బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా?!

Abk Prasad Article On Recent Comments Made On India Parliment By Singpore Pm - Sakshi

రెండో మాట

ఇటీవల సింగపూర్‌ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ భారత్‌ ప్రస్తావన తేవడం మన దేశంలో రాజకీయ దుమారం రేపింది. ఉన్నత విలువలు, ఆదర్శాలతో నెహ్రూ రూపుదిద్దిన ఇండియాలో నేడు సగం మంది పార్లమెంటు సభ్యులు నేర చరిత్ర ఉన్నవారేనని లీ సీన్‌ అనడంపై భారత ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. గౌరవ పార్లమెంటేరియన్ల అవినీతి చర్యల గురించి ఒకటి కాదు, పదుల సంఖ్యలో సాధికారికమైన ఫిర్యాదుల్ని నమోదు చేసి, నివారణ చర్యల్ని నివేదికలు ప్రతిపాదించినా ఫలితం శూన్యం కావడం వల్లనే సింగపూర్‌ ప్రధాని తమ దేశస్థుల్ని హెచ్చరిస్తూ బహుశా ఆ ప్రకటన విడుదల చేయవలసి వచ్చి ఉంటుంది! ‘బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా’ అని వేమన అన్నట్లు.. సింగపూర్‌ ప్రధానిపై మనం ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు... ఆయన మాటలపై ఆలోచన సారించాలి.

‘‘భారత పార్లమెంటు సభ్యుల్లో సగం మంది నేర చరితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారని.. ఇండియా, ఇజ్రాయిల్‌లలో నేడు ఇదే పరిస్థితి కొనసాగుతోంద’’ని సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ తమ పార్లమెంటులో (15.2.2022) ప్రకటించారు. దేశ ప్రధాన ప్రతిపక్షమైన వర్కర్స్‌ పార్టీ ఉదాహరించిన వివరాల ఆధారంగా ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. అలాంటి దుఃస్థితి వైపు సింగపూర్‌ ప్రయాణించకుండా జాగ్రత్త పడవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తూ భారతదేశాన్ని ఉదాహరించారు. అందుకు భారత ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం తెల్పాయి.

మన ‘భాగోతం’ మనకు తెలుసు కాబట్టి, ‘ఉన్నమాటంటే ఉలుకెక్కువ’. అందుకే వేమన మహాకవి శతాబ్దాల క్రితమే ‘బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా’ అని హెచ్చరించాల్సి వచ్చింది! అందుకే మన దేశంలో ‘డబ్బున్న వాడి వీపు పుండైనా ప్రపంచానికి వార్తయిపోతుంది, పేదవాడింట్లో పెళ్లయినా లోకానికి తెలియదు’ అంటారు! ఇప్పుడీ నీతి పాఠం ఎకాఎకిన మన ఇంటి ఆవరణలోకే ప్రవేశించాల్సి వచ్చింది. ఏళ్లూ, పూళ్లూగా కరెక్షన్‌ దూరమై, కరప్షన్‌కు దగ్గరవుతూ వచ్చిన సగంమంది పార్లమెంటు సభ్యుల దుఃస్థితిని దఫదఫాలుగా ఎవరో సింగపూర్‌ ప్రధానమంత్రి వచ్చి చెప్పకుండానే పలు భారత సాధికార విచారణ సంస్థలు, సంఘాలు, పౌర సమాజాలు బహిర్గతం చేస్తున్నా, శరీరాలతోపాటు మనస్సులూ మొద్దుబారుతూ వస్తున్నాయి. అందుకే ‘బుద్ధి చెప్పేవాడు ఒక గుద్దు గుద్దినా’ లబోదిబోమన కూడదన్నాడు వేమన! 

నిలవని వాద ప్రతివాదాలు
ఇంతకూ ఈ ‘జబ్బు.. వ్యక్తి లోపం వల్ల వచ్చిందా, వ్యవస్థ లోపంవల్ల పుట్టుకొస్తుందా అంటే ‘చెట్టు ముందా, విత్తు ముందా’ అన్న వాదనలోని ఔన్నత్యం వైపు ‘మోరలు’ చాచవలసిందే! ఎందుకంటే తుమ్మ చెట్టుకు ముళ్లు మొక్కతోనే పుడతాయి. దానికి ఆ లక్షణం సహజం. అలాగే వ్యవస్థ, దానిని అనుసరించి వ్యక్తీ! అందుకే, దేశ అత్యున్నత శాసన వేదికగా, దేశానికి దిక్సూచీగా ఉండవలసిన భారత పార్లమెంటరీ వ్యవస్థ, దాని గౌరవ సభ్యులూ గాడి తప్పి వ్యవహరించడానికి అసలు కారణం... ‘భారత పౌరులమైన మేము, మేముగా రచించుకుని, రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నందున అందుకు అనుగుణంగానే’ లౌకిక సెక్యులర్‌ వ్యవస్థను రక్షించుకుని కాపాడుకునే బాధ్యత కూడా తమపైనే ఉందని ప్రకటించు కోవడమేనని రెండో మాటకు తావు లేకుండా స్పష్టం చేసుకున్నారు. అందువల్ల మరో ‘మడత పేచీ’కి ఇక్కడ ఆస్కారం లేదు! అయినా, నిరంతరంగా గౌరవ పార్లమెంటులలో సగం మందికి పైగా లౌకిక రాజ్యాంగ ఉల్లంఘనలకు, అవినీతికి పాల్పడుతూ ఉండటానికి కారణం వ్యవస్థలోని లొసుగులు, ‘రబ్బరులా’ సాగదీసే పార్ల మెంటేరియన్ల నిలవని వాద ప్రతివాదాలూ! కనుకనే బుద్ధి చెప్పేవాళ్లు ఎవరైనా నాలుగు గుద్దులు వేయడం, మనం భరించాల్సి రావటం సహజం! 

అనుమానాలకు తావిస్తున్నామా?
గౌరవ పార్లమెంటేరియన్ల అవినీతి చర్యల గురించి ఒకటి కాదు, పదుల సంఖ్యలో సాధికారికమైన ఫిర్యాదుల్ని నమోదు చేసి, నివారణ చర్యల్ని నివేదికలు ప్రతిపాదించినా ఫలితం శూన్యం కావడం వల్లనే సింగపూర్‌ ప్రధాని తమ దేశస్థుల్ని హెచ్చరిస్తూ బహుశా ఆ ప్రకటన విడుదల చేయవలసి వచ్చి ఉంటుంది! చివరికి మన ప్రవర్తన కూడా ఎలా తయారైందంటే.. ఇరుగు పొరుగు సఖ్యతను సదా కోరుకొంటూ ఆసియా దేశాల భద్రతకు అగ్రస్థానంలో ఉండి నాయకత్వం వహిం చాల్సిన మనం ఆ అవకాశాన్ని ఆసియావాసులు కాని వలస సామ్రాజ్య పాలకులైన ఆంగ్లో–అమెరికన్‌ల చొరవకు మరోసారి మనమే అవకాశం కల్పిస్తోంది. అదే మన ఇరుగుపొరుగు దేశాలలో అనేక అనుమానాలకు దారి తీస్తోందన్న గ్రహింపు మనకు తక్షణం అవసరం.

పైగా ఆంగ్లో–అమెరికన్‌ వలస సామ్రాజ్యవాద వ్యూహా లలో ఆసియా–ఆఫ్రికా ఖండ దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా బాహా టంగా ఇజ్రాయిల్‌తో ‘పెగసస్‌’ గూఢచర్యంలో పాలుపంచుకుని అభాసుపాలవుతున్న మన రక్షణ వ్యవస్థ ప్రయోజనాలనే మన గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నించి, ఊగించి శాసించవలసిన పరిస్థితి వచ్చింది. అలా చివరకు దేశ పరువు ప్రతిష్ఠలకు ఎంతటి హాని కల్గిందో ప్రశ్నించుకోవలసిన అగత్యంలో మనం ఉన్నాం! 

గుజరాత్‌ ఒక ఉదాహరణ
సుప్రీం విశిష్ట సలహాదారు రాజూ రామచంద్రన్‌ గుజరాత్‌ మైనారిటీ లపై సాగిన ఊచకోతలపై సుప్రీంకోర్టుకు సమర్పించిన సుదీర్ఘ సమగ్ర నివేదిక గతి ఏమైనట్టు? ఎందుకు ఇప్పటిదాకా దాని అతీగతీ తెలి యనివ్వకుండా ‘చెదలు’ పట్టించాల్సి వచ్చింది? ఆ నివేదిక పూర్తి పాఠాన్ని ప్రజలకు అందనివ్వకుండా చేసిందెవ్వరు? నాటి గుజ రాత్‌లో మైనారిటీలపై జరిగిన దుర్మార్గాలకు బాధ్యులైన పాలకుల్ని ప్రాసిక్యూట్‌ చేయాల్సిన అవసరాన్ని రామచంద్రన్‌ తన నివేదికలో సుప్రీంకోర్టుకు ఎందుకు సలహా ఇవ్వవలసి వచ్చింది? అంతటి తీవ్రమైన అభియోగాన్ని గుజరాత్‌ పాలకులపై మోపి శిక్షార్హులుగా ప్రకటించిన సుప్రీం సలహాదారు నివేదికను చివరికి ఎలా పాలకులు తొక్కిపట్టి ‘చెదలు’పట్టించారు? తుదకు నాటి బీజేపీ గుజరాత్‌ పాల కులకు అండగా భారత చట్టాలు అమలు జరగాల్సిన తీరుతెన్నుల్ని నిర్ధారించవలసింది, విచారించవలసింది లాయర్లు, సుప్రీం సలహా దారులూ కాదని, విచారణ అనేది పోలీసుల పనిగానీ, లాయర్ల పని కాదని అరుణ్‌ జైట్లీ లాంటి బీజేపీ నాయకుడు వాదించ సాహ సించారు! చివరికి జరిగిన పని – సుప్రీం విచారించకుండానే రామ చంద్రన్‌ నివేదికను పక్కన పెట్టించేయడం. ఈ భాగోతాన్ని క్షుణ్ణంగా ఆనాటి ‘ఇండియా’ పత్రికలో (2012 మే 7) రోహిత్‌ ఖాన్, వైద్య నాథన్‌ సమగ్రంగా ప్రచురించారు. 

ఆత్మవిమర్శనంటేనే ఏవగింపా!
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇజ్రాయిల్‌ మాజీ ప్రధాని బెన్‌ గురియన్‌ తమ దేశాలు స్వాతంత్య్రం పొందడానికి చేసిన కృషితో పోలిస్తే ఆ తరువాత దేశాధికారంలోకి వచ్చిన రాజకీయవేత్తల తరం... తరువాతి పాలకుల నైతిక విలువలు క్షీణదశకు దారి తీశాయని సింగపూర్‌ ప్రధాని వ్యాఖ్యానించడం మన నేటి పాలకుల అసమ్మతికి కారణం అయి ఉంటుంది, అది భారత రాజకీయాలలో ప్రత్యక్ష జోక్యంగా భావించడమూ సహజం. కానీ, ఆత్మవిమర్శన అనేది ఈ తరం భారత నాయకులలో కొందరికి ఏవగింపుగా మారి నందున, సవరణకు వారి మనస్సు ఇష్టపడదు. ఎందుకంటే తుమ్మ చెట్టుకు ముళ్లు మొక్కతోనే పుడతాయి, దానికి ఆ లక్షణం దాని వినాశంతోనే గానీ పోదట! ఎందుకంటే, కనీసం ఎద్దుకు ఏడాదిపాటు నేర్పితే మాట తెలిసి నడుచుకుంటుందటగానీ మూఢునికి ముప్పయ్యే ళ్లయినా, వాడి మూఢత్వం పోదట. కనుకనే ‘బుద్ధి చెప్పేవాడు ఓ గుద్దు గుద్దినా తప్పులేదన్న’ మాటను తన నాటి అనుభవాల్ని బట్టి వేమన ఖరారు చేసి ఉంటాడు! దేశ పౌరహక్కుల చట్టంపై పాలకులు ‘చురకత్తి’ పెట్టి బెదిరిస్తున్నప్పటినుంచీ వేమన్న గుర్తుకు రాని క్షణ మంటూ ఈ రోజు వరకూ లేదు సుమా!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top