ఈ వారం కథ: రచయిత వీలునామా! | This week's story | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: రచయిత వీలునామా!

Jul 13 2025 7:35 AM | Updated on Jul 13 2025 7:40 AM

This week's story

కొన్ని మరణాలు భరించలేని దుఃఖాన్ని మోస్తాయి. మరికొన్ని పూరించలేని లోటుని మిగులుస్తాయి.ఇంకొన్ని మరణాలు బతికిస్తాయి. బతుకునిస్తాయి. ‘‘నాపేరు యామిని.. సార్‌కి అసిస్టెంట్‌ని..’’ ఎదురుగా కూర్చొంటూ అందామె. ఆమె తెచ్చిన కాఫీ– టీపాయ్‌ మీద పొగలు కక్కుతోంది.‘‘ కాఫీ తీసుకోండి..’’ నవ్వుతూ అంది. మేకప్‌ మాత్రమే కాదు, శారీరక భాష కూడా ఆమె నడివయసు స్త్రీ అని చెప్పకనే చెబుతోంది. ఖరీదైన ఫర్నిచర్, అధునాతన డిజైనింగ్‌తో వెయిటింగ్‌ రూమ్‌ అదిరిపోతోంది.

రచయితగా కళాధర్‌ సంపాదన బాగానే ఉన్నట్టుంది. చూపు సారించినంత మేర ఇల్లంతా రిచ్‌గా కనిపిస్తోంది.ఎదురుగా విశాలంగా ఉన్న షెల్ఫ్‌లో వందలాదిగా ఎన్నో పుస్తకాలు. సాహితీ టీవీ సినీ దిగ్గజాలతో దిగిన ఫొటోలు, అవార్డుల మెమెంటోలు, సన్మానపత్రాల ఫొటోషీల్డులు ఎన్నో వరుసగా కొలువుదీరి ఉన్నాయి. కాఫీ తాగడం పూర్తిచేసి కప్పు కింద పెట్టాను.‘‘సారీ సర్‌.. లేటయ్యింది’’ వస్తూనే కళాధర్‌ పలకరిస్తూ, ప్రేమగా నన్ను హత్తుకున్నాడు. కుశలప్రశ్నల వర్షం కురిపించేడు. తడిసి ముద్దవుతూనే అన్నిటికీ జవాబిచ్చాను.‘‘సినిమా ఫీల్డ్‌కు వచ్చి ఎన్నాళ్లైంది సర్‌ ?’’ అడిగాను కుతూహలంగా.

‘‘ముప్ఫైయేళ్లు దాటింది. అంతకుముందు మా ఊళ్లో ఉండేటప్పుడు నేనూ, మీబావగారు కలిసి తిరిగేవాళ్ళం. కథలు రాసేవాళ్ళం. నాటకాలు వేసేవాళ్ళం. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చేశాను. పొట్టకూటి కోసం’’...‘‘ఇక్కడెలా అవకాశాలు వచ్చేయి?’’‘‘మొదట్లో పత్రికలకు సీరియళ్లు, కథలూ రాసేవాణ్ణి. మెల్లగా సినిమావాళ్లతో పరిచయాలు చేసుకున్నాను. ఎన్నో సినిమాలకు కథలు అందించాను. కొంతమందికి ఘోస్ట్‌ రైటర్‌ గా పనిచేశాను.’’‘‘రచయితగా మీరు సాధించిందేంటి..?’’‘‘నాలుగు రాళ్లు వెనకేసుకోవడం... అంతకు మించి ఏం లేదు. నీతులూ సూక్తులూ చైతన్యాలూ మన వల్ల కాదు. బతుకు దెరువు కోసం నా రచనల్ని అమ్ముకుంటున్నాను. ఒకప్పుడు సినిమాలకు, ఇప్పుడు టీవీ సీరియళ్లకు...’’ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడతను. ఎంతో ముచ్చటేసింది.

‘‘ఆల్‌ ది బెస్ట్‌ సర్‌. ఇక నేనొచ్చిన పని మీకు తెలుసు కదా?’’‘‘తెలుసు సర్‌. శేఖరం రాత్రే ఫోన్‌ చేశాడు. నా మిత్రునికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్‌ వచ్చిందంటే నాకు మాత్రం ఆనందం కాదా! తప్పకుండా వస్తాను. ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చూస్తాను. సరేనా..?’’ఇచ్చిన ఆహ్వాన పత్రికను తనఫైల్‌లో భద్రంగా దాచుకున్నాడతను. లంచ్‌ కానిచ్చి తిరుగు ప్రయాణానికి తయారయ్యాను. ఇద్దరూ స్టేషన్‌కు కార్లో దిగబెట్టారు. అతను నా పక్క బ్యాక్‌ సీట్లో కూర్చుంటే, కారు డ్రైవింగ్‌ చేసింది యామిని. స్టేషన్‌ చేరుకునే సరికి ప్లాట్‌ఫామ్‌పై ట్రైన్‌ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తోంది.‘‘చివరగా ఒకే ఒక్క ప్రశ్న... అడగొచ్చా?’’ బెర్త్‌పై కూర్చొంటూ అడిగాను.‘‘అడగండి.. పర్వాలేదు’’‘‘మీరెందుకు పెళ్లి చేసుకోలేదు?’’‘‘సరైన అమ్మాయి దొరక్క...’’ బిగ్గరగా నవ్వేడతను. యామిని కిసుక్కున నవ్వింది.

అతని విచిత్ర సమాధానానికి నేనేమీ ఫీలవ్వలేదు. పైగా అతని వ్యక్తిగత జీవితంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఆరా తీయాలనిపించింది. ఇంటికొచ్చాక బావగారిని అడిగాను. అతను కూడా వెంటనే చెప్పడానికి ఇష్టపడలేదు. గట్టిగా పట్టుబడితేనే తప్ప.
‘‘నాకు తెలిసినప్పటి నుంచి వాడిదో పెక్యూలియర్‌ మెంటాలిటీ. బాగా డబ్బు సంపాదించాలని, దర్జాగా బతకాలని కలలు కనేవాడు. ఇంటర్‌ నుంచి మా ఇద్దరికీ పరిచయం. సైకిల్‌పై కాలేజీకి వచ్చేవాడు. ఒంటరిగా ఏదో రాసుకుంటూనో, ఎక్కడో చదువుకుంటూనో కనిపించేవాడు. కాలేజీ మ్యాగజైన్‌లో మా ఇద్దరి కవితలు పడ్డాక మరింత సన్నిహితమయ్యాము. పుస్తకాల గురించి, సినిమాల గురించి చర్చించేవాళ్ళం. 

డిగ్రీ పూర్తయ్యాక ఇద్దరమూ కలిసి మా పేర్లలోని సగాలతో కలిపి ‘చంద్రకళ’ అనే పేరుతో కథలు రాసేవాళ్ళం. తొంబైల్లో జంటరచయితలుగా మాకో ప్రత్యేక గుర్తింపు కూడా ఉండేది. మా కుటుంబానికి కూడా బాగా దగ్గరయ్యాడు. అలాంటి వాడు ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో తెలీదు. వాడి సొంతవూరు వెళ్లి విచారిస్తే, కొన్ని చేదు నిజాలు తెలిశాయి. వాడి కన్నతల్లి చిన్నతనంలోనే చనిపోయిందని కొందరు, కాదు... లేచిపోయిందని మరికొందరు... సవతితల్లితో చాలా బాధలు పడ్డాడని మరికొందరు... చాలా బాధనిపించాయి.. ఐదేళ్ల తర్వాత వాడి నుంచి ఉత్తరం వచ్చింది హైదరాబాదులో క్షేమంగా వున్నానని, ఓ పత్రికాఫీసులో పనిచేస్తున్నానని... చదివి సంతోషమనిపించింది.

 ఆ తర్వాత శిక్షణ పూర్తయి నేను టీచర్‌ గా స్థిరపడ్డాను. నాపెళ్ళికీ, చెల్లి పెళ్ళికీ పిలిచాను. ఆనందంగా పాల్గొన్నాడు. ఇప్పుడు నువ్వడిగిన ప్రశ్ననే చాలాసార్లు వాడిని అడిగాను. పెళ్లి నా ఒంటికి పడదని నవ్వుతూ సమాధానం దాటవేసేవాడు. వాడిపై బోలెడు పుకార్లు... నేనవేవీ పట్టించుకోవడం మానేశాను. ఎవరెవరితోనో తిరిగి, ప్రస్తుతం ఎవరో ఒకామెతో సహజీవనం చేస్తున్నాడని విన్నాను. ఇన్ని అవలక్షణాలు ఉన్నా, మనిషిగా మాత్రం మంచివాడు. సవతితల్లి కూతురి పెళ్లిని తనే ఘనంగా చేశాడు. మా నాన్నగారి గుండె చికిత్సకు అయిన ఖర్చునంతా తనే పెట్టాడు. డబ్బు తిరిగి చెల్లించబోతే ఎంతమాత్రం ఒప్పుకోలేదు.

