ఉక్రెయిన్‌ ఆత్మస్థయిర్యం పెరిగిందా?

Sakshi Guest Column On Ukraine

విశ్లేషణ

రష్యాతో యుద్ధం ప్రారంభమైనప్పుడు కనిపించినంత బలహీనంగా ఇప్పుడు ఉక్రెయిన్‌ లేదు. అజేయంగా కనిపిస్తూ రాత్రి పూట మీదపడే రష్యన్‌ ఆయుధాల నుంచి ఉక్రెయిన్‌ తనను తాను కాచుకుంటోంది. ఇది కీవ్‌లో వ్యక్తమవుతున్న కొత్త ఆత్మవిశ్వాసంలో కొంతభాగం మాత్రమే. రష్యాలోని తమ స్లీపర్‌ సెల్స్‌ను క్రియాశీలం చేయడంలో ఉక్రెయిన్‌ యంత్రాంగం సఫలీకృతం అయినట్లే కనిపిస్తోంది.

క్రెమ్లిన్‌ ఆకాశం మీదుగా ప్రయోగించిన మానవ రహిత డ్రోన్స్ వాస్తవానికి ఉక్రెయిన్‌ పంచమాంగ దళం పేల్చినవే అయివుండవచ్చని వార్తలు! తూర్పు ఆసియా పర్యటనలో భాగంగా హిరోషిమాలో జెలెన్ స్కీని కలవడానికి మోదీ అంగీకరించడం 15 నెలల యుద్ధం తర్వాత ఉక్రేనియన్‌ దౌత్యం పురోగమించిందనటానికి సాక్ష్యం.

మే 24 నాటికి రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మొదలై 15 నెలలు. అవే శీర్షికలు, అవే చిత్రా లతో విసిగిపోయిన చాలామందికి యుద్ధ అలసట అకస్మాత్తుగా ముగిసిపోయినట్లుగా ఉంది. ఒకే రాత్రి రాజధాని కీవ్‌పై ప్రయోగించిన 30 రష్యన్‌ క్షిపణుల్లో 29 క్షిపణుల్ని తాము పేల్చివేసినట్లు ఉక్రెయిన్‌ చేసిన అద్భుత ప్రకటన కారణంగా ఈ అలసట ముగియలేదు.

ఈ క్షిపణుల్లో అడ్డుకోడానికి ‘వీల్లేని’ కింజాల్‌ హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ ఆయుధాలు, ఇంకా భూమి, సముద్రం, గగనతలం నుంచి పేల్చిన అదేవిధమైన ఇతర ఆయుధాలు ఉన్నాయి. సముద్రంలోనూ, కీవ్‌ చరిత్రాత్మక సంప్రదాయ చర్చీల నేపథ్యంలో గగనమార్గాన తాము కూల్చిన క్షిపణుల వీడియోలను, కొన్ని ఫోటోలను ఉక్రెయిన్‌ ప్రదర్శించినప్పుడు ఆ ప్రకటనలను ప్రపంచం పాక్షికంగానైనా ఎత్తిపట్టింది. 

యుద్ధం ప్రారంభం నుంచి తన ట్రేడ్‌ మార్క్‌ డ్రెస్‌గా మారిన రౌండ్‌ నెక్‌ కాలర్‌ లేని టీ షర్టును ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ జెలెన్ స్కీ వదిలిపెట్టినప్పుడు ఈ యుద్ధకాలపు అలసటకు కాస్త విరామం లభించింది. గత శుక్రవారం జెలెన్‌స్కీ సైనిక ఛాయలు కలిగిన పోలో షర్టు ధరించి జెడ్డాలో దిగారు. ఇది కుట్టుపని విషయంలో స్వాగతించదగిన మార్పు.

డ్రెస్‌ కోడ్‌ విషయంలో సంప్రదాయ సున్నితత్వాలకు రాయితీలాగా జెలెన్ స్కీ ధరించిన పోలో షర్ట్‌ పొడవాటి చేతులను కలిగి తన అరచేతులు, తల, మొహం మినహా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచింది. అరబ్‌ లీగ్‌ సదస్సుకు తగిన మర్యాదను జెలెన్‌స్కీ ప్రదర్శించారనే చెప్పాలి. గత సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి 77వ సర్వసభ్య సమావేశంలో గుండ్రని నెక్‌ లైన్, ‘ప్లాకెట్‌ స్లీవ్‌’లతో కూడిన ముడతలు పడిన హెన్లీ షర్ట్‌ ధరించి ప్రసంగించి ప్రోటోకాల్, దౌత్యపరంగా చూపిన అమర్యాదకు ఇది భిన్నం.

