ఈ వారం కథ: నీడకు పట్టిన చీడ | This week's story | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: నీడకు పట్టిన చీడ

Jul 6 2025 10:12 AM | Updated on Jul 6 2025 10:12 AM

This week's story

ముంబై–బెంగళూరు నేషనల్‌ హైవేలో ఓ కారులో వేగాన్ని సూచించే ముల్లు నూటయాభై కిలోమీటర్లకు అటూ ఇటూగా ఊగిసలాడుతున్నది. డ్రైవరు మినహా కారులోని మిగతా అందరూ కడుపులోని సల్ల కదలకుండా జోగుతున్నారు. ప్రయాణం మొదలైన మూడుగంటల తర్వాత రోడ్డు పక్క చెట్లు అడ్డొచ్చినప్పుడల్లా ఉదయపు సూర్యుడి వెలుగు కారు లోపలికి పడీపడక దోబూచులాడుతున్నది. ఎప్పుడు మేలుకున్నాడో వెనకున్న కొడుకు ‘‘ఏంటి నాన్నా, చెట్లన్నీ వెనక్కి పోతున్నాయి’’ అంటూ ఊహించని ప్రశ్న వేశాడు. డ్రైవరు పక్కన కూర్చున్న నేను మెలకువగా ఉన్నా, ఏడేండ్లు కూడా నిండని వాడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. 

పక్కనే కూర్చున్న వాళ్ళమ్మ కూడా మౌనాన్నే ఆశ్రయించింది. నేను పుట్టిన ఊరు పుట్టపర్తి చేరేవరకు కొడుకు ప్రశ్న తిరగదోడుతూనే ఉన్నాడు. ముంబై నుంచి ఎప్పుడు ఊరొచ్చినా విమానంలోనే వచ్చి వెళ్ళే వాళ్ళం. అందుకే మా కొడుక్కు రైలు ప్రయాణానుభవం లేదు. వాడి స్కూలు కూడా ఇంటికి అందుబాటులో ఉండడంతో బస్సు ప్రయాణం కూడా అందనిదే! అందుకే చెట్లెందుకు వెనక్కి పోతున్నాయో అనే ప్రశ్న వాడి బుర్రలోకి వచ్చిందనుకుంటా.నేనిప్పుడు ముంబైలోని హోమీబాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్లో సీనియర్‌ సైంటిస్టుగా ఉద్యోగం చేస్తున్నానంటే మా గురువు రాఘవేంద్రరావు సారు పుణ్యమే! నేనెప్పుడు మా ఊరు పుట్టపర్తి వచ్చినా,హైస్కూల్లో నాకు భౌతికశాస్త్రం పాఠం చెప్పిన ఆ సారు ‘దర్శనం’ చేసుకోకుండా వెళ్ళిన సందర్భమే లేదు. 

దర్శనం అని ఎందుకన్నానంటే ఆయన నాకు కేవలం గురువే కాదు దైవం కూడా!చాలాసార్లు నా భార్య ‘‘ఎందుకు ఆ సారు అంటే అంత ఇష్టం? ఆ ఒక్క సారు పాఠం చెబితేనే నువ్వు ఇంతటి సైంటిస్టయ్యావా? ఎప్పుడో పదో తరగతిలో పాఠాలు చెప్పిన సారును గుర్తు పెట్టుకుని వాళ్ళింటికి వెళ్తావు, పాద నమస్కారం చేస్తావు, ఆయన ఎంత వారిస్తున్నా బట్టలు కొనిస్తావు. అయినా ఆ తర్వాత నీ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ గురువులకు ఎందుకు ఇంతటి గౌరవం ఇవ్వవు? ఆ సారు మాత్రమే ఎలా ముఖ్యుడయ్యాడు?’’ అంటూ ప్రశ్నించేది. నేను నవ్వేసేవాడిని. కార్లో ‘‘ఇప్పుడు ఖాళీగా ఉన్నావుగా ఆ సారు గురించి చెప్పవూ’’ అంటూ నా కూతురు స్వర్ణమ్మ గోల మొదలెట్టింది. భార్య, కొడుకు కూడా చెప్పాల్సిందే అన్నారు.

‘‘ఆరున్నొక్కటి ఎనిమిది/సారంబుగ నేడు నైదు సద్గుణ మూడున్‌/ ధీరత రెండును తొమ్మిది/శ్రీరాముని కిత్తు నాల్గు సీతాఫలముల్‌’’–
‘‘ఈ పద్యంలో దాగిన విషయం చెప్పిన వారికి సోమవారం బహుమతి లభిస్తుంది’’ మా పాఠశాలకు బదిలీ మీద వచ్చిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు సాయంత్రపు గంట మోగగానే, ఈ పద్యం బోర్డుపై రాసి, మేమంతా పద్యం నోటుపుస్తకంలో రాసుకున్న తర్వాతనే తాను తరగతి గది నుంచి బయటకు వెళుతూ పైమాట చెప్పాడు. అసలే చివరి పీరియడ్, ఆపై శనివారం. ఒక్కరోజు సెలవు కోసం ఆరురోజులుగా వేచి చూస్తున్న వాళ్ళం. పద్యం బుర్రలకెక్కలేదు. పైగా ‘‘సెలవురోజు కొత్తయివారితో ఇదెక్కడి గొడవ’’ ఒకరికొకరు అనుకున్నాం.

సోమవారం పాఠశాలకు వెళ్ళాం. మొదటి పీరియడ్‌ భౌతికశాస్త్రం సారొచ్చారు. అటెండ¯Œ ్స తీసుకోగానే పాఠం మొదలెట్టారు. క్లాస్‌ ముగుస్తుందనగా, ‘‘మొన్న బోర్డుపై రాసిన పద్యంలో దాగిన విషయం ఎంతమంది తెలుసుకున్నారో చేతులెత్తండి’’ అన్నారు.
ఒక్కరూ సారు వైపు చూడలేదు. ఒకరిద్దరు సారు వైపు చూసినా తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. చేతులెత్తలేదు. ‘‘బహుమతి నాకే మిగిలింది’’ అన్నాడు సార్‌.‘‘నిన్నటి పద్యంలో విషయం ఇది’’ అన్నాడు. అందరమూ బోర్డు వైపు చూశాం.బోర్డుపై అటు మూడు, ఇటు మూడు గడులు వేసి పద్యంలో అంకెలు ఒకో గదిలో ఒకటి వేశాడు. 

పైనుంచి కిందకి, కింది నుంచి పైకి, మూలలకి కూడమన్నాడు. ఎటు చూసినా పదిహేనే వచ్చింది. పిల్లలందరమూ ‘భలే’ అన్నట్టు చూశాం. ఈయప్ప భౌతికశాస్త్రం పాఠం చెప్పకుండా తెలుగు, లెక్కలు చెబుతున్నాడేమిటా అనుకున్నాం.బయటకు వెళుతూ పిల్లల భుజాలపై చేతులు వేసి ‘‘పద్యంలో దాగున్న విషయం ఎందుకు కనుక్కోలేదు’’ అన్నారు సారు. ‘‘మేం పద్యం కంఠస్థం చేసుకొస్తిమి సార్‌’’ అంటూ క్లాసులో అందరమూ ఆయన్ను కూడా తోసుకుంటూ తరగతి బయటపడ్డాం.‘‘నేను అడిగింది మీకు అర్థం కాలేదేమోలే’’ మనసులో అనుకున్నట్లు పైకే అనేశాడు సార్‌.మరుసటి శనివారం పీరియడ్‌ ముగింపు సమయంలో మరో పద్యం బోర్డుపై వ్రాశాడు.‘‘అన్నాతి గూడ హరుడవు/ అన్నాతిని గూడకున్న అసుర గురుడవు/ అన్నా తిరుమలరాయా!/ కన్నొక్కటి లేదు గాని కంతుడ గావే’’పిల్లల వైపు తిరిగి ‘‘ఈ పద్యంలోని విషయం చెప్పాలి. 

బహుమతి విషయం మరచిపోవద్దు’’ అన్నాడు.మరుసటి సోమవారం తిరిగి అదే పరిస్థితి. పద్యం అందరమూ కంఠస్థం చేసుకుపోయిన సంగతి చెప్పాం. సార్‌ మొహంలో చికాకు కనిపించింది. ‘‘తిరుమలరాయడనే తుళువ రాజవంశస్థుడికి మశూచి సోకి ఒక కన్ను పోయింది. ఎలా ఉన్నా, రాజకుటుంబంలోని వ్యక్తిని పొగడక తప్పదు. ఆ పొగడడం ఎలా అని ఆలోచించి, ‘తిరుమల రాయుడు తన భార్యతో కలిసి జంటగా ఉన్నపుడు మూడుకన్నులు కలిగిన శివుడి వంటి వాడవు, భార్యతో లేనపుడు ఒకే కన్ను కలిగిన అసురగురువైన శుక్రాచార్యుడంతంటి వాడవు. అసలు నీకో కన్ను లేదు గానీ, ఉంటే మన్మథుడంతటి అందగాడివి కదా! అని పొగిడాడని పద్య విశేషం’’ అన్నాడు.