 సినీ రచయితగా వాడి రచనల్లోని విలువలూ, ఆలోచనా దృక్పథమూ నాకు నచ్చవు. అయినాసరే, అవెప్పుడూ మా స్నేహానికి అడ్డు రాలేదు’’ ముగించారు బావగారు. అతనేంటో మరింత అర్థమవడం ఆరంభమైంది.‘‘సభకు నమస్కారం... నా పేరు కళాధర్‌. నేనొక టీవీ, సినీ రచయితనని మీ అందరికీ తెలిసే ఉంటుంది. తన ‘అగ్నిశిఖ’ కథాసంపుటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న నా మిత్రుడు చంద్రశేఖరానికి ముందుగా అభినందనలు. మేమిద్దరం ప్రాణస్నేహితులమని చెప్పడం కంటే శేఖరం స్నేహితుడినని చెప్పుకోవడమే నాకు గర్వకారణం. శేఖరం ఒకగొప్ప రచయిత. అంతకు మించి స్నేహశీలి. 

స్వతహాగా నేను బిడియస్తుణ్ణి. ఎవరితోనూ కలిసేవాడిని కాదు. ఒంటరి నా ఆలోచనలను సరిచేసి, కుటుంబ ఆప్యాయతలను, అనుబంధాలను అందించిన ఆత్మీయవ్యక్తి శేఖరం. రచయితగా రచనల్లోని మెలకువలు నేర్పిన మార్గదర్శి. ఈరోజు నేనిలా నిలబడ్డానికి కారణం వాడిచ్చిన ప్రోత్సాహమే! అందించిన స్నేహహస్తమే! రచన చేయడం గొప్ప కాదు, ఒక సామాజిక బాధ్యతతో, సైద్ధాంతిక నిబద్ధతతో ఒక కొత్త తరాన్ని తయారు చేసి నడిపించగలగడం మహత్కార్యం, సాహిత్యసేవ. దాన్ని శేఖరం మాత్రమే చేతల్లో చూపించాడు. నిజంగా వాడొక అగ్నిశిఖ. వాడి రచనల్ని తడిమి చూసేంత సత్తా ఏ విమర్శకుడికీ లేదు. వాడి రచనలు కళ్ళు చెమర్చే జీవితపు విలువలు, స్ఫూర్తినిచ్ఛే మానవీయ స్పందనలు.

 డబ్బు కోసమో, పేరు కోసమో, కాలక్షేపం కోసమో రాయడు. అందుకే వాడి రచనలంటే గౌరవం. వాడంటే భయం. ఇది మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. చివరగా శేఖరానికి ఇలాంటి అవార్డులెన్నో రావాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటూ, సెలవు తీసుకుంటున్నాను’’కళాధర్‌ ప్రసంగం ముగిసింది. ఆడిటోరియం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. బావగారిని గట్టిగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడతను.ఆ తర్వాత వక్తలెందరో ప్రసంగించారు. రాష్ట్ర మంత్రివర్యుల చేతుల మీదుగా బావగారికి ఘనసత్కారం జరిగింది. అభిమానులు, మిత్రులు పోటాపోటీగా శాలువాలు కప్పేరు. పనిలో పనిగా కళాధర్‌ని కూడా సన్మానించారు. అన్నట్టుగానే నిర్వహణ అంతా తన భుజాలపైనే వేసుకుని, కళాధర్‌ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాడు.

ఆ రోజు నుంచి బావగారి కీర్తిప్రతిష్ఠలు అమాంతం పెరిగిపోయాయి. మిగిలిన ఎన్నో సంస్థల అవార్డులు, సత్కారాలు వరుసగా వరించాయి. సందర్శకుల తాకిడి ఎక్కువైపోయింది. పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిలాషులు. ఔత్సాహిక రచయితలు... ఎందరెందరో... ఎక్కడెక్కడి నుంచో... ఇంటికి వచ్చేవారు. విషయ సేకరణ చేయడమో, రచనా నైపుణ్యాల గురించి అడిగి తెలుసుకోవడమో చేసేవారు. చర్చలు, సమావేశాలు రోజురోజుకీ ముమ్మరమయ్యాయి. దూరాభార కార్యక్రమాలకు రాకపోకలు ఎక్కువయ్యాయి. వృద్ధాప్యంలో ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదనీ అక్కా... కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అవి ఆయన చెవికెక్కలేదు.

అలా ఒకరోజు ఎక్కడో సాహిత్య సమావేశం జరుగుతోంది. బావగారు ముఖ్యఅతిథి. ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. సభావేదికపైనే గుండెనొప్పంటూ కుప్పకూలిపోయారు. నిర్వాహకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. రెండు రోజుల చికిత్స అనంతరం బావగారి ప్రాణం పోయింది.సాహిత్య లోకానికే కాదు, మా కుటుంబాలకు కూడా పెద్ద దిక్కు లేకుండా పోయింది. కళాధర్‌ వేదన గట్టుతెగిన వాగైంది. అందరి హృదయాలూ దుఃఖంతో బరువెక్కాయి. సంతాపసందేశాలూ, చానళ్లలో స్క్రోలింగ్‌ వార్తలూ హోరెత్తాయి. ఆప్తులందరి సమక్షంలో బావగారి భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. దశదినకర్మలు పూర్తయ్యాయి. వేడుక ముగిసిన వేదికలా బావగారిల్లు మిగిలిపోయింది.

కొన్నేళ్ళకు మరో చేదు వార్త కమ్ముకుంది. కళాధర్‌ కూడా కాలధర్మం చేశాడనే వార్త! నిద్దట్లోనే గుండె ఆగిపోయిందట! హృదయం బాధా తప్తమైంది. మరు నిమిషం హైదరాబాద్‌ రాత్రి బస్సెక్కెశాను. నేను వెళ్లేసరికి శవాన్ని ఉంచేందుకు ఫ్రీజర్‌ను సిద్ధం చేస్తున్నారు. సినీ టీవీ రంగాల ప్రముఖులెందరో విచార వదనాలతో ఒక్కరొక్కరూ వస్తున్నారు. కొయ్యబారిన దుఃఖంలా యామిని ఉంది. కళాధర్‌ వ్యక్తిగత లాయర్‌ అప్పుడొచ్చాడు వీలునామా పట్టుకొని... చదివి వినిపించాడు. అంతా నివ్వెరపోయారు.హిందూ మతాచారాల పట్ల తనకు నమ్మకం లేదని, మరణానంతరం తన పార్థివదేహాన్ని ఏదైనా మెడికల్‌ కాలేజీకి అప్పగించాలని.., తను ఉంటున్న ఇల్లు, బ్యాంక్‌ అకౌంట్‌లో నగదు మొత్తం యామినికి చెందుతుందని.. మిగిలిన యావదాస్తి సమంగా నగరంలోని అన్ని అనాథ శరణాలయాలకు చెందుతుందని దాని సారాంశం.కళాధర్‌ గొప్ప మనసును అక్కడ చేరిన గొంతులు వేనోళ్ళ పొగిడాయి. జోహారు నినాదాలు పెద్ద ఎత్తున చేశాయి. ఈ వార్త క్రమేపి వార్తా చానళ్ల వరకూ పాకింది.

‘గొప్ప మానవతావాది.. సినీ రచయిత కళాధర్‌కు జోహార్‌’ అంటూ ఒక రోజంతా లైవ్‌ కవరేజీ ప్రసారం చేశారు. ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర మంత్రివర్యులు కూడా హాజరై నివాళులర్పించారు. భౌతిక దేహాన్ని అంతిమ దర్శనం చేసుకుని, యామిని దగ్గరికి వచ్చాను. నిస్తేజంగా చూసిందామె.‘‘బాధపడకండి... అంతా మంచే జరుగుతుంది...’’ అన్నాను.‘‘పర్వాలేదు సర్‌... విల్లు వివరాలన్నీ తెలుసు... ఆయన ఆకాంక్షలను గౌరవిస్తాను’’ అందామె క్లుప్తంగా...ప్రతిఏటా మిత్రులిద్దరి వర్ధంతులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. సాహిత్య మార్గదర్శిగా అతని అనుచరులు చంద్రశేఖర్ని స్మరిస్తూ, అతని సాహిత్యాన్ని సమగ్రంగా చర్చించుకుంటూ ఎక్కడో ఒకచోట... అయితే తండ్రిలా తమని పోషిస్తూ, విద్యాబుద్ధులు చెప్పిస్తున్న కళాధర్‌ను దేవుడిలా కొలుస్తూ, ధ్యానమందిరాల్లో పూజలు చేస్తూ ఎందరో అభాగ్యులు అనాథ శరణాలయాల్లో మరో చోట...
∙పాలకొల్లు రామలింగస్వామి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement