చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్‌ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ.. | Sakshi
Sakshi News home page

చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్‌ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ..

Published Wed, Aug 3 2022 1:07 AM

World Space Week: Kaivalya Top place In Space Quiz, Career, Science Fair - Sakshi

అమ్మా! నక్షత్రాలు పగలంతా ఎక్కడికి వెళ్తాయి?
నాన్నా! చందమామ రోజుకోరకంగా ఉంటాడెందుకు?
తాతయ్యా! చందమామ దగ్గరకు ఏ విమానంలో వెళ్లాలి?
రాకెట్‌లో వెళ్తే నిజంగా... చందమామను తాకవచ్చా!
బాల్యానికి ఇలాంటి సందేహాలెన్నో!
నేను రాకెట్‌లో చందమామ దగ్గరకు వెళ్తా. ఇలాంటి తీర్మానాలు మరెన్నో!!
ఆ తీర్మానాన్ని నిజం చేస్తానంటోంది కైవల్య. ఆ బాటలో ఇప్పటికే కొన్ని అడుగులు వేసింది.
ఇస్రో స్పేస్‌ క్విజ్‌లో విజేతగా నిలిచింది.  అంతరిక్షాన్ని ఔపోశన పడుతోంది ఈ చుక్కల్లో చంద్రిక.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో ఓ పట్టణం నిడదవోలు. ఆ పట్టణంలో పదో తరగతి విద్యార్థిని కైవల్య. వరల్డ్‌ స్పేస్‌ వీక్‌ సందర్భంగా ఇస్రో గత ఏడాది తణుకు పట్టణంలో నిర్వహించిన స్పేస్‌ క్విజ్, వృక్తృత్వం, సైన్స్‌ ఫేర్‌లలో పాల్గొన్నది. ఆశ్చర్యంగా మూడింటిలోనూ ప్రథమ స్థానమే. ఈ ఏడాది ఇస్రో –నాసాలకు అనుబంధంగా ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న స్పేస్‌ పోర్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆస్టరాయిడ్‌ డే (జూన్‌ 30) సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రతినిధిగా హాజరైంది.

అనేక విభాగాల పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచింది. వచ్చే ఏడాది జరిగే నాసా ఒలింపియాడ్‌ పరీక్షలకు అర్హత సాధించింది. ఆస్టరాయిడ్‌ను గుర్తించి ‘స్పేస్‌ పోర్ట్‌ ఇండియా ఫౌండేషన్‌’ అంబాసిడర్స్‌ బృందంలో సభ్యత్వాన్ని సాధించింది. తనకు అంతరిక్షం పట్ల ఆసక్తి రేకెత్తడం, అమ్మానాన్నలు తనకు అవసరమైన వనరులను సమకూర్చడం గురించిన అనుభవాలను సాక్షితో పంచుకుంది కైవల్య.  
 
‘‘మా నాన్న శ్రీనివాసరెడ్డి, అమ్మ విజయలక్ష్మి. నాన్న పంచాయితీ ఈవో. అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ నడుపుతోంది. అమ్మకు సామాజిక దృక్పథం ఎక్కువ. దాంతో చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకంగా పెంచిందనే చెప్పాలి. థర్డ్‌ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు తొలిసారిగా ఆస్ట్రానమీ గురించి ఆసక్తి కలిగింది. నా ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉండేది అమ్మ. ఖగోళశాస్త్రం మీద నా ఆసక్తి గమనించిన అమ్మ నా కోసం ఎన్‌సైక్లోపీడియా బుక్స్‌ తెచ్చింది. ఫోర్త్‌ క్లాస్‌ హాలిడేస్‌లో వాటిని చదివాను.

ఫిఫ్త్‌ క్లాస్‌ నుంచి ఈ రంగం మీద బాగా ఫోకస్‌ పెట్టాను. జనరల్‌ నాలెడ్జ్‌ బుక్స్‌ ఆరు పుస్తకాలు కంఠతా పట్టినట్లు స్టడీ చేశాను. ఆ బుక్స్‌లో చాలా రకాల టాపిక్స్‌ ఉంటాయి. కానీ ఆస్ట్రానమీ సబ్జెక్ట్‌ నన్ను కట్టిపడేసేది. చదివేకొద్దీ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు ఎంతోమంది ఖగోళాన్ని అధ్యయనం చేశారు. విశ్వంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. వాళ్లు తెలుసుకున్న విషయాలన్నింటినీ పుస్తకాల్లో రాశారు. వేలాది పేజీల్లో ఉన్న సమాచారం అంతా కూడా విశ్వంలో మనం తెలుసుకోవలసిన విషయాల్లో ఒక్క శాతం ఉంటుందేమో!  
 
పోటీలే పాఠాలు!
మనకు మనంగా చదువుతూ ఉంటే మనకు అంతా తెలిసిపోయిందనుకుంటాం. పోటీల్లో పాల్గొంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఈ రంగంలో ఇంకా ఏయే పుస్తకాలున్నాయో తెలుస్తుంది. ఎన్ని వెబ్‌సైట్‌లలో ఈ సమాచారం లభిస్తుందో తెలుస్తుంది. ఇందుకోసమే రూపొందిన సాఫ్ట్‌వేర్‌లు తెలుస్తాయి. నేను ఇప్పటివరకు 30కి పైగా కాంపిటీషన్‌లలో పాల్గొన్నాను. నా కెరీర్‌ కూడా ఇందులోనే అని నిర్ణయించేసుకున్నాను కూడా. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని ఆ తర్వాత గ్రాడ్యుయేషన్‌ ఖగోళశాస్త్రంలోనే చేయాలనుకుంటున్నాను. ఐఐటీ ఖరగ్‌పూర్, ఎమ్‌ఐటీ చెన్నై, బెంగుళూరు– స్పేస్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి వాటిల్లో సీటు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం.

డాన్స్‌కు ఇక దూరమే!
నాకు పెయింటింగ్, పియానో ప్లే చేయడంతోపాటు కరాటే, క్లాసికల్‌ డాన్స్‌ కూడా ఇష్టం. స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి డాన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం కుదరదు. మిగిలినవన్నీ కంటిన్యూ చేస్తాను. స్పేస్‌ పోర్ట్‌ ఫౌండేషన్‌ అంబాసిడర్‌ టీమ్‌లో మెంబర్‌గా స్కూళ్లకు వెళ్లి అవగాహన తరగతుల్లో స్పేస్‌ గురించి వివరిస్తున్నాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే. ‘మనం అమ్మాయిలం కదా, ఈ ఫీల్డ్‌ ఎలా’ అనే సందేహాలు వద్దు. ఆసక్తి ముఖ్యం. సాధించాలనే కోరిక, చేయగలమనే నమ్మకం ఉంటే మనం చేసి తీరుతాం. అయితే ఇలాంటి రంగంలో ఎదగాలంటే పేరెంట్స్, టీచర్స్‌ సహకారం చాలా ఉండాలి. మా పేరెంట్స్‌కి, టీచర్స్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని చెప్పింది కైవల్య.

అంతరిక్ష అధ్యయనం: కుంచాల కైవల్యారెడ్డి, నిడదవోలు
ఆస్టరాయిడ్‌ డిస్కవరీలో ఒక ఆస్టరాయిడ్‌ని గుర్తించాను. అంతరిక్షాన్ని పాన్‌స్టర్‌ టెలిస్కోప్‌తో పరిశీలిస్తూ, మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఫొటోలను పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. ఆ ఫొటోలను స్టడీ చేసి కదలికలను గుర్తించడమే ఈ డిస్కవరీ. జర్మనీ– కెనడాల్లోని అంతరిక్ష పరిశోధక సంస్థలు నిర్వహించాయి. నేను ఒక ఆస్టరాయిడ్‌ను గుర్తించాను. గుర్తించిన వెంటనే ‘ఎస్‌ఐఎఫ్‌ జీరో వన్‌ వన్‌...’ ఇలా ఒక టెంపరరీ నేమ్‌ ఇస్తాం.

ఇలాంటి డిస్కవరీలన్నింటినీ క్రోడీకరించేటప్పుడు సీనియర్‌ సైంటిస్టులు ఒక పేరును ఖరారు చేస్తారు. ఆ ఆస్టరాయిడ్‌ను గుర్తించిన వారిలో నా పేరు రికార్డ్స్‌లో ఎప్పటికీ ఉంటుంది. జూలై 25వ తేదీన వరŠుచ్యవల్‌ మీటింగ్‌లో సర్టిఫికేట్‌ ప్రదానం చేశారు. ఆ కాంపిటీషన్‌లో ఎనభైకి పైగా దేశాల నుంచి పార్టిసిపేషన్‌ ఉంది. వారిలో యూఎస్, యూకేలకు చెందిన కొందరు టీచర్స్‌తో టచ్‌లో ఉన్నాను. వారితో సంభాషణ నాలెడ్జ్‌ షేరింగ్‌కి బాగా ఉపయోగపడుతోంది.
– గాడి శేఖర్‌బాబు, సాక్షి, నిడదవోలు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement