భక్త రామదాసు నేలకొండపల్లిలో ప్రాచీన బౌద్ధ క్షేత్రం!

Telangana Muchatlu: NRI Vemula Prabhakar About Nelakondapalli - Sakshi

భక్త రామదాసు అనగానే ముందుగా అందరూ చెప్పేది ఆయన శ్రీ రాముని ఆలయం నిర్మించిన (1664) భద్రాద్రి గురించి. రామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న (1620-1688) పుట్టిన ఊరు నేలకొండపల్లిలో వారి స్వగృహం (ఇప్పుడు ధ్యాన మందిరంగా మార్చారు) వారి ఇష్టదైవం శ్రీరాజగోపాలస్వామి గుడి ఉన్నాయి.

రామదాసు జగమెరిగిన రామ భక్తుడు, ఆయన కీర్తనల్లో, దాశరథి శతకంలో వినబడేది రామకథనే, కాని వారి ఊరు మాత్రం మహాభారత కథతో (విరాట్రాజు దిబ్బ, కీచకగుండం లాంటివి ) ముడిపడి ఉండడం విశేషం. అంతేకాదు నేలకొండపల్లి క్రీ శ2-6 శతాబ్దుల మధ్య కాలంలో ప్రసిద్ధమైన బౌద్ధమత కేంద్రం కావడం మరో విశేషం.

ఆ కాలంలో ముడి ఇనుముతో, పంచలోహలతో ఇక్కడ తయారైన బుద్ధ విగ్రహాలు దక్షిణ భారత మంతా పంపిణీ చేయబడేవట. నేలకొండపల్లి ఎర్రమట్టిదిబ్బలో 1976 లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అమరావతి కన్నా పెద్దదిగా భావించబడే బౌద్ధస్తూపం ఈ గ్రామ చరిత్రనే మార్చేసింది.

ఈ చక్రాకార స్తూపం చుట్టూ 180 ఎత్తు 16మీ గా 2 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. దీనిపైనున్న బ్రాహ్మి లిపి శాసనాన్ని క్రీ శ 3-4 శతాబ్దులదిగా భావిస్తున్నారు. స్తూప పరిసరాల్లోని దాదాపు నూరు ఎకరాల్లో మజ్జుగూడెం వరకు బౌద్ధ బిక్షుల నివాసాలు, నల్లదిబ్బ ప్రాంతంలో చైత్యాలు, మట్టిబొమ్మలు,నీటితొట్టెలు, బైరాగిగుట్ట వద్ద విగ్రహాల తయారీ కేంద్ర శిథిలాలు బయట పడ్డాయట.

ఇక్కడున్న బాలసముద్రం సరస్సులో ఒక జాలరి వలకు చిక్కిన బుద్ధుని పంచలోహ విగ్రహం చాలా విలువైనదట. బాదనకుర్తి, ఫణిగిరి,ధూళికట్ట బౌద్ధ క్షేత్రాల్లా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా పురావస్తు శాఖవారు శిథిలమైన నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి పూర్వరూపం తేవడంతో ఇది దేశ విదేశ బౌద్ధ యాత్రికులను ఆకర్శించడం సంతోషకరం.


-వేముల ప్రభాకర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top