తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!

Rentala Jayadeva Article On Tollywood Producer Katragadda Murari - Sakshi

నివాళి

అభిరుచి గల మురారి... ఆద్యంతం సాహిత్య సంగీతాల్ని ప్రేమించిన మురారి... మంచి చిత్రాల నిర్మాత ‘యువచిత్ర’ మురారి వెళ్ళిపోయారు. మూడు దశాబ్దాల స్నేహంలో ఎన్నో ఘటనలు మనసులో రీళ్ళు తిరిగాయి. మురారిది కమ్యూనిస్ట్‌ కుటుంబం. బెజవాడలో బాగా డబ్బున్న కాట్రగడ్డ కుటుంబం. సినీ నిర్మాణానికి పంపిణీ వ్యవస్థే మూలస్తంభమైన రోజుల్లో ప్రతిష్ఠాత్మక నవయుగ ఫిల్మ్స్‌ అధినేతకు అన్న కొడుకు. ఆ కొంగుచాటులన్నీ దాటుకొని, కష్టపడి, ఒక్కో మెట్టూ పేర్చు కుంటూ మురారి తనదైన కీర్తి, అపకీర్తుల సౌధం కట్టుకు న్నారు.

వి. మధుసూదనరావు వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడైన మురారికి అనంతరకాల అగ్ర దర్శకుడు కోదండరామి రెడ్డి సహపాఠీ. జెమినీ వాసన్, విజయా చక్రపాణి వద్ద నిర్మాణ మెలకువలు నేర్చుకున్నారు. కొట్లాడే దర్శకుడు కాబోయి, తిట్టి మరీ చెప్పి చేయించుకొనే నిర్మాతగా మారడమే తెలివైన పని అని గ్రహించారు. తనకు నచ్చిన సినిమాలే తీశారు. తనకు నచ్చినట్టే తీశారు. పంతం పట్టి రీషూట్లూ చేశారు. పారితోషికం పెంచి ఇస్తూ, పని చేయించుకున్నారు. ‘తిడతాడు.. డబ్బుతో కొడతాడు’ అనిపించుకున్నారు. సమకాలికుల్లో విలక్షణంగా నిలిచారు. బ్యానరే ఇంటిపేరైన కొద్ది నిర్మాతల్లో ఒకరయ్యారు.

మద్రాస్‌ మెరీనా బీచ్‌లోని దేవీప్రసాద్‌రాయ్‌ చౌధురి ‘శ్రామిక విజయం’ శిల్పం తమ సంస్థకు చిహ్నంగా పెట్టుకో వడం మురారి పెరిగిన వాతావరణపు ఆలోచన. నవలల్ని తెరపైకి తెచ్చినా, ఇంగ్లీష్‌ ఇతివృత్తాల్ని తెలుగు కథలుగా మలిచినా అది ఆయన పెంచుకున్న అభిరుచి. ‘సీతామాలక్ష్మి, గోరింటాకు, త్రిశూలం, సీతారామ కల్యాణం’ వగైరా అన్నీ కలిపి తీసినవి 9 సినిమాలే! విజయ బాపినీడుతో కలసి నిర్మించిన ‘జేగంటలు’ తప్ప అన్నీ సక్సెస్‌లే. నందులతో సహా అనేక అవార్డులు తెచ్చినవే. ఆయన పాటలు అందమైన హిందోళాలు. ఎవర్‌గ్రీన్‌ హిట్లు. ఒకే నిర్మాత సినిమాల్లోని సాహిత్య విలువలపై 20 ఏళ్ళక్రితమే విశ్వవిద్యాలయ పరిశోధన జరిగింది ఒక్క ‘యువచిత్ర’ సినిమాలకే! ‘మామ’ మహదేవన్‌ లేకుండా సినిమా తీయనన్న మురారి, మామ పోయాక నిజంగానే సినిమా తీయలేకపోయారు. కీరవాణి సంగీతంతో కథ, సంగీత చర్చలు జరిగినా ముందుకు సాగలేదు.

మూగబోయిన కృష్ణశాస్త్రిని ఆరాధిస్తూ బాంబే బ్రెడ్‌ టోస్ట్‌ చేసిచ్చినా, ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కని పాలగుమ్మి పద్మ రాజును ఆస్థాన రచయితగా పోషించినా, కనుమరుగైన మహా నటి సావిత్రితో ‘గోరింటాకు’లో పట్టుబట్టి వేషంవేయించినా, జగ్గయ్య సారథ్యంలో ‘మనస్విని’ ట్రస్ట్‌–అవార్డులతో మరణిం చిన ఆత్రేయను కొన్నేళ్ళు ఏటా స్మరించినా, ఎస్పీబీ – సత్యానంద్‌ – జంధ్యాల – ఓంకార్‌లతో గాఢంగా స్నేహిం చినా... అది మురారి మార్క్‌ ప్రేమ. కృష్ణశాస్త్రి మరణించాక ‘ఇది మల్లెల వేళ’ అంటూ ఎంపిక చేసిన 11 పాటల్ని ఎల్పీ రికార్డుగా హెచ్‌ఎంవీతో పట్టుబట్టి రిలీజ్‌ చేయించారు. ఆత్రేయ సాహిత్యం వెలికి రావడంలో పాత్ర పోషించారు. ప్రొడ్యూసరంటే కాంబినేషన్లు కుదిర్చే క్యాషియరనే కాలం వచ్చాక, అభిరుచి చంపుకోలేక మూడు దశాబ్దాల క్రితమే నిర్మాతగా స్వచ్ఛంద విరమణ చేశారు. సంపాదించిన డబ్బు సినిమాల్లో ‘సన్‌’ స్ట్రోక్‌కు ఆవిరి కారాదని తంటాలు పడ్డారు.

ప్రతిభను గుర్తించి, నెత్తికెత్తుకోవడం మురారి నైజం. 22 ఏళ్ళ క్రితం ఓ సికింద్రాబాద్‌ కుర్రాడు సినిమా తీస్తే, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. వార్త చదివిన మురారి ఆ కుర్రాణ్ణి చెన్నైకి పిలిపించి, అభినందించి, ఆతిథ్య మిచ్చి మరీ పంపారు. ఆ సినిమా ‘డాలర్‌ డ్రీమ్స్‌’. ఆ సంగతి నేటికీ తలుచుకొనే అప్పటి ఆ కుర్రాడే – ఇవాళ్టి శేఖర్‌ కమ్ముల. హీరోయిన్లు తాళ్ళూరి రామేశ్వరి, వక్కలంక పద్మ, గౌతమి, రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్‌ తండ్రి), కళా దర్శకుడు రాజులను మురారే తెరకు పరిచయం చేశారు.

అగ్ర హీరోలు, దర్శకులతో పని చేసినా వారి కన్నా రచయితలతోనే ఆయనకు స్నేహం. డాక్టర్‌ జివాగో లాంటి నవలలు, వాటిని తెరకు మలి చిన తీరు గురించి మురారి చెబుతుంటే, డబ్బులు కాదు.. మనసు పెట్టినవాడే మంచి నిర్మాతనే మాటకు సాక్ష్యం అనిపిం చేది. నాటి ‘వేయిపడగలు’ నుంచి నేటి ‘అర్ధనారి’ దాకా బాగున్న ప్రతి నవల మురారి చదవాల్సిందే. చర్చించాల్సిందే. సందేహనివృత్తికి జగ్గయ్య, విఏకె రంగారావు, గొల్లపూడి, పైడి పాల, కాసల నాగభూషణం లాంటి వార్ని సంప్రతించాల్సిందే.  మురారితో మాటలన్నీ పోట్లాటలే! మాట తీరే అంత. చూపులకు కోపధారి. తెలియనివాళ్ళకు తిక్క మనిషి. సన్నిహితమైతే తెలిసేది– మాటలోనే కారం కానీ మనసు నిండా మమకారమే అని! ఒక దశ దాటాక... ఆయన ప్రేమించి, గౌరవించే హీరో శోభన్‌బాబు, దర్శకుడు దాసరి లేరు. సలహా చెప్పే స్నేహశీలి ఓంకార్‌ ముందే వెళ్ళి పోయారు.

చెన్నైగా మారిన మద్రాసులో తెలుగు చిత్రసీమ ఖాళీ అయింది. పాత మిత్రులు లేరు. కొత్తగా మిత్రులు కారు. ఊరవతల సముద్రపుటొడ్డు నివాసంలో విచిత్రమైన ఒంటరి తనం. సోషల్‌ మీడియాలో స్నేహాన్నీ, సాహిత్యంలో సాంత్వ ననూ వెతుక్కున్నారు. తోటలో తామరలు, ఇంట్లో కుక్కలతో సేద తీరాలనుకున్నారు. ఎఫ్బీలో నోరు చేసుకుంటూ వచ్చారు. దశాబ్దిన్నర క్రితం ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర’ కళ్ళు చెదిరే ఖరీదైన గ్రంథంగా రావడంలోనూ మురారి సంపా దకత్వ అభిరుచి కనిపిస్తుంది. తెలుగు నిర్మాతల వెల్ఫేర్‌ ట్రస్ట్‌ చేపట్టిన ఆ బరువైన రచనలో బలమైన ఆయన ఇష్టానిష్టాలు, చెలరేగిన వాదాలు, వివాదాలు మరో పెద్ద కథ. తోచుబడి కావట్లేదన్నప్పుడు, తరచూ చెప్పే పాత కబుర్లనే కాగితంపై పెట్టమన్న సలహా మురారిలోని రచయితను నిద్ర లేపింది. ఎన్నో చేదునిజాలు, నాణేనికి ఒకవైపే చూపిన కొన్ని అర్ధ సత్యాలను గుదిగుచ్చిన ఆయన జ్ఞాపకాల కలబోత ‘నవ్విపోదురు గాక’ సంచలనమైంది. పదేళ్ళలో 12 ముద్రణలు జరుపుకొంది. డ్రాఫ్ట్‌ రీడింగ్‌లో పలువురు ప్రముఖులు సందేహించినా, ఆటో బయోగ్రఫీల్లో అది నేటికీ టాప్‌సెల్లర్‌.

ఆ రచనకు ప్రేరకులం, తొలి శ్రోతలమైన ఓంకార్‌నూ, అస్మదీయుడినీ పదుగురిలో పదేపదే గుర్తుచేసుకోవడం మురారి సంస్కారం. ఆవేశభరిత మురారిది జీవితంలో, సినిమాల్లోనూ ముళ్ళ దారి. ముక్కుసూటి తత్వం, మార్చుకోలేని అభిప్రాయాలు, మాట నెగ్గించుకొనే ఆభిజాత్యంతో సహచరుల్ని దూరం చేసు కోవడం మురారి జీవలక్షణాలు. చరమాంకంలో తప్పు తెలుసుకున్నారు. ‘ఆఖర్న మోయడానికి నలుగురినైనా మిగుల్చుకో వాలయ్యా’ అనేవారు. అప్పటికే లేటైంది. ఆయన పోయారు.

ఆయన దర్శక, హీరోలెవరూ రాలేదు. సంతాపాలూ చెప్ప లేదు. అవసరాలే తప్ప అభిమానాలు తక్కువైన రంగుల లోకంలోని ఆ సంగతీ మురారికి ముందే తెలుసు. ‘‘ఏవయ్యా రేపు నే పోయాక పేపర్లో రాస్తావా? చదవడానికి నేనుండను కానీ, నా గురించి ఏం రాస్తావో ఇప్పుడే చెప్పచ్చుగా!’’ అనేవారు. ఇంత తొందరగా ఆయన కోరిక నెరవేరుస్తానను కోలేదు. రాశాను... చదివి చీల్చిచెండాడడానికి ఆయన లేరు. మద్రాస్‌ తెలుగు సినిమా ఆఖరి అనుబంధాల్లో మరొకటి తెగిపోయింది. చిన్ననాటి నుంచి చివరి రోజుల దాకా జీవి తంతో నిత్యం సంఘర్షిస్తూ, అలసిపోయిన డియర్‌ మురారి గారూ... రెస్ట్‌ ఇన్‌ పీస్‌ ఎట్లీస్ట్‌ ఇన్‌ దిస్‌ లాస్ట్‌ జర్నీ!
– రెంటాల జయదేవ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top