మరో పది వారాలు సారు నుంచి అలాంటివే సమస్యలు, విద్యార్థుల నుంచి కొంచెం ఇంచుమించు అదే రకం జవాబులు, లేదా ప్రశ్నకు అతకని జవాబులు. ఆ తరగతి చివరి శనివారం ‘‘సదువెందుకు సంకనాకనా పదిలముగా పదియావులు మేపుకున్న పాలిచ్చును, జున్నిచ్చును, పెరుగిచ్చును, మజ్జిగిచ్చును, గంధరమిచ్చును, పేడిచ్చును, పైగా పిడకలిచ్చును’’ అంటూ రాసి ‘‘సోమవారానికి ఈ వాక్యంలో అర్థం తెలుసుకుని రండి. ఈసారి బహుమతి ఉండదు’’ కఠినంగా అన్నాడు. తరగతి గదిలోని విద్యార్థులు మనసులో చిర్రుబుర్రులాడుకున్నారు, నాకైతే సారును తన్నాలన్నంత కోపమొచ్చింది.ఇంటికెళ్ళి అమ్మతో స్కూల్‌ మారతానని మొండికేశాను, అమ్మ చాలా చెప్పింది. ‘‘ఇంత దగ్గర మరో స్కూలు లేదు. వేరే స్కూలు అంటే బస్సులో పోవాలి’’ అంటూ ఎంత చెప్పినా నేను వినలేదు. 

ఆ రాత్రి నేను అన్నం తినలేదు. ఇంతలో మా మోడల్‌ పరీక్ష లొచ్చాయి. మా ముందు చదివిన వారినుంచి తెలుసుకున్న దాని ప్రకారం, మా పాఠశాలలో మోడల్‌ పరీక్షలు రాయడం, మంచి మార్కులు తెచ్చుకోవడం సులభం. ఎవరికి వారు పుస్తకాలు తెచ్చుకోవచ్చు. ఒకరికొకరు కాపీలు అందించుకోవచ్చు. పొట్టి జవాబులన్నీ సారోల్లే బోర్డుపై రాసేవారు. మా మోడల్‌ పరీక్షల నాటికి కాపీలు తెచ్చుకోనీలేదు. కనీసం కాపీలు అందించేవాళ్లు లేరు, బోర్డుపై పొట్టి జవాబులు రాసేవాళ్ళు లేరు. అందరూ తెలుసుకున్న విషయమేమంటే, ప్రిన్సిపల్‌ గారు కూతురి పెళ్లని మూడు నెలలు సెలవుపై వెళ్లారు. భౌతికశాస్త్రం సారు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ అయ్యారు.

‘‘పది ఫైనల్‌ పరీక్షల్లో కూడా కాపీలు అనుమతించబడవు’’ అంటూ స్కూల్లో ప్రకటించారు. ‘‘ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ డౌన్‌ డౌన్‌’’ అంటూ రెండు రోజులు అరిచాము. మాకు గొంతు నొప్పి మాత్రం మిగిలింది. ఇక లాభం లేదని, సారును మార్చమని డీఈవోకు లేఖ తయారు చేసుకొస్తానని మా తరగతి విధ్యార్థులకు చెప్పాను. అందరిలో ఉత్సాహం కనపడింది. నేను రాసుకొచ్చిన లేఖలో ఆ సారు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని రాశాను. ఆ ఉత్తరంపై ఇద్దరు ఆడపిల్లలు మినహా అందరూ సంతకం చేశాం. ఆ ఇద్దరి సంతకం కూడా నేనే గెలికాను. మొదటి సంతకం నాదే. సంతకం చేస్తూ గర్వంగా అనిపించింది.

భౌతికశాస్త్రం సారుతో మా సమస్య తీరి పోతుందనుకున్నాం. నేను రాయడంలో తప్పో, నా రాత డీఈవోకు అర్థం కాలేదో భౌతికశాస్త్రం సారుకు ట్రాన్స్‌ఫర్‌ కాలేదు. నిరుత్సాహపడ్డాం.ఫైనల్‌ పరీక్షలు విద్యార్థులపై కక్ష కట్టినట్లు చాలా కఠినంగా జరిగాయి. నెలరోజుల్లో రిజల్టు వచ్చింది. ముప్పై మంది విద్యార్థుల్లో ఇద్దరే పాసయ్యారు. ఒకరు భౌతికశాస్త్రం సార్‌ కూతురు, రెండవవారు వారి పక్కింటి అమ్మాయి. డీఈవోకు ఉత్తరం రాసినపుడు సంతకం పెట్టకుండా వ్యతిరేకించింది వాళ్ళిద్దరే! భౌతికశాస్త్రం సారే ఆ ఇద్దరినీ మంచి మార్కులతో పాస్‌ చేయించుకొని ఉంటాడని తరగతిలో ఫెయిల్‌ అయిన వాళ్లందరమూ అనుకున్నాం.

రిజల్ట్స్‌ వచ్చిన రోజు ‘‘నన్ను స్కూలు మార్పించమంటే మార్పించలా’’ అంటూ మా అమ్మను తిట్టాను. ‘‘బస్‌ చార్జీలకు కక్కుర్తిపడి పక్క ఊర్లో స్కూలుకు పోనీకుండా నేను ఫెయిల్‌ కావడానికి నువ్వే కారణం’’ అన్నాను. అన్నం తినకుండా అలిగి పడుకున్నాను. అన్నం తినకపోతే బతిమాలే అమ్మ ఆ రోజు బతిమాలలేదు.రాత్రి తొమ్మిది గంటలకు మా నాన్న వచ్చారు. తను అన్నం తినకుండానే నన్ను లేపాడు. కోపం కొద్ది చెంపలు పగలుగొట్టాడు. నా కన్నీళ్ళకు ఆయన కరిగిపోలేదు. నాన్న కొడుతుంటే అమ్మ అడ్డం రాలేదు. ఇంకా కొడతాడేమోనని భయపడడంతో నిక్కరు తడిసి పోయింది. ‘‘నేను తినొచ్చే లోపల స్నానం చేసిరా’’ అన్నాడు. ఏమీ మాట్లాడకుండా స్నానానికి వెళ్లిపోయాను.నేను తిరిగొచ్చే సరికి నాన్న కోపంగా లేడు, సాధారణంగా ఉన్నాడు. నాలో భయం కూడా తగ్గింది. ‘‘భౌతికశాస్త్రం సారుతో నీకు గొడవెందుకు?’’ 

సార్‌ ఇచ్చే ప్రశ్నలు, రాసే పద్యాలు, చివరగా రాసిన ఆవు–పేడ వివరాలు కూడా ఏడుస్తూనే చెప్పాను.‘‘పబ్లిక్‌ పరీక్షల్లో సారు కాపీలు కొట్టనీయలేదని చెప్పడం మరిచావు.’’ అసలు విషయం తెలిసిపోయినందుకు నేనేమీ జంక లేదు. ఎలాగూ ఇంకో వాయి దెబ్బలు తప్పవు, ఇక భయపడి లాభమేమిటి అనుకున్నాను. ‘‘ఇప్పుడు పడుకో పో, రేపు మాట్లాడుకుందాం.’’ నాకు రెండో వాయి పడాల్సిన దెబ్బలు మిగిలిపోయినట్లుగా అనుకుని మొండిగా పడక మీదికి చేరాను. ఒకవైపు నాన్న కొట్టిన దెబ్బల నొప్పి, మరోవైపు నా పట్ల మా అమ్మానాన్నల నిర్లక్ష్యం నన్ను రాత్రంతా నిద్రకు దూరం చేశాయి. ఏదేదో కలవరించానని అమ్మే ఉదయం చెప్పింది.

నాన్న ఇంట్లో లేడు. అమ్మ రాత్రి ఉన్నంత ముభావంగా లేదు. ఉదయపు కార్యక్రమాలు ముగించుకు రాగానే సద్దన్నం పెట్టింది. తినడం ముగియగానే వీధిలోకెళ్లాను. నాలాంటి బాధితులను ఒకరిద్దరిని పలకరించాను.వాళ్ళు తిన్నవి నాకంటే పెద్ద తన్నులే. గంట తరువాత ఇంటికొచ్చాను.‘‘నాన్నకు మడి కాడికి అన్నం తీసుకుపో, నీకు కూడా అన్నం అక్కడికే పెట్టాను’’ అంది అమ్మ.‘‘అప్పుడే ఎందుకు? మధ్యాహ్నం కదా అన్నం తీసుకుపోయేది.’’ నా మనసులో, మాటలో ఏదో అసంతృప్తి.‘‘మీ నాన్న రాత్రి తినకుండానే పడుకున్నార్రా’’ అంటూ అన్నం గంప తలపైకెత్తింది. నేను ఆలోచనలో పడ్డాను. నన్ను కొట్టినందుకు బాధపడి ఉంటాడా? అందుకే అన్నం తినకుండా పడుకుని ఉంటాడా? నాకు జవాబు తోచలేదు.

