలోనే భారత్‌లో జనాభా పెరుగుతూ వచ్చింది, వీరిలో యువజనాభానే ఎక్కువ. వీరినే దేశానికి పెద్ద సంపదగా భావించేవారు. అదే సమయంలో ఉత్తర అమెరికా, యూరప్, జపాన్‌ వంటి పరిణతి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వయోవృద్ధులు వేగంగా పెరుగుతున్నారని మరో వాదన ఉండేది. ఈ దేశాల్లోని నిరంతర ఆర్థిక వృద్ధికి చైనా, భారత్‌ లాంటి దేశాల్లో పెరుగుతున్న యువ జనాభా ఎక్కువగా అవసరమౌతుందని చెప్పేవారు. 

దేశంలోని యువ, ఉత్పాదకతా సామర్థ్యం కలిగిన జనాభాకు అధికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించిన పక్షంలోనే జనాభాపరమైన ఈ డివిడెండ్‌ను వినియోగించుకోగలం. దీనికోసం కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే పరిశ్రమల ఏర్పాటుకు తగిన పెట్టుబడి కల్పన అవసరమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే యువజనాభాను తప్పకుండా ఉద్యోగాల్లో నియమించాలి. దీనికి అధిక అక్షరాస్యత, తగినన్ని నైపుణ్యాలు, వేగవంతమైన ముందంజకు చర్యలు చేపట్టడం తప్పనిసరి. 
ఈ మొత్తం ప్రక్రియ సజావుగా సాగాలంటే ప్రజానీకానికి ఆరోగ్యం, విద్య తప్పనిసరి. దేశంలోని పిల్లల్లో అధికశాతం పోషకాహార లేమి బారిన పడితే వీరి ఉత్పాదకతా సామర్థ్యం తగ్గిపోతుంది. మరో వాస్తవాన్ని కూడా విస్మరించరాదు. జనాభాపరంగా లాభదాయికతతో ఉండే దశను భారత్‌ సమీపించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అలాగే 2050 నాటికి కానీ దేశ జనాభా 160 కోట్లకు పెరిగి స్థిరీకరణ చెందదు. భారీ స్థాయిలో ఉపాధి, ఉద్యోగాలను కల్పించి అధిక వృద్ధిరేటు వైపు దేశం పయనించలేకపోతే, మనం స్వల్ప ఆదాయాల ఉచ్చులోపడి కొట్టుకుపోవడం తథ్యం.

ఉత్తరప్రదేశ్‌ జనాభా కట్టడి.. సమస్యల పుట్ట
జనాభా నియంత్రణకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన నూతన కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలెన్నో ఉన్నాయి. జనాభా అనే లాభదాయక పార్శా్వన్ని మనం కోల్పోతున్నామని ముసాయిదా నర్మగర్భంగా అంగీకరిస్తోంది. అలాగే జనాభా పెరుగుతున్నప్పటికీ ఉత్పత్తి చేసే వారిపై ఆధారపడే జనాభా నిష్పత్తి మాత్రమే పెరుగుతూ పోతే మొదటికే మోసం వస్తుంది. జనాభా అనే వనరు లాభదాయకంగా ఫలితాలు అందించడానికి దేశానికి మరో దశాబ్ది సమయం పడుతుందని ఇంతవరకు అందుబాటులో ఉన్న డేటా సూచిస్తోంది. దాంతోపాటు కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే ఉత్పత్తి కార్యకలాపాలు పెంచడం, భారత్‌ని తక్కువ ఆర్థిక వ్యయంతో సాగే పునాదిమీద నిలబెట్టడం తప్పనిసరి అవసరం.

మొదట్లో చైనాలో, ఇప్పుడు వియత్నాంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితినే మనం చూశాం. ఇది త్వరలో బంగ్లాదేశ్‌ తలుపులు కూడా తట్టబోతోంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనం అమలు చేస్తున్న కొన్ని విధానాలు సరిగ్గా ఈ తర్కానికి భిన్నంగా సాగుతున్నాయి. ఉదాహరణకు ఉత్పత్తితో లింక్‌ చేసిన ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని అమలు చేయాలంటే, తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో పనిచేయించుకుంటూ టెక్నాలజీని ఎక్కువగా వాడే పరిశ్రమల పంథాను మార్చడానికి ప్రజాధనాన్ని భారీగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. దీనికి బదులుగా దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. అవకాశముంటే అసంఘటిత రంగాన్ని కూడా ఈ పథకంలో భాగం చేయాలి. పెట్టిన ప్రతి మదుపుకూ అధికంగా ఉద్యోగాలను సృష్టించే శక్తి అసంఘటిత రంగంలోనే ఎక్కువ.

నిరంకుశ అమలు దెబ్బకొడుతుంది
చైనాలో కుటుంబానికి ఒకే బిడ్డ విధానం నిరంకుశంగా అమలు చేశారు. అందుకే జనాభా నియంత్రణను సాధించడంలో చైనా తగుమాత్రంగా విజయం పొందింది. అలాంటి అమానవీయమైన ప్రభుత్వపరమైన చర్య ప్రజాస్వామ్యంలో అమలు చేయడం అసాధ్యం. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. దేశానికి తక్కువ పునరుత్పాదక రేటు అవసరమనుకుంటే దానికి విద్య... ప్రత్యేకించి స్త్రీ విద్య, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. అత్యధిక ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటే అదే పునరుత్పాదకత రేటును తగ్గిస్తుంది. జనాభా వృద్ధిని తగ్గించడం ద్వారా లేక పరిమితం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచడం కంటే ఇదే ఉత్తమమైనది. పైగా జనాభా నియంత్రణ అన్నిటికీ పరిష్కారం అనే ఆలోచన మరిన్ని ప్రశ్నలను రేకెత్తించకమానదు.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ముసాయిదాలోని కొన్ని ఇతర అంశాలు స్వాగతించదగినవే. తల్లులు, శిశువుల మరణాల రేటును తగ్గించడం, ఆయుర్దాయాన్ని పొడిగించే చర్యలను ప్రోత్సహించడం, మాతా శిశు సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించడం వీటిలో కొన్ని. అర్థవంతమైన ప్రజారోగ్య విధానానికి ఇవన్నీ అత్యవసరమైనవే. అంతేతప్ప జనాభా నియంత్రణ విధానం లాంటిది మనకు అవసరం లేదు. ఉత్తమమైన ప్రజారోగ్య విధానం, ఉత్తమమైన విద్యా విధానం మనకు అవసరం. సమగ్ర ఆర్థిక వ్యూహం మరీ అవసరం.


శ్యామ్‌ శరణ్‌
వ్యాసకర్త విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి
(ట్రిబ్యూన్‌ ఇండియా సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top