రష్యన్‌ గగనతల దాడులను తోసిరాజనడం, రాజధాని కీవ్‌ వీధుల్లో మడత నలగని దుస్తులు ధరించిన ప్రపంచ దేశాల నేతల ముందు బాగా నలిగిన టీ షర్టులతో కనిపించడం అనేది జెలెన్ స్కీ తనదైన ప్రకటన చేసే విధానం కావచ్చు. కానీ సంవత్సర కాలంగా ఒక పదవిలో ఉన్న అధ్యక్షుడి ఇటువంటి చేష్టలు విసుగు పుట్టించాయి. దేశాధ్యక్షుడు తన కండపుష్టిని అలా ప్రదర్శించడం ప్రమాదకర పరిస్థి తుల్లో జీవిస్తున్న ఉక్రెనియన్ల విశ్వాసాన్ని పెంపొందించవచ్చు లేదా పెంపొందించకపోవచ్చు. కానీ ప్రపంచ ప్రజలకు మాత్రం అది సరైన అభిరుచిగా తోచలేదు.

ఇటీవల సంభవించిన మార్పులు కాకతాళీయంగా జరిగినవి కాదు. నిదానంగానే కానీ కచ్చితంగా రష్యా నుండి వచ్చినదానికి ఉక్రె యిన్‌ తగినట్టుగా స్పందించడం ప్రారంభించింది. గత ఏడాది ఫిబ్ర వరిలో యుద్ధం ప్రారంభమైనప్పుడు రష్యాకు వ్యతిరేకంగా కనిపించినంత బలహీన స్థితిలో ఉక్రెయిన్‌ ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పటివరకు అజేయంగా కనిపిస్తూ రాత్రి పూట మీదపడే ఆయుధాల నుంచి ఉక్రెయిన్‌ తనను తాను కాచుకుంటోంది. ఇది కీవ్‌లో వ్యక్తమ వుతున్న కొత్త ఆత్మవిశ్వాసంలో కొంతభాగం మాత్రమే.

ఆ డ్రోన్లు రష్యా లోపలి నుండి పేల్చినవే!
రష్యాలో నిత్యం ఉనికిలో ఉండే తమ వేలాది ‘స్లీపర్‌ సెల్స్‌’ను క్రియాశీలం చేయడంలో జెలెన్ స్కీ యంత్రాంగం సఫలీకృతం అయి నట్లే కనిపిస్తోంది.  విశ్వసనీయమైన గణాంకాల ప్రకారం రష్యాలో దాదాపు 60 లక్షలమంది ఉక్రెయిన్‌ జాతి ప్రజలు నివసిస్తున్నారు. సామీప్యత, ఇంకా రాజకీయాల వల్ల శతాబ్దాల పరస్పర ఏకీకరణ చరిత్ర మిగిల్చిన ఫలితం ఇది.

ఇలాంటి పరిస్థితుల్లో తమ మాతృభూమి కోసం పంచమాంగ దళంగా పనిచేయడానికి రష్యాలోని వేలాది మంది ఉక్రెయిన్‌ వాసులు సంసిద్ధతతో ఉండటం కద్దు. ఈ నెల మొదట్లో క్రెమ్లిన్‌ ఆకాశం మీదుగా ప్రయోగించిన మానవ రహిత డ్రోన్స్ వాస్తవానికి రష్యాలోని ఉక్రెయిన్‌ పంచమాంగ దళం పేల్చినవే అయివుండవచ్చని వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌ భూభాగం నుంచి ఈ డ్రోన్స్‌ను ప్రయోగించి ఉంటే వాటిని రష్యా తప్పకుండా కనిపెట్టే అవకాశం ఉండేది.

దేశం లోపలి నుంచి వీటిని పేల్చారు కాబట్టి వాటిని రష్యా కనుగొనలేకపోయిందని చెప్పాలి. రష్యాలో విద్రోహ చర్యలు, ఆస్తి విధ్వంసక చర్యలు పెరుగుతుండటం... రష్యా లోపలి ఉక్రెయిన్‌ స్లీపర్‌ సెల్స్‌ కార్యాచరణ విజయవంతమవుతోందని సూచి స్తోంది. ఈ పరిస్థితి భారత్‌లోకి పాకిస్తాన్‌ ఎగుమతి చేస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పోలి ఉంది.

