జనవరి 10, 2026 – శనివారం ఉదయం 9:30 చలికాలం. చల్లని గాలి. పొగమంచు. రైలు దిగి అరవింద్ బ్యాగ్‌ను భుజాన వేసుకుని ఇంటివైపు నడిచాడు. జాకెట్ జిప్ పైకి లాగి, చేతులను జేబుల్లోకి దూర్చుకున్నాడు. దూరంగా టీ బండి నుంచి వచ్చే వేడి టీ వాసన గాలిలో కలిసింది. సూర్యుడికీ చలిగా ఉందేమో– మబ్బుల వెనుక దోబూచులాడుతున్నాడు. ఇంటి ముందు ఆగాడు. తలుపు తట్టబోయేలోపే– తాళం బయట వేలాడుతుండటం కనిపించింది.జేబులు వెతికాడు. రెండో తాళం చెవి ఇంట్లోనే వదిలేశాడని గుర్తొచ్చింది.
చిరాకుతో వెంటనే కమలకు ఫోన్ చేశాడు. అమ్మకు ఒళ్లు బాగాలేదని తెలిసి ఉదయమే బస్సెక్కి వెళ్లానంది. ‘‘రెండో తాళం చెవి ఉందిగా,’’ అంది. ‘‘అది ఇంట్లోనే ఉంది,’’ అన్నాడు కాస్త గట్టిగా. ఆమె సారీ చెప్పింది. తొందరలో ఆలోచించలేకపోయానంది.ఉసూరుమన్నాడు. తలుపు బయటే నిలబడ్డాడు. చిరాకును దిగమింగి, ‘అత్తగారికి ఎలా ఉంద’ని అడిగాడు.‘‘ఇప్పుడు కాస్త బాగుంది. డాక్టర్ చూశాడు. బ్లడ్ ప్రెషర్ పెరిగింది. రెస్ట్ తీసుకోవాలన్నాడు.’’‘‘ఎప్పుడొస్తావు?’’‘‘రెండు రోజులు ఇక్కడే ఉండాలనుకున్నా. మీకు ఇబ్బంది కదా? మెల్లగా బయలుదేరతా.
సాయంత్రం ఏడు లేదా ఎనిమిది అవుతుందేమో.’’ ఫోన్ కట్ అయింది.ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి. బయట ఉండాల్సిన నిర్బంధం. ఆ రెండింటి మధ్య నిలబడ్డట్టయ్యాడు.టీ బండి దగ్గరకు వెళ్ళాడు. వేడి టీ గొంతులోకి దిగుతుండగా కాస్త హుషారు వచ్చింది. ఫోన్ తీసి ఫేస్‌బుక్ తెరిచాడు. స్క్రోల్ చేశాడు. పాత స్నేహితుడు కుటుంబంతో దుబాయ్ ట్రిప్. ఇంకొకరు కొత్త కారులో. ఒక ఫొటో మీద కాసేపు ఆగి, మళ్లీ ముందుకు.కమల పంపిన ‘క్షేమంగా చేరాను’ అనే సందేశం కనిపించింది. స్క్రీన్ వెలుతురు అతని ముఖంపై పడి మళ్లీ ఆరిపోయింది.పొద్దున్నే అలారం ఆపి స్క్రోల్ చేయటం. క్యాబ్‌లో షార్ట్స్. ఆఫీస్ మీటింగ్‌లు. టార్గెట్‌లు. ఈ మెయిళ్ళు. అటూ ఇటూ పరుగులు. ఒకటే ఒత్తిడి. మధ్యాహ్నం జొమాటో. రాత్రి నెట్‌ఫ్లిక్స్. వారాంతాల్లో అప్పుడప్పుడు సాటి ఉద్యోగులతో విందులు.
బయటికి చూస్తే నిండిన జీవితం. లోపల మాత్రం నెమ్మదిగా పెరుగుతున్న ఖాళీ. నిజమైన సంభాషణలా? లోతైన మాటలా? ఏమున్నాయి?సోషల్ మీడియా కనెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది– నిజానికి మరింత దూరం చేస్తుంది.సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లదామని కమల ఎన్నిసార్లు అడిగిందో గుర్తొచ్చింది. ప్రతిసారి ‘‘బిజీగా ఉన్నా’’ లేదా ‘‘అలసటగా ఉంది’’ అనే సమాధానమే. రోజులు నిండిపోతున్నట్టే కనిపించాయి. కానీ ఏదో ముఖ్యమైనది ఎప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది.ఇప్పుడు ఈ శనివారం ఉదయం అతని ముందుంది– మబ్బుల ఆకాశం. మూసిన తలుపు. చేతిలో టీ కప్పు. ఇప్పుడు ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళితే? ఈ సమయంలో ఎవరి పనుల్లో వాళ్ళుంటారు.మొదటిసారి ఆ సమయం నిజంగానే ఖాళీగా అనిపించింది. దేనితో నింపాలి?
జనవరి 10, 2026 శనివారం ఉదయం గం. 10:00ఏమీ తోచక, ఏం చేయాలో తెలియక అరవింద్ దారినపడి నడుస్తున్నాడు. ఇరవై నిమిషాలు గడిచేసరికి వెనక నుంచి చిన్న అడుగుల శబ్దం వినిపించింది. తిరిగి చూసేసరికి కిరణ్. మేనల్లుడు.పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘మామయ్యా!’’ అంటూ కాళ్లకు చుట్టుకున్నాడు. చిన్న చేతులతో గట్టిగా పట్టుకుని ముఖం పైకెత్తి చూశాడు– కళ్లలో ఆనందం, ఆశ్చర్యం కలిసి మెరిశాయి.అరవింద్ అలాగే నిలబడిపోయాడు. వాడి ముఖంలో తన చిన్ననాటి ప్రతిబింబం కనిపించినట్టైంది.అటూ ఇటూ చూశాడు. ఎవరి దారిని వాళ్లే. కాస్త దూరంలో పిన్ని ఇల్లు. గుండె ఒక్కసారిగా బరువెక్కింది. పాత అపార్థాలు, ఆస్తి విషయాలు, తండ్రి మాటలు– అన్నీ మనస్సులోకి దూరాయి.కిరణ్ అతని చేయి పట్టుకుని, ‘‘మామయ్యా, ఇంటికి రా!’’ అంటూ లాగాడు.అరవింద్ ఆగిపోయాడు. ఇన్నేళ్లకి వాళ్లింటికి వెళ్లటం? పిన్ని ఏమంటుంది? చెల్లెలు ప్రియఏమనుకుంటుంది?
‘‘కిరణ్, ఇప్పుడు రాలేనులే తర్వాత వస్తా,’’ అన్నాడు మెల్లగా. గొంతు వణికింది.‘‘మళ్లీ కనపడవు నువ్వు. ఇప్పుడే రావాలి,’’ అంటూ మళ్లీ చేయి లాగాడు.ఆ చూపును కాదనలేక– ఒక్క క్షణం తడబడినా– ‘‘సరే, పద,’’ అన్నాడు. ఇద్దరూ కలిసి ఇంటి వైపు నడిచారు.ఇంటి గేటు దగ్గరకు రాగానే పిన్ని బయటికి వచ్చింది. ‘‘ఎక్కడికి పోయావ్ రా?’’ అని కిరణ్‌ను అడిగి, వెంటనే అరవింద్ వైపు చూసి ఆగిపోయింది. ‘‘అరవింద్... నువ్వు!’’అరవింద్ తడబడ్డాడు. ‘‘ఈ దారిని వెళ్తుంటే కిరణ్...’’ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకో మాటలు చిన్నవిగా, తాను చిన్నవాడిలా అనిపించాడు.పిన్ని తనను తానే సర్దుకుని, ‘‘లోపలికి రా,’’ అంది.హాల్లో నుంచి ప్రియ వచ్చింది. నవ్వుతూ, నవ్వుతూనే కొంచెం నిష్టూరంగా– ‘‘అన్నాయ్! ఇన్నాళ్లకి దారితప్పి వచ్చావన్నమాట,’’ అంది. ఆ మాటలో తప్పుపట్టటం లేదు– మళ్లీ దొరికిన ఆనందమే ఉంది.
‘‘రాక రాక వస్తే అవేం మాటలే,’’ అంటూ పిన్ని వారించింది.లోపల అడుగుపెట్టగానే అదే పాత కలప వాసన, అగరువత్తి ధూపం, వంటింటి నుంచి తాలింపు. ఇల్లు మారలేదు; తానే మారిపోయాడన్న భావన కలిగింది.పదవ తరగతి రోజుల్లో పిన్ని డబ్బు కోసం వచ్చిన జ్ఞాపకం మెదిలింది. అప్పటికే బాబాయి చనిపోయాడు. తండ్రి సాయం చేయలేదు. అప్పటి నుంచే రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. భర్తను కోల్పోయినా తమను పట్టించుకోలేదన్న బాధ పిన్నిది. ఒంటరిగానే ఉండి ప్రియను చదివించింది. పెళ్లి ఖర్చుల కోసం తమ వాటా పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆస్తి పేచీలు, మాటల తగాదాలు– బంధాల మధ్య మౌనంగా పెరిగిన గోడలు. నాలుగేళ్లుగా రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.
కమల మాటలు గుర్తొచ్చాయి– ‘‘దూరాలు నిజంగా దూరాలు కావు. వెళ్లిరండి.’’కానీ అపార్థాలు అంత తేలిగ్గా కరుగుతాయా? తండ్రి ఏమనుకుంటాడోనన్న భయం ఎప్పుడూ ఆపేసింది. ఈ క్షణంలో మాత్రం ఆ పాత గాయాలన్నీ మెల్లగా మాసిపోతున్నట్టు అనిపించింది.ఇంటి ముందు జామచెట్టు అలాగే ఉంది. వయసు పెరిగినా కొమ్మల్లో ఇంకా పాత రోజుల నీడ. ఆ కొమ్మల మీదెక్కి దోరగాయలు కోసుకుని ఉప్పు, కారం రాసుకుని తిన్న రోజులు కళ్లముందు కదిలాయి. ‘‘పడిపోతావురా!’’ అంటూ పిన్ని వేసిన కేకలు వినిపించినట్టయ్యాయి. తనకు మగపిల్లలు లేరు; అరవింద్‌ను కొడుకులా చూసేది.పిన్ని కాఫీ తెచ్చింది. ‘‘నీకు ఇష్టమైనట్టు పంచదార ఎక్కువేశా,’’ అంది. అదే జ్ఞాపకం. అదే ప్రేమ.గోడల మీద పాత ఫోటోలు. జామచెట్టు మీద కూర్చుని నవ్వుతున్న చిన్న అరవింద్. పక్కనే రెండు జడలతో ప్రియ. ‘‘రోజంతా చెట్టుమీదే ఉండేవాడివి,’’ అంది పిన్ని.
కిరణ్ తన స్కూల్ డ్రాయింగ్ చూపించాడు. ప్రియ పెళ్లి ఫొటోలు తీసుకొచ్చి చూపించింది. కబుర్లు, చిన్న నవ్వులు, మధ్య మధ్యలో మౌన విరామాలు. ఆపై భోజనం.చివరికి పిన్ని ఒక చిన్న డబ్బా తెచ్చింది. ‘‘అరిసెలు. నీకిష్టం గదా?’’ఇప్పటికీ తనమీద ఆ ప్రేమ అలాగే ఉందని అర్థమైంది.‘‘కమలని అడిగానని చెప్పు. అప్పుడప్పుడు రావాలి,’’ అంది పిన్ని.‘‘తప్పకుండా వస్తాను పిన్నీ,’’ అన్నాడు.‘‘వస్తాను కాదు– వస్తాము,’’ అంది ప్రియ మెల్లగా.అరవింద్ నవ్వాడు, తల ఊపుతూ. ‘మమ్మల్ని కూడా మీ ఇంటికి పిలవాలి మరి,’’ అంది మళ్ళీ.ప్రియ నెత్తిమీద చిన్న మొట్టికాయ వేసి, కిరణ్‌ను ముద్దు పెట్టుకున్నాడు. గుండెల్లో ఒక మృదువైన వెచ్చదనం నిండింది– పసితనం మళ్లీ తాకినట్టు.
ఆ రోజు నడిచిన దారి అతన్ని ఇంటికి కాదు– తన బాల్యానికి తీసుకెళ్లింది. మౌన విభేదాలు పోయి, మనస్సులో గడ్డలా గట్టిపడ్డదేదో నెమ్మదిగా కరుగుతున్నట్టు అనిపించింది.ఉదయం మూసుకుపోయిన తలుపు– ఇక్కడ సులభంగా తెరుచుకుంది.జనవరి 10, 2026 శనివారం మధ్యాహ్నం గం. 03:30 చలిగాలి తగ్గింది. మే–ఫ్లవర్ అపార్ట్‌మెంట్ గేట్ ముందు అరవింద్ నిలబడ్డాడు. బయట చలి తగ్గినట్టే అనిపించినా, అతని గుండెల్లోని చలి మాత్రం అలాగే ఉంది. లోపలికి అడుగుపెట్టాలా లేక ఇక్కడితో తిరిగి వెళ్లిపోవాలా? నిర్ణయం తీసుకునేలోపే ఆమె ముఖం, చిరునవ్వు, మాటలు– అన్నీ ఒకేసారి మనస్సులోకి దూసుకొచ్చాయి.‘‘ప్రాక్టికల్‌గా ఆలోచించు.’’
కాలేజీ రోజుల్లో తన హృదయాన్ని తాకి, చివరికి దూరమైన రజని మాటలు.‘‘అరవింద్! నిన్ను ప్రేమించానన్నది నిజం. కానీ ఇద్దరికీ ఉద్యోగం లేకుండా జీవితం ఎలా? కొన్నాళ్లు చూద్దాం,’’ అన్నది. ఆ ‘కొన్నాళ్లు’ ఎన్నాళ్లకీ ముగియలేదు. ముగిసేసరికి ఆమె ఒక ఉన్నతోద్యోగిని పెళ్లాడింది. పెళ్లికి పిలిచినా అతను వెళ్లలేదు. ఆమె తిరస్కారం అతనిలో లోతైన గాయంగా మిగిలింది.ఆ తర్వాత ఆమె సంతోషంగా ఉందని విని, నిర్వేదం కలిగింది. క్రమంగా మర్చిపోయాడు. లేక మర్చిపోయాననుకున్నాడు. కానీ ఈమధ్య ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని విన్న క్షణంలో పాత జ్ఞాపకాలు మళ్లీ మేల్కొన్నాయి. బాధ కలిగినా, ఎందుకో వెంటనే వెళ్లి పరామర్శించాలనిపించలేదు. నెమ్మదిగా ఆలోచిస్తే, ఆనాటి ఆమె నిర్ణయంలో తప్పేమీ లేదనిపించింది. తనలోని ఇరుకు తనకే అర్థమైంది.
ఇప్పుడు ఆమె బాధలో ఉంది. తాను పలకరిస్తే? లేక ఇది పాత గాయాలను మళ్లీ రేపటమేనా?ఒక్కసారి కళ్లు మూసుకున్నాడు. ఫోన్ జేబులో పెట్టి లోపలికి నడిచాడు. లాబీలో వెచ్చదనం. లిఫ్ట్ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు– పాలిపోయినట్టుంది. ఫ్లాట్ ముందు నిలబడి, ఒక్క క్షణం వెనక్కి తిరగాలనిపించినా, చెయ్యెత్తి తట్టాడు.తలుపు తెరిచింది రజని. కళ్లు ఎర్రగా, వాపుగా. సాదా చీర, అస్తవ్యస్తంగా జుట్టు. ముప్పై రెండేళ్ల వయసే అయినా, విషాదం ఆమెను మరింత పెద్దదిగా చూపిస్తోంది.‘‘అరవింద్! నువ్వా?’’ ఆ గొంతులో ఆశ్చర్యం, ఆనందం, బాధ– అన్నీ కలిసి ఉన్నాయి.‘‘ఇబ్బంది లేకపోతే కాసేపు మాట్లాడదామని,’’ అన్నాడు.ఆమె తప్పుకొని లోపలికి పిలిచింది.
ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. కాసేపు మౌనం.‘‘ఏదో సంకోచంతో ఇప్పటిదాకా రాలేకపోయాను. ఐ యామ్ సారీ.’’హాల్లో మసక చీకటి. గోడలపై ఆమె భర్తతో ఉన్న సంతోషకరమైన ఫోటోలు– ఇప్పుడు అవి మరింత నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి.‘‘ఫర్వాలేదు. ఇప్పుడైనా వచ్చావు. అదే చాలు,’’ అంది.అతను నెమ్మదిగా అడిగాడు– ‘‘ఎలా జరిగింది?’’కొత్త ప్రాజెక్ట్... తీరికలేని రోజులు. డ్రైవర్ సెలవు... కారు చెట్టుకు గుద్దుకోవడంం ఒక్క నిమిషంలో అంతా ముగిసిపోయింది. వీకెండ్ ట్రిప్స్, రాత్రి కబుర్లు, తన కెరీర్‌కి ఇచ్చిన ప్రోత్సాహం– అన్నీ ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి.
‘‘ఇప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టదు,’’ అంది.
‘‘అమ్మా నాన్నా? పాప?’’‘‘వాళ్లు మొన్నటిదాకా ఉండి వెళ్లారు. పాప హాస్టల్‌లో ఉంది.’’ఆమె గొంతులో విషాదం గడ్డకట్టింది.‘‘అప్పుడు నేనే దూరంగా జరిగాను. ఇప్పుడు నువ్వే అభిమానంగా వచ్చావు,’’ అంది నెమ్మదిగా.‘‘అవేవీ పట్టించుకోకూడదనిపించింది.’’ అన్నాడు.‘‘సుఖాల్లో అందరూ ఉంటారు. దుఃఖాన్ని పంచుకునేవాళ్లు అరుదు.’’ఆమె కళ్ళు తడిశాయి. అరవింద్ మాట్లాడలేదు. ఓదార్పుగా ఆమె చేతిని తాకాడు. ఆమె అడిగితే, తన జీవితాన్ని చెప్పాడు– ఒక్కడే పిల్లాడు. వేరే ఊరిలో కాలేజీ చదువు.కాసేపు కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు– ఒకరి పక్కన ఒకరు, హద్దు మీరకుండా కూర్చున్న రోజులు. ఎన్నో కలలు గన్న రోజులు. ఇప్పుడు అవి మాటల్లో మాత్రమే మిగిలాయి.‘‘ఆ రోజులు నీకింకా గుర్తున్నాయి,’’ అంది రజని. అవునన్నట్టు తల ఊపాడు.‘‘గతాన్ని దాటి చాలా దూరం వచ్చేశాం రజనీ. మన దారులు వేరయ్యాయి. అయినా పరాయివాళ్లుగా ఉండాల్సిన అవసరం లేదనిపించింది. ఏ సాయం కావాలన్నా కాల్ చెయ్యి. వస్తాను,’’ అన్నాడు.లేచి నిలబడ్డాడు.
రజని కళ్లలో కృతజ్ఞత, ఆప్యాయత. భర్త జ్ఞాపకం ఒక వైపు గుండెను బరువెక్కిస్తుంటే, అరవింద్ రాక మరోవైపు ఓదార్పులా తాకింది‘‘ఇవాళ కాస్త ఉపశమనం కలిగింది. నువ్వు వచ్చినందుకు చాలా థాంక్స్,’’ అని అతని చెయ్యి పట్టుకుంది.అరవింద్ ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కాడు.బయటికి వచ్చేసరికి, అతని మనసులో ఓ మౌన తృప్తి అలముకుంది. గుండెల్లోని చలి కొద్దిగా తగ్గినట్టనిపించింది.జనవరి 10, 2026 – శనివారం సాయంత్రం 5:30సూర్యుడు కొంచెం వాలిపోయాడు. ఆకాశం నారింజ కాంతిలో మసకబారుతోంది. చలిగాలి మళ్లీ తాకింది. ఇంకా మూడు గంటల సమయం.అదే క్షణంలో– ఆ రోజు కళాభవ లో పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వేణు వాద్య కచేరీ ఉందని గుర్తొచ్చింది. ఆటోలో అరగంట ప్రయాణం. ఆలోచన ఆగింది. నిర్ణయం తీసుకున్నట్టయ్యింది. కొద్దిసేపటికి కిక్కిరిసిన కళాభవన్ హాల్లో, చివరి వరుసలో కూర్చున్నాడు.
లోపల అడుగుపెట్టగానే బయట ప్రపంచం తలుపు మూసుకున్నట్టైంది. దీపాలు మసకబారాయి. ప్రేక్షకులు నిశ్శబ్దంగా– శ్వాసలు కూడా వినిపించని నిశ్శబ్దం. వేదికపై పండిత్‌జీ చేతిలో వెదురు వేణువు; కళ్లు అరమూసి, ముఖంలో ధ్యాన గంభీరత.ఆలాప్ ప్రారంభమైంది.మృదువైన, లోతైన స్వరాలు గాలిలో తేలుతున్నాయి. కోమల గాంధారం నుంచి శుద్ధ మధ్యమానికి సాగిన ఆ స్వర సంచారం అరవింద్ గుండెల్లో ఏదో కదిలించింది. తర్వాత కోమల దైవతం, కోమల నిషాదం– ప్రతి స్వరం నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా చేస్తూ హృదయాన్ని తాకింది. మాల్కౌంస్ రాత్రి జనించిన రాగం. దాని గాంభీర్యం, అంతర్గత శక్తి, తీవ్రమైన శాంతి– వేణువులో నిండుగా పలికాయి. పండిత్ జీ శ్వాసల లోతు ప్రతి స్వరంలో వినిపించింది.ఆ తర్వాత జోడ్ (లయ ప్రారంభ దశ) మొదలైంది. వేణువు క్రమంగా వేగం అందుకుంది– కానీ ఆ వేగంలోనూ సౌమ్యత, నియంత్రణ స్పష్టంగా కనిపించాయి.
తబలా లయతో కలిసిన క్షణం నుంచి అది సంగీతం మాత్రమే కాదు– ఒక అనుభూతి. అరవింద్ గుండెల్లోని భారం కరిగిపోతున్నట్టనిపించింది.ఝాలా (ఉత్కర్ష దశ) వచ్చేసరికి స్వరాలు వరదలా ప్రవహించాయి. కానీ ఆ ప్రవాహంలోనూ ఒక స్థిరత్వం ఉంది. వేణువు– మానవ శ్వాసతో ముడిపడిన వాద్యం– గాలి కదలికను, ప్రకృతి లయను హృదయస్పర్శిగా పలికించింది. ప్రతి మీండ్ (స్వర సంధి) గాంధారం నుంచి మధ్యమానికి, ధైవతం నుంచి నిషాదానికి సాగినప్పుడు, అతని అంతరంగంలో దాచుకున్న భావాలు మెల్లగా విప్పుతున్నట్టనిపించింది. అరవింద్ కళ్లు మూసుకున్నాడు. బయటి ప్రపంచం కరిగిపోయింది. స్వరాల్లో మునిగిపోయి, ఆ గాఢమైన శాంతిలో తానే తాను కలిసిపోయాడు.చప్పట్ల హోరుతో కచేరీ ముగిసింది.
హాల్ బయటికి రాగానే ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చలిగాలి మృదువుగా వీచుతోంది. అతని చెవుల్లో మాత్రం ఇంకా వేణు స్వరాలు తేలుతూనే ఉన్నాయి. వేణువు మానవ శ్వాసతో జీవించే వాద్యం. అందుకే దాని స్వరాల్లో భావాలే కాదు– గాలి అలజడి, నదుల కెరటాల మర్మరం, పక్షుల కిలకిలలు– ప్రకృతంతా మృదువుగా ప్రతిధ్వనిస్తుంది.‘‘వేణువే అంత/ ఆనందమై వేధిస్తుంది’’ అన్న కవి మాట ఆ క్షణంలో అరవింద్‌కు సంపూర్ణ సత్యంలా అనిపించింది.జనవరి 10, 2026 – శనివారం రాత్రి 8:30చలిగాలిలో అరవింద్ ఇంటికి చేరేసరికి కమల వంట ముగించేసింది. వంటింటి నుంచి వచ్చే వేడి వాసనతో పాటు ఆమె ఒంటి అలసట కూడా తెలుస్తుంది.‘‘అమ్మయ్య వచ్చావా? అమ్మ ఎలా ఉంది ఇప్పుడు?’’ అని అడిగాడు.కమల ఒక్క నిట్టూర్పు విడిచింది.
ఆ నిట్టూర్పులో అలసటతో పాటు ఓ శాంతి కూడా మిళితమై ఉంది.‘‘ఫర్వాలేదు. అవసరమైతే మళ్లీ వెళ్లొచ్చులే– ఈసారి రెండో తాళం చెవి గుర్తు పెట్టుకో,’’ అంది చిలిపిగా. వెంటనే నవ్వుతూ, ‘‘రోజంతా ఒంటరిగా ఏం చేశావు? కొంపదీసి బార్‌కి వెళ్లావేమిటి?’’ అని అడిగింది.‘‘కొంప దీయలేదు,’’ అన్నాడు అరవింద్ మెల్లగా. ఆ నవ్వులోనే సమాధానం ఉంది. కమలకు తెలుసు– అతనికా అలవాటు లేదని. ఆ రోజు జరిగినదంతా అతని మాటల్లోకి జారిపోయింది. పిన్ని ఇంటి సందడి, పిల్లల నవ్వులు, రజని విషాదం– ఏదీ దాచలేదు.
కమలకు రజని గురించి తెలుసు కాబట్టి అతను ఒక్క మాట కూడా ఆపలేదు. చివరికి కళాభవన్, హరిప్రసాద్ కచేరీ, మాల్కౌంస్ రాగం ఆ వేణు స్వరాలు ఎలా గుండెల్లోకి జారిపడి మెల్లగా శాంతిని నింపాయో చెప్పుకుంటూ పోయాడు. మాట్లాడుతుండగా అతని స్వరం క్రమంగా మృదువైంది. కమల ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా అతని చేతులు పట్టుకుంది. దగ్గరికి లాగుకుంది. ఆమె ఊర్పులు అతని గుండెపై మృదువుగా తాకాయి– మరో వేణు శ్వాసలు.‘‘ఇవే గదా జీవించిన క్షణాలు,’’ అనుకున్నాడు అరవింద్.గుండెల్లోని ఖాళీ నెమ్మదిగా పూరితమైంది.బయట చలిగాలిలో రాత్రి మెల్లగా చిక్కబడుతోంది.
రచయిత ∙పాపినేని శివశంకర్


