Indian Wrestlers Protest: మన క్రీడాకారిణులకు బాసట ఏది?

Jagmati Sangwan Write on Women Wrestlers Protest in Delhi - Sakshi

బుధవారం న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద అగ్రశ్రేణి భారతీయ మహిళా రెజ్లర్లు... భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు భ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు. తమను ఆయన లైంగికంగా వేధిస్తున్నారనీ, నిరంకుశంగా వ్యవ హరిస్తున్నారనేవి వారి ఆరోపణలు. ఈ ఉదంతం భారత క్రీడారంగంలోని మురికిని మరోసారి ఎత్తిచూపింది. క్రీడా సంస్థల నాయకత్వంలో ఉన్న పురుషాధిపత్యం, రాజకీయాలతో వారికున్న అవినాభావ సంబంధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఆ మధ్య హరియాణా క్రీడా మంత్రి, భారత హాకీ మాజీ క్రీడాకారుడు అయిన సందీప్‌ సింగ్‌పై మరో ప్రముఖ అథ్లెట్, మహిళా కోచ్‌ చండీగఢ్‌లో చేసిన ఆరోపణలూ దాదాపూ ఇటువంటివే.

క్రీడాకారిణులకు మద్దతు ఇవ్వడమే తమ విధిగా ఉండాల్సిన మన క్రీడాధికారులు వాస్తవానికి తమ రాజకీయ బలాన్ని వారిని వేధించడానికి అనుకూలంగా మలచుకుంటున్నారు. తమ వేధింపులను ఎదిరించినవారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తున్నారు. కుటుంబపరమైన మద్దతు ఏమాత్రం లేకుండా నెలలు, సంవత్సరాల తరబడి శిక్షణ పొందుతూ... రక్తం, చెమట, కన్నీళ్లను పణంగా పెడుతున్న మహిళలు వీరు. వీరికి మరో వృత్తిని ఎంచుకునే అవకాశమూ ఉండదు. అవినీతి పరులైన అధికారుల చేతుల్లో వీరు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు.

విషాదకరమైన విషయం ఏమిటంటే, క్రీడల్లో మహిళలపై వేధింపునకు సంబంధించి ఇటీవల వెలికివస్తున్న కేసులు నిజానికి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే. మహిళా రెజ్లర్లు తమ ప్రెస్‌ కాన్ఫ రెన్సులో ఎత్తి చూపినట్లుగా ఈ ప్రత్యేక సమస్యకు సంబంధించిన నిజమైన రూపం చాలా భారీ స్థాయిలో, అంత్యంత సంక్లిష్టంగా ఉంటోంది. క్రీడాకారిణులు చేస్తున్న ఫిర్యాదులను స్వీకరించడానికి ఇంతవరకు నెలకొల్పిన సమస్యా పరిష్కార నిబంధనలు ఏమాత్రం తమ ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. పైగా తమను వేధింపులకు గురి చేస్తున్న వారి గురించి బయటపడి ఫిర్యాదు చేయడానికి ఇవి మహిళల్లో ఏమాత్రం విశ్వాసం కలిగించలేదని కూడా స్పష్టమవుతోంది. 

వందలాది క్రీడాకారిణులు మౌనంగా ఉంటూ అధికారులకు లోబడి ఉండటానికి ప్రధాన కారణం వారు క్రీడల నుంచి బయటపడటానికి మరొక అవకాశం లేకపోవడమేనని చెప్పాలి. శక్తిమంతులైన రాజకీయ నియామకాల ద్వారా పదవుల్లోకి వచ్చి రాజకీయ సంరక్షణలో ఉంటున్న వారికి వ్యతిరేకంగా పోరాడటం అంత సులభం కాదని మహిళా అథ్లెట్లు, వారి కుటుంబాలకు బాగా తెలుసు. 

ఇక్కడ ఒక విషయాన్ని నొక్కి చెప్పాల్సి ఉంది. మన అంతర్జాతీయ క్రీడాకారిణులలో చాలామంది తమను సపోర్టు చేయడానికి తమ కుటుంబాలు తమ వనరులను మొత్తంగా వెచ్చిస్తున్నారని చెబుతూ వచ్చారు. అధికారిక ప్రవేశ ద్వారాలను వారి ముఖాలమీదే మూసివేసిన సమయంలో, జంతర్‌ మంతర్‌ వద్ద మన మహిళా రెజ్లర్ల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ని చూస్తున్నప్పుడు... కీలకమైన ప్రాక్టీస్‌ సీజన్లో ఇలా బయటికి వచ్చారంటే వారు ఎంత నిస్పృహకు గురై ఉంటారో కదా అని చూసేవారికి బాధ, ఆగ్రహం కలుగుతాయి. హరియాణాలో సైతం ఆ జూనియర్‌ మహిళా కోచ్‌ రాష్ట్ర క్రీడా మంత్రికి వ్యతిరేకంగా న్యాయం పొందడానికి ఒకచోటు నుంచి మరొక చోటుకి పరుగులు తీశారు. కానీ హరియాణా ప్రభుత్వం మాత్రం నిందితుడి పక్షానే నిలిచింది. ఆ రకంగా మహిళా క్రీడా కమ్యూ నిటీ మొత్తానికి అది ప్రతికూల సందేశాన్ని అందించింది.

ఆరోపణలకు గురైనవారు, వారి రాజకీయ ప్రభుత్వ యంత్రాంగానికి చెందినవారు బాధితురాలినే అవమానిస్తున్నారు. పైగా లైంగిక వేధింపు కేసుల వల్ల ఆపాదించబడే సామాజిక కళంకాన్ని భరిస్తూ... తమ కెరీర్‌నే నిలిపివేయగలిగిన విధ్వంసకరమైన అధికారాన్ని చలాయిస్తున్న మొత్తం అధికార యంత్రాంగాన్ని ఒంటరి బాధితురాలు ఎదురించి నిలబడటం చాలా కష్టం కూడా.

1990లలో నాటి టెన్నిస్‌ సమాఖ్య అధ్యక్షుడు, హరియాణా పోలీస్‌ ఐజీ ఎస్‌పీఎస్‌ రాథోడ్‌కు  వ్యతిరేకంగా గళమెత్తిన టెన్నిస్‌ క్రీడాకారిణి రుచికా గిర్‌హోత్రాకు చెందిన ముఖ్యమైన ఉదంతాన్ని మననం చేసు కోవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగానూ, అనేక కుల ప్రాతిపదిక సంస్థలు ఆనాడు నిందితుడి పక్షానే నిలబడ్డాయి. ఆరోపణకు గురైన రాథోడ్‌ నిజానికి ప్రమోషన్‌ పొంది హరియాణా డీజీపీ అయ్యారు. తీవ్రమైన శత్రుపూరిత వాతావరణంలో రుచిక తన జీవి తాన్నే ముగించుకున్నారు. న్యాయం కోసం కుటుంబం సాగించిన పోరా టంలో ఆమె తండ్రి కూడా మరణించారు. ఆమె సోదరుడు జనం కంట పడకుండా ఎంతో దూరంలో జీవితం గడపాల్సి వచ్చింది. ఆమె సన్ని హిత మిత్రుడి కుటుంబం, ఇతర మహిళా సంస్థలు ఎంతో శ్రమ కోర్చి ఈ కేసును ప్రతి స్థాయిలోనూ ముందుకు తీసుకెళుతూ 19 ఏళ్ల పాటు పోరాడారు. అయినప్పటికీ నిందితుడైన రాథోడ్‌ ఆరునెలల జైలు శిక్షను, వెయ్యి రూపాయలు జరిమానాను మాత్రమే పొందాడు.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నాటి నుంచి నేటివరకు మన క్రీడాకారిణుల జీవితాల్లో పెద్దగా మార్పు లేదు. తన జీవితాన్ని ముగించుకోవాలనే నిస్పృహతో కూడిన ఆలోచనల గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన వినేశ్‌ ఫోగాట్‌ దీన వదనం చూసి దేశ ప్రజలు, ముఖ్యంగా క్రీడా సమాజం దిగ్భ్రాంతి చెంది ఉండాలి. ఈ రెండు కేసు ల్లోనూ ప్రసుతం అధికారంలో ఉన్న బీజేపీని, క్రీడాధికారులను తప్పక కఠిన ప్రశ్నలు వేసితీరాలి. క్రీడాకారిణులు పతకాలు తీసుక వస్తున్నప్పుడు వారు సాధించిన ఉజ్వల కీర్తిని తమ సొంతం చేసుకుని మురిసిపోవడంలో రాజకీయ నేతలు, క్రీడా సమాఖ్య అధిపతులు ముందు ఉంటున్నారు. కానీ మరోవైపున తమకు జరుగుతున్న అన్యా యానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి క్రీడాకారిణులు ప్రయత్నించిన ప్రతిసారీ ఏమాత్రం సిగ్గూ శరమూ లేకుండా నిందితులనే కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు సమాధానం చెప్పి తీరాలి.

క్రీడాకారిణులను వేధించిన కేసుల్లో అవసరమైన సమర్థ న్యాయ ప్రక్రియను తక్షణం ఏర్పర్చాల్సిన అవసరం ఉంది. అత్యున్నత స్థాయు ల్లోని క్రీడా విభాగాలు, సమాఖ్యలు, ప్రభుత్వ క్రీడా విభాగాలు అన్నింటిలో లైంగిక వేధింపులకు వ్యతిరేక కమిటీలను తప్పక ఏర్పర్చాలి. ఈ ప్రక్రియను అనుసరించనప్పుడు, సంబంధిత అధికారులనే జవాబుదారీగా చేయాలి. మైదానంలో అత్యున్నతంగా పోరాడుతూనే తమకు న్యాయం జరగాలని గట్టిగా పోరాడుతున్న మన క్రీడాకారిణులకు సంఘీ భావం పలకడం ఈ దేశంలో క్రీడలను ప్రేమించే ప్రతి ఒక్కరి బాధ్యత.


- జగ్మతి సాంగ్వాన్‌ 
వాలీబాల్‌ క్రీడాకారిణి, ‘ఐద్వా’ జాతీయ ఉపాధ్యక్షురాలు
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top