నాన్న నన్ను చూసి అన్నపుగంప గెనెంపై దించి కయ్యలోకి రమ్మన్నాడు, వెళ్ళాను. నాన్న మడక మేడి పట్టుకోమని చెప్పి ములుకోల చేతికిచ్చాడు. నాలుగు నిముషాలు నాతో దున్నించాడు. మడక అడ్డదిడ్డంగా పోతున్నపుడు, మేడి నా చేతిలోంచి జారిపోతున్నపుడు నాన్న నా వెనకే వస్తూ సాయం చేశాడు.అయినా మడక ఎక్కడా కుదురుగా పోలేదు. ఎలాగోలా నాన్న దున్నుతూ ఉన్న కొండ్ర దున్నేశాను. ‘‘ఇప్పుడు కొండ్ర వేయి’’ అంటూ, మేడి నా చేతికి వదిలేశాడు. నాన్న కొండ్ర వేసినప్పుడు చాలాసార్లు చూశాను. సరళరేఖలా నేరుగా దున్నడమే కదా! అనుకుని కొండ్ర వేశాను. పాము పోయినట్టు వంపు సొంపులుగా సాలు వచ్చింది. అది సరిపోదన్నట్లు, కొండ్ర మొదట్లో బారన్నర వెడల్పుతో మొదలు పెట్టింది కొండ్ర పూర్తయ్యేసరికి రెండు బార్ల వెడల్పయింది. కొండ్ర మొదట వెడల్పును, చివరి వెడల్పును కళ్ళతోనే కొలిచి సిగ్గుపడ్డాను.అప్పుడు నాన్న కాడి నుంచి ఎద్దుల పలుపులు విప్పి గెనెంపైకి తోలాడు.ఇద్దరమూ గెనం మీద కానుగ చెట్టు కింద కూర్చున్నాం.

తినడానికి ఇద్దరికీ ఒకే ప్లేట్‌ పెట్టినట్లుంది. ఆ ప్లేటులోని కలిపి నాన్న నా చేతిలో ముద్దలు పెట్టాడు. నేను కడుపు నిండా తిన్న తరువాత గాని నాన్న ముద్ద నోట్లో పెట్టుకోలేదు. నన్నింతగా ప్రేమించే నాన్న రాత్రి అంతగా ఎలా కొట్టాడు. ఆలోచిస్తున్నాను. ఇంతలో నాన్న తినడం ముగించాడు.‘‘నీ భౌతికశాస్త్రం సారును గత ఆర్నెల్లుగా నెలకోసారైనా కలిసే వాడిని. తరగతి గదిలో నువ్వు చేయలేని పనులు, తరగతి గది బయట నువ్వు చేస్తున్న పనులు, నువ్వు నీ తోటి విద్యార్థులతో కలిసి డీఈవోకు ఉత్తరం రాయడం అన్నీ చెప్పాడు. నేనే వెళ్ళి సారును బదిలీ చేయవద్దని డీఈవోను బతిమాలుకున్నాను. నీ సిగ్గుమాలిన పనులు తెలుసుకున్న నేను నిన్ను కొట్టి దార్లోకి తెస్తానన్నాను, సారు ఒప్పుకోలేదు. అంటు కట్టాల్సిన సమయంలోనే కట్టాలి ముందు కట్టడం వల్ల ప్రయోజనం లేదన్నాడు. అందుకే పరీక్షా ఫలితాలు వచ్చేవరకు ఆగాను.’’ నాన్న చాలా అనునయంగా మాట్లాడాడు.‘‘కాపీలు కొట్టనియ్యలేదని మీ సారును నేరుగా తిట్టావు’’ అన్నాడు.ఎక్కడో తిడితే నాన్నకెలా తెలిసిందా? అని తలొంచుకున్నాను.

‘‘నీ వయసులో తెలుసుకోవాల్సిన విషయమేమంటే, చదువు వృక్షమైతే దాని స్థాయిని అంచనా వేసేందుకు ఆధారపడేవే పరీక్షలనే నీడలు, అనేకసార్లు ఆ పరీక్షలనే నీడలకు చీడ పడుతుంది. పరీక్షల సమయంలో కాపీలు అందజేసే తల్లిదండ్రులు, కాపీలు అందజేసే టీచర్లు, పొట్టి జవాబులు బోర్డుపై రాసే టీచర్లు, రావలసిన మార్కులకంటే ఎక్కువ మార్కులు వేయించే ఉపాధ్యాయులు విద్యార్థుల నాశనం కోరేవాళ్ళే తప్ప వారి మంచి కోరేవాళ్ళు కాదు. వాళ్ళతో పాటు స్కూల్లో తక్కువ శాతం పాస్‌ కావడానికిఅధ్యాపకులను, అధికారులను దూషించిన రాజకీయ నాయకులు కూడా విద్యార్థుల నాశనం కోరే వాళ్ళేనని తెలుసుకో. అంతగాక, చదువుకున్న సబ్జెక్టు పూర్తిగా అర్థం చేసుకుని, తక్కువ మార్కులు తెచ్చుకున్నా సరే, ఆ విద్యార్థే జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించగలడని గుర్తుంచుకో’’ అప్పటికి నాన్న మోరల్‌ పాఠం చెప్పడం ఆపాడు. కాని, నాకు జవాబు తెలియని రెండు కొత్త ప్రశ్నలు వేశాడు.

‘‘ఇప్పుడు చెప్పు, నువ్వు కొండ్ర సరళరేఖలా వేసి ఉండాలి కదా? ఎందుకు సరళ రేఖలా రాలేదు?’’‘‘అదే అర్థం కాలేదు నాన్నా. నేను ఆ ఎదురుగా గెనుం వైపుండే వెంపల చెట్టుకు దారం పట్టినట్లు నేరుగా మడక సాలు తోలితే సరళరేఖలా కొండ్ర వస్తుందనుకున్నాను, ఎందుకో రాలేదు.’’‘‘రెండో ప్రశ్న, కాలం మొదలై ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పుడు ముగుస్తుంది?’’ కొండ్ర సరిగ్గా రాలేదని నేను సిగ్గు పడుతుంటే ఈసారి నాన్న నా తల తిరిగే ఈ ప్రశ్న వేశాడు. బిక్క మొహం వేశాను.‘‘ఏమో నాకెట్ల తెలుస్తుంది?’’ అన్నాను.‘‘అదే పుస్తకంలో చదువుకు, విజ్ఞానానికి తేడా. సాయంత్రం మీ భౌతికశాస్త్రం సార్‌ దగ్గరికి వెళ్ళి ఈ రెండు ప్రశ్నలకు జవాబు అడుగు. వారు సమాధానం చెబుతారు. అప్పుడే నీకు సార్‌ తిట్టుకు అర్థం తెలుస్తుంది’’ అన్నాడు.ఏ తిట్టు గురించా అని ఆలోచిస్తున్నాను. అంతలో నాన్నే చెప్పాడు.‘‘సదువెందుకు సంకనాకనా, పదిలముగా పది యావుల మేపుకున్న...’’ అనేదే అన్నాడు.సంకోచంగా నాన్న వైపు చూశాను. ‘‘సారు ఏమనడులే వెళ్ళు’’ అన్నాడు.సార్‌ దగ్గరికి వెళ్లడానికి నాకే సిగ్గుగా ఉంది, తప్పదని వెళ్ళాను.

‘‘రారా శీనయ్య, బాగున్నావా?’’ అన్నాడు సారు, మా ఇంట్లో జరిగింది, మా పొలంలో జరిగింది ఏమీ తెలియనట్లు, సారు కళ్ళతో కుర్చీ చూపించాడు కూర్చోమని. రెండోసారి నోటితో చెప్పాడు. సారుకు కాస్త దూరంగా నేలపై కూర్చున్నాను.‘‘సార్‌ మా నాన్న రెండు ప్రశ్నలకు జవాబు తెలుసుకుని రమ్మన్నాడు, అందుకే వచ్చాను’’ అన్నాను. రెండు ప్రశ్నలు చెప్పాను. సార్‌ జవాబు చెప్పలేదు. వాళ్ళ కూతురు, నా సహాధ్యాయి అయిన శారదను నీళ్ళు తీసుకు రమ్మన్నాడు. ఆమె ఇచ్చిన నీళ్ళు తాగాను.‘‘శీనయ్య ప్రశ్నలు మళ్ళీ చెప్పు’’ అన్నాడు. మళ్ళీ అడిగాను.‘‘మన స్కూల్‌ నుంచి నేరుగా ఎంత దూరం వరకు రోడ్డు చూడగలవు?’’ అంటూ నన్ను ప్రశ్నించారు సారు. ఒక కిలోమీటరు దూరంలో మలుపు వస్తుందని గుర్తెరిగి, ‘‘ఒక కిలోమీటర్‌ చూడగలం సార్‌’’ అన్నాను.‘‘మరి స్కూల్‌ వద్ద నుంచి చూస్తే ఎంత వెడల్పు కనబడుతుందో అంతే వెడల్పు కిలోమీటరు దూరంలో కూడా అనిపిస్తుందా?’’‘‘స్కూల్‌ వద్ద మూడు బార్ల వెడల్పు అనిపిస్తుంది సార్, ఆ కిలోమీటరు దూరంలో బారెడు వెడల్పు మాత్రమే స్కూల్‌ నుంచి చూస్తే అనిపిస్తుంది సార్‌’’ అంటూ జవాబిచ్చాను.

‘‘అంటే రోడ్డు వెడల్పు ఒకటే, మన దృష్టిలో తేడా ఉంది కదా! రోడ్డంతా ఒకే వెడల్పు ఉన్నట్లు కొలవడం చదువు. దృష్టిలో తేడాతో వెడల్పు ఎలా తగ్గిందో తెలుసుకోవడం విజ్ఞానం’’ చెప్పారు సారు. శారద అక్కడే నిల్చుని ఉంది. సార్‌ నా అవివేకాన్ని తెలుపుతూ ఉంటే విని, ఆ అమ్మాయి సంతోషిస్తున్నదేమోననే అనుమానమొచ్చింది. అయినా చేయగలిగిందేముంది? సిగ్గుతో అలాగే కూర్చున్నాను.‘‘ఇక నీ రెండవ ప్రశ్న. కాలం మొదలై ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పుడు ముగుస్తుంది?’’ నా ప్రశ్న నాకే అప్పజెప్పాడు. ‘జవాబు తెలుసా’ అన్నట్లు కూతురి వైపు చూశాడు సారు.‘‘తెలియదు నాన్నగారు’’ అంది. తన మాటతో నన్ను అవమానించడానికే శారద అక్కడ ఉందని అనుకోలేకపోయాను. నా సిగ్గు కొంత తగ్గింది.

‘‘ఇప్పుడు క్రీ.శ.2025 కదా! కాలం ఈ 2025 ఏళ్ళ క్రితం మొదలు కాలేదు. రోమన్‌ సామ్రాజ్యం నాలుగువేల ఏండ్ల నాటిది కదా! అప్పుడూ కాలం మొదలు కాలేదు. మూడు వందల మిలియన్ల సంవత్సరాల ముందు డైనోసార్లున్నాయి కాబట్టి అప్పుడూ కాలం మొదలు కాలేదు. హిందూ పురాణాల్లో చెప్పినట్లు నాలుగు యుగాల ముందూ కాలం మొదలు కాలేదు.’’ సారు జవాబు చెప్తుండగానే యుగాలు ఏవేవి నాన్నా అంటూ అడిగింది శారద. సార్‌ జవాబు చెప్పాడు.‘‘పోనీ కాలం ఎప్పుడు అంతమవుతుందో చెప్పు’’ అన్నాడు తన కూతుర్ని చూసి.ఆ అమ్మాయి తనకు తెలీదన్నట్లు బిక్కమొహం పెట్టింది.‘‘కాలం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడానికి స్కేలు కోసం వెతకడమే చదువు. కాలం కూడా వలయంలా ఉంటుందేమో, తుది మొదలు లేనిదేమో అని తెలుసుకోవడమే విజ్ఞానం.’’ అంటూ ముగించాడు సారు.

ఏదో గొప్ప విషయం తెలుసుకున్నట్లు శారద మొహంలో వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగు నాలో ఎందుకు లేదో, సార్‌ నాకు చెప్పాలనుకున్నాడెమో శారదను లోపలికి వెళ్లమన్నాడు.‘‘చదువుకు, విజ్ఞానికి తేడా మీ క్లాసులో ఒకసారి చెప్పాను గుర్తుందా?’’ అన్నాడు. తల అడ్డంగా ఊపాను.‘‘సదువెందుకు సంకనాకనా పదిలముగా పది యావుల మేపుకున్న... అంటూ ఆపాడు.గుర్తొచ్చినట్లు తలూపాను.‘‘కంఠస్థం చదువుల కంటే, కాపీలు కొట్టి పాస్‌ కావడం కంటే, మార్కులు వేయించుకుని పాస్‌ కావడం కంటే, పది ఆవులు మేపుకోవడం మేలని తెలిసే చెప్పాను’’ అన్నాడు సార్‌.ఆ సారు చెప్పింది నాకేమి అర్థమైందో ఇప్పుడు చెప్పలేను గాని, మళ్ళీ స్కూలు మారతానని అమ్మా నాన్నలతో చెప్పలేదు. అదే స్కూల్లో, అదే భౌతికశాస్త్రం సారు వద్ద పదో తరగతి మళ్ళీ చదివి, జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో పదిహేనవ ర్యాంకు సాధించాను. 

ఇంటికి వెళ్ళి అమ్మానాన్నలను పలకరించి, నేరుగా సార్‌ దగ్గరకు వెళ్ళి పాద నమస్కారం చేశాను. రాఘవేంద్రరావు సార్‌ నన్ను పొత్తిళ్లలోని కన్నబిడ్డను అదుముకున్నట్టు హృదయానికి హత్తుకున్నాడు. ఏమనుకున్నారో నా భార్యా పిల్లలు కూడా నా తర్వాత వారికి పాద నమస్కారం చేశారు. మా అలికిడి విని సార్‌ కూతురు, భార్య అక్కడికొచ్చారు. నా భార్యకు వాళ్ళిద్దరూ ముందే తెలుసు.
నా పిల్లలకు తన కూతురిని చూపిస్తూ ‘‘అక్క పేరు శారద, తన భార్యను చూపుతూ స్వర్ణమ్మ’’ అన్నారు సార్‌.సారు ఇంట్లోనే టిఫిన్‌ తిన్నాం. అప్పుడు పిల్లల వైపు చూసి ‘‘కారులో వస్తున్నపుడు నన్ను ఏదో ప్రశ్న వేస్తిరి కదా! ఇప్పుడు సారును అడగండి’’ అన్నాను. వాళ్ళకు ఆ ప్రశ్న ఏదో గుర్తున్నట్లు లేదు. చివరికి నేనే అడిగాను.మనం ముందుకెళ్తుంటే చెట్లు వెనక్కి వెళుతున్నట్లు అన్నదానికి ‘‘సాపేక్ష చలనం అనే భావన ద్వారా అర్థం తెలుసుకోవాలి’’ అంటూ సార్‌ సమాధానం ముగించాడు.

‘‘అర్థం కాలేదు తాతా’’ అంది నా కూతురు స్వర్ణమ్మ.‘‘రైలులో సీట్లు, లగేజ్, తోటి ప్రయాణికులు మనతో పాటే స్థిరంగా ఉన్నట్లు తోస్తుంది. కానీ రైలుబోగీలు, రైలులో సీట్లు, లగేజ్, రైలుతో పాటు ముందుకు సాగుతున్నాయి. మనం రైల్లో స్థిరంగా ఉన్నట్లు అనిపించడం వలననే, భూమిపై స్థిరంగా ఉన్న చెట్లు వేగంగా వెనక్కి పోతున్నట్లు అగుపిస్తాయి. నిజానికి చెట్లు కూడా భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. ఈ పరస్పర వేగ వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే సాపేక్ష వేగం.’’ ఆ సాపేక్ష వేగంలోని తేడా వలననే చెట్లు వెనక్కి పోయినట్లపిస్తుంది. మాట ముగించి ‘‘అర్థమైందా రాఘవేంద్రా’’ అన్నాడు సారు, తన పేరును తనే పలుకుతూ.
‘‘అయినా సాపేక్ష వేగం గురించి అర్థం చేసుకోవడానికి నీ వయసు చాలదురా నాన్నా. 

ఇప్పుడు మీరు చదివే చదువు రేపటి మీ విజ్ఞానానికి తోడ్పడాలి. చదువు, విజ్ఞానాలలో ఏది నిజమో, ఏది నీడో మున్ముందు మీకే తెలుస్తుంది’’ అని కూడా అన్నాడు.ఆ పూట మధ్యాహ్న భోజనం కూడా అక్కడే. భోంచేసేటపుడు మా దంపతులకు జీవితంలో మరచిపోరాని పాఠం చెప్పాడు సార్‌. ‘‘నీ బిడ్డలకు ఎన్ని మార్కులొచ్చాయని ఎప్పుడూ అడగకు, ఆలోచించకు. వాళ్ళు చదువుతున్న అంశాలను తార్కికంగా, విమర్శనాత్మకంగా, సమగ్రంగా, అవగాహనతో చదివేటట్లు మాత్రం చూడు.’’అంత పాతకాలపు రాఘవేంద్రరావు, స్వర్ణమ్మ అనే పేర్లు తనతో పోట్లాడి మరీ మా బిడ్డలకు ఎందుకు పెట్టానో నా భార్యకు అర్థమైనట్లుగా ఆమె ముఖకవళికల్లో తోచింది.నేనెందుకు సారుతోనే కొడుకు ప్రశ్నకు జవాబు చెప్పించానో పిల్లలకు అర్థమైనట్లు కూడా నాకు తోచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement