Toolika Rani: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్‌’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!

Toolika Rani Appointed Uttar Pradesh G20 Brand Ambassador - Sakshi

సందర్భం

సాహసగాథలు వింటే సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం చేస్తే మరిన్ని సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం ఏం ఇస్తుంది? ‘అంతులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాదు మనమేమిటో మనకు తెలియజేస్తుంది’ అంటుంది తులికారాణి. ఎన్నో ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించిన ఈ సాహసి సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌ అధిరోహించిన తొలి మహిళగా, ఇరాన్‌లోని మౌంట్‌ డమవండ్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది తులికారాణి. మీరట్‌లో చదువుకున్న రాణికి చిన్నప్పటి నుంచి సాహసగాథలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌పై ఆసక్తి కలిగేలా చేసింది.

2005లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన రాణి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలింగ్‌ విభాగంలో, ఔట్‌డోర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పదిసంవత్సరాల పాటు పనిచేసింది.
ఎయిర్‌ఫోర్స్‌ టీమ్‌లో భాగంగా పర్వతారోహణకు శ్రీకారం చుట్టింది. అప్పుడు మొదలైన ఆసక్తి ఆమెతో ఎన్నో సాహసాలు చేయించింది.

భారతదేశం, నేపాల్‌. భూటాన్, ఇరాన్, రష్యా... మొదలైన దేశాల్లో  ఇరవైనాలుగు ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించింది. ఝాన్సీ లక్షీభాయి పురస్కారంతో పాటు పదిహేడు అవార్డ్‌లు అందుకుంది. వాటిలో ‘గ్లోబల్‌ ఉమెన్‌’ అవార్డ్‌ కూడా ఒకటి.

‘సవాలును స్వీకరించడానికి ధైర్యం మాత్రమే కాదు అంకితభావం, కష్టపడే తత్వం ఉండాలి. ప్రయాణంలో అవహేళనలు ఎదురు కావచ్చు. అయితే ఒక్క విజయం చాలు వాటికి సమాధానం చెప్పడానికి’ అంటుంది రాణి.

తొలిసారిగా పర్వతారోహణకు ఉపక్రమించినప్పుడు ప్రోత్సహించే వారి కంటే ‘ఎందుకొచ్చిన రిస్క్‌’ అన్నవాళ్లే ఎక్కువ. కొందరైతే ‘అమ్మాయిలు పర్వతారోహణ చేయడం కష్టం’ అన్నారు. విమర్శలకు, అనుమానాలకు, అవహేళనలకు తన విజయాలతోనే గట్టి సమాధానం చెప్పింది రాణి.

పుస్తకాలు చదవడం, తన సాహనయాత్రల గురించి ఆర్టికల్స్‌ రాయడం, ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ భావుకతతో కవిత్వం రాయడం రాణికి ఇష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం అంటే ఇష్టం.

తాజా విషయానికి వస్తే... తులికారాణిని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం జీ–20 బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. వారణాసిలో ఆరు, ఆగ్రాలో మూడు, లక్నోలో ఒకటి, గ్రేటర్‌ నోడియాలో ఒకటి...జీ–20కి సంబంధించిన రకరకాల సమావేశాలు జరుగుతాయి. వీటిలో నలభై దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. కాలేజీ, యూనివర్శిటీలలో జరిగే కార్యక్రమాల్లో అంబాసిడర్‌ హోదాలో ΄ాల్గొననుంది రాణి.

‘జీ–20 బ్రాండ్‌ అంబాసిడర్‌గా నన్ను నియమించడం గర్వంగా ఉంది. నా బాధ్యతను మరింత పెంచింది. నిర్మాణాత్మక విషయాల గురించి యువతలో ఆసక్తి, అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది రాణి.

రాణిలో మంచి వక్త, లోతైన విశ్లేషకురాలు కూడా ఉన్నారు. అడ్వెంచర్‌ స్టోర్ట్స్‌లో జెండర్‌ గ్యాప్, ఇన్‌ఫర్‌మేషన్‌ గ్యాప్‌ ఎందుకు ఉంది? ఔట్‌డోర్‌ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో స్త్రీలు అడుగు పెట్టడానికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి? వాటికి పరిష్కారం ఏమిటి? పర్వతారోహణకు ఆర్థికబలం అనేది ఎంత ముఖ్యం... మొదలైన విషయాల గురించి రాణి అద్భుతంగా విశ్లేషిస్తుంది. ‘సాహసాలే కాదు సమాజసేవ కూడా’ అంటున్న తులికారాణికి అభినందనలు తెలియజేద్దాం.

వృత్తం దాటి బయటికి రావాలి
ఎప్పుడూ గిరిగీసుకొని ఉండకూడదు. ఈ విశాల ప్రపంచంలో మనం చేయడానికి ఎంతో ఉంది. చుట్టూ గీసుకున్న వృతాన్ని దాటి బయటి వస్తే అద్భుతప్రపంచం మనకు కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు ఏం చేయలేదు? ఇకముందు ఏం చేయాలి? అనేది అవగాహనకు వస్తుంది. కొత్త శక్తి మనకు చేరువ అవుతుంది.
– తులికారాణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top