నరకానికి ప్రవేశ ద్వారం.. 2200 సంవత్సరాలుగా!

Ancient Hellenistic Houses Discovered In Turkey Hierapolis - Sakshi

నరకానికి ప్రవేశద్వారం భూమ్మీదే ఉంది. గ్రీకు నగరం హీరాపోలిస్‌లో దాదాపు 2200 సంవత్సరాలుగా ఈ నరక ప్రవేశద్వారం చెక్కు చెదరకుండా ఉంది. అప్పట్లో ఈ నగరం రోమన్‌ సామ్రాజ్య పరిధిలో ఉండేది. ఫొటోల్లో ఒక కొలను, దానికి పక్కనే పొగలు చిమ్ముతూ ఒక గుహలాంటి మార్గం కనిపిస్తున్నాయి కదా, గుహలాంటి మార్గమే, నరకానికి ప్రవేశద్వారం. ఈ కొలను ఒక వేడినీటి బుగ్గ. హీరాపోలిస్‌ నగరంలో ఇలాంటి వేడినీటి బుగ్గలు చాలానే కనిపిస్తాయి.

ఈ నగరంలోని పురాతన కట్టడమైన ‘ప్లూటో’ ఆలయంలో ఉంది ఈ నరక ప్రవేశద్వారం. ఈ ద్వారం దాటుకుని లోపలకు అడుగుపెట్టాలనుకుంటే, ఎలాంటి జీవి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే! అందుకే దీనికి ‘గేట్‌వే టు హెల్‌’ (నరకానికి ప్రవేశద్వారం) అని పేరు వచ్చింది. రోమన్‌ సామ్రాజ్యకాలంలో అప్పటి పూజారులు ఈ ప్రవేశద్వారం ముందే ఎద్దులను బలి ఇచ్చేవారట. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్‌ డ్యూయిస్‌బర్గ్‌–ఎసెన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నాలుగేళ్ల కిందట ఈ కట్టడంపై పరిశోధనలు జరిపారు. ఈ నరక ప్రవేశద్వారానికి చేరువగా ఎగిరే పక్షులు ఇక్కడకు వచ్చే సరికి కుప్పకూలి, చనిపోతుండటాన్ని వారు గమనించారు.

ఈ గుహ అడుగు భాగాన అగ్నిపర్వతం ఉండవచ్చని, దాని నుంచి నిరంతరం వెలువడే విషవాయువుల కారణంగానే, దీనికి చేరువగా వచ్చే జీవులు ప్రాణాలు కోల్పోతుండవచ్చని డ్యూయిస్‌బర్గ్‌–ఎసెన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ గుహ ద్వారం నుంచి వెలువడే వాయువుల్లో 91 శాతం కార్బన్‌ డయాక్సైడ్‌ ఉన్నట్లుగా నిర్ధారించారు. గుహ లోపలి రసాయనిక వాయువుల ఫలితంగానే, ఇక్కడి కొలనులోని నీటి మట్టం ఇక్కడి వేదిక మట్టాని కంటే దాదాపు 16 అంగుళాలు ఎత్తుగా ఉన్నట్లు తేల్చారు. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top