
కంచ కట్టయ్య
సందర్భం
తెలంగాణలో ఓ మారుమూల పల్లెలో దాదాపు అర్ధ శతాబ్దం క్రితం ఓ పల్లెటూరి గొర్లకాపరి కేవలం సైన్సును నమ్మి తన గుండెజబ్బుతో పోరాడి విజయం సాధించిన కథ ఇప్పటికీ మూఢనమ్మకాల్లో కునారిల్లేవారికి మేలుకొలుపు. కంచ కట్టయ్య వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటలో 1948లో జన్మించాడు. 11వ తరగతి వరకు నర్సంపేట హైస్కూల్లో చదివి, తల్లి మరణం తరువాత 1969లో పెళ్లి చేసుకొని, వ్యవసాయం– కులవృత్తి గొర్లమంద వ్యవహారం చూసుకునేవాడు.
అకస్మాత్తుగా 1976లో ఆయనకు గుండె జబ్బు వచ్చింది. హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఫిజిషియన్‌కు చూపించగా, ‘ఈయనకు గుండెలో రెండు వాల్వులు (కవాటాలు) పనిచేస్తున్నట్టు లేవు. బతకడం కష్టం’ అని చెప్పి, తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ) హాస్పిటల్, వెల్లూరులో ఈమధ్య ఆపరేషన్లు చేస్తున్నారనీ, అక్కడికి వెళ్లమనీ చెప్పారు. ఆ రోజుల్లో హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈసీజీ, ఎకోగ్రామ్ వంటి పరికరాలు కూడా లేవు.
నిజానికి అప్పటికే ఆయన ఇద్దరు పిల్లల తండ్రి. భార్య నిరక్షరాస్యురాలు. కట్టయ్య హైదరాబాదులో చదువుకుని ఉద్యోగం చేస్తున్న తమ్ముడిని తీసుకొని వెల్లూరు వెళ్ళాడు. పరీక్షలు చేయించుకుంటే ఆయన గుండెలో అతి కీలకమైన వాల్వ్ పనిచెయ్యడం లేదని తేల్చారు. 45–50 వేల వరకు ఖర్చుపెట్టగలిగితే ఆపరేషన్ చేస్తామన్నారు. ఆపరేషన్‌కు సిద్ధమయ్యాడు కట్టయ్య.
సీఎంసీలోని ప్రసిద్ధ థొరాసిక్ సర్జన్ స్టాన్లీ జాన్ యువకుడు. అప్పుడప్పుడే అమెరికాలో తయారై సీఎంసీకి అందుబాటులోకి వచ్చిన స్టార్–ఎడ్వర్డ్ స్టీల్ వాల్వ్‌లను అమర్చడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. 1979 నాటికే పేరున్న సర్జన్. గుండెలో అమర్చడం కోసం ఎడ్వర్డ్ కంపెనీ చేసిన మొదటి వాల్వ్ అది.
కట్టయ్య స్కూల్లో ఉన్నప్పుడే సైన్సువాదిగా మారాడు. మూఢ నమ్మకాలు ఊళ్ళలో ఆనాడు కోకొల్లలు. ఈనాటికీ ఉన్నాయి. తాను చనిపోతాడని డాక్టర్లు చెప్పాక కూడా ఒక్క పైసా కూడా మూఢ నమ్మకం మీద ఖర్చు పెట్టనని మొండిచేసిన మనిషి. ‘నన్ను బతికిస్తే డాక్టర్లు, మందులు మాత్రమే బతికించగలవు’ అని గట్టిగా నమ్మాడు. వాల్వ్‌ను గుండెలో పెట్టించుకోవడానికి అప్పులు సప్పులు చేశాడు.
సీఎంసీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్ ఆయనకు 1979 డిసెంబర్ 17న ఆపరేషన్ చేస్తామని డేట్ ఇచ్చింది. ఇటువంటి ఆపరేషన్ చేయించుకొని బతికిన మనిషి ఉదాహరణ తన ముందు లేదు. ఆ రోజుల్లో డాక్టర్లు మనుషుల్ని ఇలా ఆపరేషన్ చేసి గుండెను రిపేర్ చేస్తారనే ఆలోచనే లేదు. గ్రామాల్లో ఆనాడు అసలు చదువే లేదు. డాక్టర్లు ఆపరేషన్ ఖర్చులతోపాటు రక్తం ఇవ్వడానికి 8 మంది కావాలని చెప్పారు.
అందులో నలుగురు ఎప్పుడైనా ఇచ్చిపోవచ్చు, మరో నలుగురు ఆపరేషన్ చేసే రోజే ఇవ్వాలి. ఇది సాధారణ విషయం కాదు. మనిషి శరీరం నుంచి రక్తం తియ్యడమంటేనే భయమున్న రోజులవి. రక్తదానం మీద ఆనాడు అవగాహనే లేదు. మిత్రులు, తమ్ముని సహాయంతో కుటుంబ భారాన్ని భార్యకు, ఒక చెల్లె కుటుంబానికి అప్పజెప్పి 8 మంది రక్తదాతలతో వెల్లూరు వెళ్ళాడు.
కట్టయ్యకు స్టాన్లీ జాన్ ఆపరేషన్ విజయవంతంగా చేశాడు. డాక్టర్ చరియన్ ఆయనకు అతి జాగ్రత్తగా జీవరక్షణ డ్రగ్స్, ముఖ్యంగా అసిట్రోమ్ 0.5 ఎం.జి. సెట్ చేశాడు. ఇది అటువంటి కృత్రిమ వాల్వ్‌తో బతికే పేషంటుకు ప్రతిదినం చావో బతుకో నిర్ణయించే ట్యాబ్లెట్. అది ప్రతిదినం నిర్ణీత సమయానికి వేసుకోకపోతే రక్తం గడ్డ కడుతుంది. డోసు ఎక్కువైతే రక్తం పలచనై ప్రాణాపాయానికి దారితీస్తుంది.
1984లో కట్టయ్యకు మళ్ళీ రక్తం పల్చదనం తగ్గి, బ్రెయిన్ క్లాట్స్ ఏర్పడి ఫిట్స్ రావడం మొదలైంది. భార్య భారతి హైదరాబాదు ఉస్మానియాకు తెచ్చి అడ్మిట్ చేసింది. నెల రోజులు కోమాలో ఉన్నాడు. 50 రోజులకు బతికి బయటపడ్డాడు. అప్పటినుంచి హైదరాబాదులో పిల్లలతోనే జీవించడం, హాస్పిటల్ అవసరాలు, పిల్లల చదువులు, 2010లో మళ్ళీ నిమ్స్‌లో అడ్మిషన్, 18 రోజులు వెంటిలేటర్‌పై చావుతో పోరాడాడు.
ఆయనకు 1979లో అమర్చిన ఎడ్వర్డ్ స్టీల్ వాల్వ్ చక్కగా పనిచేయడం, అప్పుడు నిమ్స్ డైరెక్టర్‌గా వున్న డాక్టర్ ప్రసాదరావును ఆశ్చర్యపరిచింది. ఆయన పర్యవేక్షణలో మళ్ళీ బతికి బయటపడ్డాడు. పడిపోవడాలు, దినాల తరబడి ఎక్కిళ్ళు, హాస్పిటల్ అడ్మిషన్లు నిరంతరం సాగాయి. అయినా బతుకు కొనసాగించాడు.
ఈ కట్టయ్య అకస్మాత్తుగా బాత్‌రూమ్‌లో కమోడ్‌పై కూర్చుని ఉండగా, ఆయన గుండెలో అమర్చిన ఫస్ట్ జనరేషన్ స్టీల్ వాల్వ్ పనిచేయడం ఆగిపోయి జూన్ 7న సైలెంట్‌గా 77వ ఏట కన్నుమూశాడు. ఆయన పుట్టిన గ్రామం పాపయ్యపేటలో అదే నెల 26వ తేదీన ఏర్పాటు చేసిన ‘సైన్సు మనిషి కంచె కట్టయ్య’ యాదిలో జరిగిన సభలో ఉమ్మడి రాష్ట్రంలో నిమ్స్‌లో గుండె ఆపరేషన్లు మొదటగా ప్రారంభించిన ‘పద్మశ్రీ’ దాసరి ప్రసాదరావు 46 ఏళ్లు ఆయన గుండెలో అమర్చిన వాల్వ్ గురించి గుండె మోడల్ తెచ్చి 40 నిమిషాలు వివరించారు.
వందలాది గ్రామస్థులు అది తమ సొంత గుండెకు సంబంధించిన సమస్యగా విన్నారు. 46 ఏళ్లు ఏకైక – అదీ మొట్టమొదట ప్రపంచంలో తయారైన వాల్వ్‌తో ఈయన బతకడం ప్రపంచ రికార్డ్ అని ప్రకటించారు. ప్రస్తుతం నిమ్స్ డైరెక్టర్‌గా ఉన్న డా‘‘ నగరి బీరప్ప– ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జన్, లండన్ ఎఫ్‌ఆర్‌సిఎస్ బోర్డ్ మెంబర్ ‘కట్టయ్య జీవితం ఒక మెడికల్ మిరాకిల్’ అని పోస్ట్ చేశాడు.
కట్టయ్య పూర్తిగా మూఢ నమ్మకాల వ్యతిరేకి. మందులు, ఆపరేషన్ల వల్ల మాత్రమే వ్యాధులు తగ్గుతాయి కాని, మూఢ నమ్మకాల వల్ల కాదని జీవితాంతం నమ్మాడు. అలానే జీవించాడు. ఈయన జీవిత ఉదాహరణ ప్రజలను సైన్సు, మానవత్వం వైపు మళ్లిస్తుందని ఆశిద్దాం!
కంచ ఐలయ్య షెఫర్డ్
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు