ఉప సంఘమైనా పరిష్కరిస్తుందా!

Dharani Portal Problems Guest Column By Sarampally Mallareddy - Sakshi

సందర్భం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు 94 శాతం పరిష్కరించినట్లు ప్రకటించింది. వాస్తవానికి రెవెన్యూ సమస్యల  పరిష్కారానికి వేల మంది రైతులు కోర్టుల చుట్టూ, తహసీల్‌ కార్యాలయాల చుట్టూ ప్రతి రోజు తిరుగుతూనే ఉన్నారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ కోర్టులలో ఉన్న 16,130 కేసులు ట్రిబ్యునల్స్‌ పరిష్కరిస్తాయని ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితం అయ్యింది. ఈ కేసులన్నీ తిరిగి సివిల్‌ కోర్టులకు వెళ్ళాయి. 6,18,360 సాదాబైనామాలు పరిష్కారానికి నోచుకోలేదు.

నిజాం కాలం నుండి తెలంగాణలో తెల్లకాగితాలపై క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. పాస్‌బుక్కులలో 2,65,653 తప్పిదాలు ఉన్నట్లు ప్రభుత్వమే చెప్పింది. పాసుబుక్కులో ‘చనిపోయిన వారిపేర్లు ఉండడం, ఆధార్‌ తప్పుగా నమోదు, ఫొటోలు తప్పుగా పెట్టడం, తండ్రి పేరు, పట్టాదార్‌ పేరు తప్పుగా రాయడం, భూ విస్తీర్ణం ఎక్కువ, తక్కువ రాయడం, సర్వే నెంబర్‌ తప్పుగా రాయడం, అసైన్డ్‌ భూములు మార్పు చేయడం, అటవీశాఖ వివాదాస్పద భూములు రాయడం, రెండు ఖాతాలు రాయడం’’ తదితర తప్పులు ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతున్నది. 

ఈ పొరపాట్లపై ప్రజలలో పెరిగిన అసంతృప్తిని గమనించి ఇంత కాలం తర్వాత ధరణి పోర్టల్‌పై సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఉప సంఘాన్ని వేశారు. టీ. హరీశ్‌రావు, వి. ప్రశాంత్‌ రెడ్డి, టి. శ్రీనివాస్‌ గౌడ్, జి. జగదీశ్వర్‌రెడ్డి, ఎస్‌. నిరంజన్‌ రెడ్డి, పి. సబితా ఇంద్రారెడ్డితో కూడిన ఈ కమిటీ సమస్యకు పరిష్కారం చూపుతుందా! తహసీల్దార్‌  మొదలు కలెక్టర్‌ వరకు రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి సుముఖతగా లేరు. ప్రభుత్వ విధానాలు అమ లుజరపటానికి చట్టాలు మార్చాలని సలహాలు ఇస్తున్నారు. పాసుబుక్కుల చట్టం 1971 సెక్షన్‌ 26ను పూర్తిగా రద్దు చేసి సవరణ పెట్టారు. ఆ సవరణ ప్రకారం సాగు కాలం తొలగిం చడంతో రెవెన్యూ రికార్డులలో భూములు అమ్ముకున్నవారే తిరిగి పట్టాదారులయ్యారు.

మ్యుటేషన్‌ జరగకపోవడంతో కొనుగోలు చేసిన వారు హక్కులు కోల్పోయారు. జాగీర్‌దారుల భూములు ప్రభుత్వాలకే చెందుతాయని సవరణ చట్టం చెప్పింది. వారసత్వ భూములు చార్జీలు చెల్లించి మ్యుటేషన్‌ చేయించుకోవాలని చట్టసవరణ చేశారు. తగాదా భూములను, కోర్టు కేసులలో ఉన్నవాటిని పార్ట్‌ బీలో చేర్చారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ‘నిషేధ పుస్తకం సెక్షన్‌ 22ఎ పేరుతో’ పెట్టారు. భూమిలో కొంత భాగం అమ్ముకోగా మిగిలిన భూమిని కూడా నిషేధ పుస్తకంలో పెట్టారు. పట్టా భూములను కూడా నిషేధ పుస్తకంలో పెట్టడం జరిగింది. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వలన తగాదా లేని భూములు కూడా నిషేధ పుస్తకం లోకి వెళ్లాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో భూములు సర్వే చేస్తానని ప్రకటించి ఇప్పటికి ఏడేళ్లు గడిచాయి. డిజిటల్‌ సర్వే చేస్తానని చెప్పారు. టోల్‌ నెంబర్‌ 1800 425 8838 కూడా ప్రకటించారు. ప్రభుత్వం గతంలో ఒకే రోజు సమగ్ర సర్వే చేసి రికార్డులు తయారుచేసింది. కానీ డిజిటల్‌ సర్వే పేర కాలయాపన చేస్తున్నది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిరంతరం సాగుతుంటాయి. కొనుగోళ్లకు అనుకూలంగా రెవెన్యూ చట్టాన్ని మార్చారే తప్ప భూయజమానుల ప్రయోజనాలను కాంక్షించి చట్టాల సవరణ జరగలేదు. ఒకేఒక్క చట్ట సవరణను (1971 పాసుపుస్తకాల చట్టం, సెక్షన్‌ 26) మాత్రమే మార్చారు.

అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన అర్హులు 2017 వరకు పట్టాలు మార్పిడి చేయించుకోవచ్చని ప్రభుత్వం చట్టసవరణ చేసింది. కానీ రాష్ట్రంలో  ఈ రోజుకు 2.80 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూమిని 82వేల మంది కొనుగోలు చేసినట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. కానీ కొనుగోలు చేసిన వారిలో అర్హులను గుర్తించి వారికి పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటి? అక్రమంగా కొనుగోలు చేసిన వారిని రక్షించడానికే ఈ జాప్యం.

లక్షలాది ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య తగాదాలలో ఉన్నాయి. షెడ్యూల్డ్‌ ప్రాంతాలలో  1963 డిసెంబర్‌ 1కి ముందు కొనుగోలు చేసిన గిరిజనేతరులకు భూమిపై హక్కు ఉంటుంది. కానీ  ఈ చట్టాన్ని కూడా అమలుచేయలేదు. 1967 అటవీ చట్టం ప్రకారం రెవెన్యూ భూమిని అడవి భూమిగా మార్చాలంటే  ఈ చట్టంలోని సెక్షన్‌ 4 నుండి సెక్షన్‌ 15 వరకు అమలుచేయాలి. అవేవీ లేకుండానే  అటవీ అధికారులు రైతులపై దాడులు చేస్తున్నారు. ఇది ధరణీ చట్టానికి అనుకూలం కాదు.

రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్చుతానని, రైతుల ప్రయోజనాలు, వారి హక్కులు కాపాడుతానని, చేసిన వాగ్దానం అమలుచేయలేదు. ప్రభుత్వ భూ సేకరణకు ధరణి ద్వారా భూములు సేకరించడం సుగమం చేసుకుంది. అలాగే ఇతర దేశాలలో, ఇతర ప్రాంతాలలో ఉన్నవారు భూములు కొనుగోలు చేయడానికి ఈ చట్ట సవరణ తోడ్పడుతున్నది. కానీ సాగు చేసుకుంటున్న భూ యజమానులకు మాత్రం ఈ చట్టం పనికి రావడం లేదు. అవినీతి అధికారులు మరో రూపంలో పట్టాదారులను, సాగుదారులను అనేక ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వేల కేసులు సివిల్‌ కోర్టుల నుండి హైకోర్టుల వరకు పెండింగ్‌లో కొనసాగుతున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెం బర్‌ నెలల్లో గ్రామ సర్వే చేసి రికార్డులను అప్‌డేట్‌ చేయాలి.

కానీ ధరణీలో సెక్షన్‌ 26 సవరణతో ఆ బాధ్యత నుండి ప్రభుత్వం, రెవెన్యూ శాఖ తప్పుకొని భూ యజమానిపై పెట్టారు. భూ యజమాని నిర్దిష్ట చార్జీలు చెల్లించి మార్చుకోవాలి.  ప్రభుత్వం ధరణి ద్వారా రిజిస్ట్రేషన్‌ చార్జీల ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప సమస్యల పరిష్కారానికి కాదన్నది అచరణలో రుజువైంది. ప్రభుత్వం వేసిన కమిటీ ఈ సమస్యలన్నింటిని చర్చించి పరిష్కారం చూపాలి. అందుకు అవసరమైన రెవెన్యూ చట్టాలను సవరించాలి. భూయాజమానుల అందోళలను తొలగించాలి. భూయజమాని భూమి అమ్ముకోవడంలోకానీ, అభివృద్ధి చేసుకోవడంలో కానీ గతంలో ఏ అటంకాలూ రాలేదు. అందువల్ల ధరణీ అమలులో వస్తున్న ఇబ్బందులను తొలగించే విధంగా కమిటీ దోహదపడుతుందని ఆశిద్దాం.

-సారంపల్లి మల్లారెడ్డి
వ్యాసకర్త ఆర్థిక, వ్యవసాయ రంగ నిపుణులు
మొబైల్‌: 94900 98666

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top