చిట్టచివరకు పాశ్చాత్య మిత్ర దేశాల నుంచి జెలెన్ స్కీ అత్యా  ధునికమైన ఆయుధ సామగ్రిని అందుకుంటున్నారు కాబట్టి కూడా యుద్ధం ఉక్రెయిన్ వైపునకు తిరుగుతున్నట్లుంది. నాటో సైనిక దళాలు రహస్యంగా యాంటీ మిస్సైల్‌ బ్యాటరీస్‌ వంటి హైటెక్‌ రక్షణ సామగ్రిని నిర్వహిస్తున్నట్లుంది. రష్యా సైనిక లక్ష్యాలను అత్యంత నిర్దిష్టతతో కూల్చడం కూడా నాటో బలగాల జోక్యాన్ని ఎత్తి చూపుతుంది.

ఈ యుద్ధం తనకు అనుకూలంగా పరిణమిస్తున్నదానికి సరితూగేట్టుగా జెలెన్‌స్కీ ఆహార్యం కనబడుతోంది. హూడ్‌తో కూడిన ముదురు గోధుమ రంగు విండ్‌చీటర్‌లో జెలెన్ స్కీ హిరోషిమాలో జరిగిన జి–7 దేశాల సదస్సులో (మే 19–21) పాల్గొనడానికి వచ్చారు. అయితే ఇంకా టైతో కూడిన జాకెట్‌ ధరించలేదు.

అంతకు రెండు రోజుల క్రితం పోలో షర్టులో ఆయన జెడ్డాలో దిగినప్పుడు, ఆయన భార్య, ప్రథమ మహిళ ఒలెనా జెలెన్ స్కా మందపాటి, పాక్షికంగా సైనిక శైలి ఆకుపచ్చ దుస్తులు ధరించి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అత్యంత ప్రముఖ మీడియా కార్యక్రమంలో ప్రసంగించారు. ఆ డ్రెస్‌ ఆమె మెడ కింది భాగం నుంచి ఆమె మోకాళ్ల కిందివరకు పాకి ఉంది.

ఆ తర్వాత సియోల్‌ మెట్రోపాలిటన్‌ ప్రభు త్వంతో ఒక సాంస్కృతిక మార్పిడి ఒప్పందంపై సంతకం చేసినప్పుడు మెరిసే తెల్ల షర్టు, దానికి వ్యత్యాసంగా నల్ల ప్యాంట్స్, దానికి తగిన ట్లుగా నడుముకు బెల్టు, ఏక ఆభరణంతో అత్యంత సొగసుగా ఆమె కనిపించారు. తమ దేశానికి ప్రాణాంతకం కాని సైనిక సహాయం మాత్రమే కావాలంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సక్‌ యోల్‌ వైపు వేలు చూపి మరీ ఆమె అడిగిన సమయంలో దక్షిణ కొరియా ప్రజలపై ఆమె గట్టి ముద్ర వేశారు.

జెలెన్ స్కీ ఈ నెలలో యూరప్‌ వ్యాప్తంగా దౌత్య పర్యటనలకు వెళ్లారు. తాము మాత్రం స్వదేశంలోనే ఉంటూ తమ స్థాయి విదేశీ నాయకులను కీవ్‌లోనే కలవడం అనే ఉక్రేనియన్‌ నాయకుల మును పటి విధానంలో ఆయన మార్పు తెచ్చారు. మే 1వ తేదీ నుంచి ఆయన ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బ్రిటన్‌లలో పర్యటించారు. మే మధ్యలో ఆయన వాటికన్‌ సందర్శన అత్యంత భావోద్వేగపూరితమైనదిగా నిలిచింది.

భారత్‌ శాంతి ప్రణాళిక?
ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం ఫిబ్రవరికి ముందు జెలెన్‌స్కీకి సమయం కేటాయించలేదు. ఉక్రెయిన్‌ ఒక అస్థిరమైన దేశంగా ఉండేది. భారత్‌కు దాంతో ఉపయోగం లేదు. పైగా ఉక్రెయిన్‌లోని వరుస ప్రభుత్వాలు భారత్‌పై ఉపయోగించేందుకు పాకిస్తాన్ కు ఆయుధాలను విక్రయించడానికి ప్రయత్నించాయి.

అయితే, తన తూర్పు ఆసియా పర్యటనలో భాగంగా హిరోషిమాలో జెలెన్ స్కీని కలవడానికి మోదీ అంగీకరించడం, 15 నెలల యుద్ధం తర్వాత ఉక్రేనియన్‌ దౌత్యం పురోగమించిందనటానికి గుర్తింపుగా నిలిచింది. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి తన విధానానికి ఎప్పటికప్పుడు చురుకైన సర్దుబాట్లు చేసుకోవాలని భారతదేశం గుర్తించింది. అయితే ఇదేమైనా భారత శాంతి ప్రణాళికలో భాగమా అని కొన్ని వర్గాలు అనుకుంటున్నాయి.
కేపీ నాయర్‌ 
వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు :

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top